Vehicle companies
-
త్వరలో మహీంద్రా బీఎస్–6 వాహనాలు
ముంబై: మోటార్ వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని నియంత్రించే లక్ష్యంతో భారత ప్రభుత్వం భారత్ స్టేజ్ (బీఎస్) నిబంధనలను ఎప్పటికప్పుడు మార్పులుచేస్తుండగా.. వీటికి అనుగుణంగా తమ వాహనాల ఉత్పత్తిలో మార్పులు చేస్తున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి ‘బీఎస్–సిక్స్’ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో తాజా నిబంధనలకు తగిన వాహనాలను ఈ ఏడాది నుంచే విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై మాట్లాడిన ఎంఅండ్ఎం మేనేజింగ్ డైరెక్టర్ పవన్ గోయెంకా.. ‘ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికం చివరినాటికి బీఎస్–6 గ్యాసోలిన్ వాహనాన్ని సిద్ధంచేస్తున్నాం. ఈ వాహనానికి.. నూతన నిబంధనలకు తగిన విధంగా ఇంధనం ఉండాలనే ఆంక్షలు లేనందున తొలుత దీనిని విడుదలచేస్తున్నాం. అయితే, డీజిల్ వాహనానికి మాత్రం దేశం మొత్తం ఒకే బీఎస్–6 ఇంధనం అందుబాటులో ఉండాలన్న నిబంధన ఉన్నందున ఈ వాహన విడుదల ఆలస్యం కానుంది. నూతన నిబంధనలకు సరిపడే విధంగా వాహనాలను ఉత్పత్తి చేయడం కోసం రూ.1,000 కోట్లు పెట్టుబడి పెట్టాం. అమలుకు సంబంధించి ఎటువంటి టెక్నికల్ సమస్యలను ఎదుర్కొలేదు. ముందస్తు ప్రణాళికతో నూతనతరం వాహనాలను అందుబాటులోకి తీసుకునిరావడానికి రంగం సిద్ధంచేశాం’ అని అన్నారు. -
పాత పేరు... కొత్త జోరు!!
న్యూఢిల్లీ: సినిమాల రీమేక్ తెలుసుకదా? పాత సినిమాను మళ్లీ తీస్తారు. ఇక్కడ కథ దాదాపు మారకపోవచ్చు. కానీ డైరెక్టర్, హీరో, హీరోయిన్, ఇతర నటీనటులు మాత్రం కొత్త వాళ్లుంటారు. అలాగే కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది కనక దాని సాయంతో సినిమాను మంచి క్వాలిటీతో తీస్తారు. పాత సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడు దాన్ని మళ్లీ తీస్తున్నారనే వార్త వస్తే అది వెంటనే ఆడియన్స్‌కు చేరిపోతుంది. హైప్ క్రియేట్ అవుతుంది. ఇదంతా ఎందుకంటే... ఇటీవల కాలంలో వాహన తయారీ కంపెనీలూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. పాత బ్రాండ్ల వెంటపడుతున్నాయి. కొత్త ప్రొడక్టులకు పాత బ్రాండ్ పేరు తగిలించి మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. దిగ్గజ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తన హ్యాచ్‌బ్యాక్ కారు ‘బాలెనో’ను మళ్లీ మార్కెట్లో లాంచ్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన మస్తాన్‌వలీ ఈ మధ్యే ఆ కారు కొన్నాడు. అది పాత బ్రాండ్ కదా? ఎందుకు కొన్నావు? అని స్నేహితులు అడిగితే.. మెరుగైన నాణ్యతతో, ప్రీమియం ఫీచర్లతో కంపెనీ కారును మార్కెట్లోకి తీసుకువచ్చిందని, అందుకే కొన్నానని సమాధానమిచ్చాడు. ఇక్కడ మస్తాన్‌వలీ ఒక్కడే కాదు!! ఆయనలాగా చాలా మంది ఆ బ్రాండ్ వాహనాలను కొన్నారు. కంపెనీలు ఇదే అంశంతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని చూస్తున్నాయి. కొత్త ఫీచర్లతో పాత బ్రాండ్లను మళ్లీ తీసుకువస్తే వాటికి ఆదరణ ఉంటోందని కంపెనీలు భావిస్తున్నాయి. పాత బ్రాండ్లతో ప్రయోజనాలు: ఆటోమొబైల్ కంపెనీలకు పాత బ్రాండ్లతో రెండు ప్రధానమైన ప్రయోజనాలున్నాయి. అందులో మొదటిది పబ్లిసిటీ. కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరిస్తే.. దాన్ని కస్టమర్లకు చేరువ చేయడానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. పాత బ్రాండ్లకు అవసరం లేదు. రెండోది కాలం. కొత్త మోడల్ కస్టమర్లను ఆకర్షించాలంటే కొంత కాలం పడుతుంది. అదే పాత బ్రాండ్లు అయితే అందరికీ తెలిసే ఉంటాయి. మళ్లీ వాటిని మార్కెట్లోకి తీసుకువస్తే వెంటనే వినియోగదారులకు కనెక్ట్ అవుతాయి. కొత్తవి క్లిక్ అవుతాయా? కంపెనీలకు ఇక్కడ ఇంకో సమస్య ఉంది. సక్సెస్ అయితే ఓకే. కాకపోతే!!. దాని గురించి మరచిపోవాలి. అలాగే ఆ బ్రాండ్ కంపెనీపై కొంతమేర ప్రతికూల ప్రభావం చూపుతుంది. జఫ్రీస్ ఈక్విటీ రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ సర్వే ప్రకారం.. 2014–17 మధ్యకాలంలో టూవీలర్ విభాగంలో 26 కొత్త మోడళ్ల ఆవిష్కరణల్లో కేవలం ఒక్కటే విజయవంతమయ్యింది. ఇక ఫోర్‌వీలర్ విభాగానికి వస్తే సక్సెస్ రేటు 35కి 8గా ఉంది. భారత్‌లోనూ ఇదే ట్రెండ్: పాత బ్రాండ్ల పునరుద్ధరణ అంతర్జాతీయంగా ఎప్పటి నుంచో ఉంది. భారత్‌లో ఇటీవలే ఈ ట్రెండ్ మొదయ్యింది. ‘కొన్ని బ్రాండ్లుంటాయి. అవి ప్రస్తుతం మార్కెట్లో ఉండకపోవచ్చు. కానీ కస్టమర్లకు బాగా గుర్తుంటాయి. ఇలాంటి వారి కోసం కంపెనీలు పాత బ్రాండ్లను మరిన్ని ప్రత్యేకతలతో మళ్లీ మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి’ అని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ కుమార్ కందస్వామి తెలిపారు. శాంత్రో మళ్లీ వస్తోంది!! హ్యుందాయ్ మోటార్ ఇండియా తన శాంత్రో బ్రాండ్‌ను మళ్లీ 2018లో మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దీంతో ఎంట్రీ లెవెల్ విభాగంలో జెండా ఎగరవేయాలని కంపెనీ భావిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త ఇంటర్‌సెప్టర్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఇంటర్‌సెప్టర్‌ను మళ్లీ మార్కెట్లో ఆవిష్కరించింది. ‘పాపులర్ పాత బైక్స్ కస్టమర్లపై బాగా ప్రభావం చూపి ఉంటాయి. దాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంటర్‌సెప్టర్ 1960–70 నాటి బైక్. అమెరికన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించారు. మేమిప్పుడు సరికొత్త ఇంటర్‌సెప్టర్‌ను ఆవిష్కరించాం’ అని రాయల్ ఎన్ఫీల్డ్ స్ట్రాటజీ హెడ్ మార్క్ వెల్స్ తెలిపారు. పాత బ్రాండ్లతో లాభమా? నష్టమా? పాత బ్రాండ్లను తీసుకురావడం వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. పాపులర్ అయిన పాత బ్రాండ్లను మళ్లీ తీసుకురావడం గొప్ప విషయం కాదు. బ్రాండ్ల రూపకల్పన, అభివృద్ధికి ఈ చర్య వ్యతిరేకం. ఆటోమొబైల్ పరిశ్రమలో బ్రాండ్లు అనేవి ప్రత్యేకమైన శకానికి సంబంధించి ఉంటాయి. గతకాలపు అభిరుచులను గుర్తుకు చేస్తాయి. ‘కంపెనీలు కొత్త బ్రాండ్లు తీసుకువచ్చినా కస్టమర్లు ఆదరిస్తారు. దానికి పలు ఉదాహరణలున్నాయి. వ్యయాల తగ్గుదలను దృష్టిలో ఉంచుకుంటే పాత బ్రాండ్లను పునరుద్ధరించొచ్చు’ అని హరీశ్ బిజూర్ కన్సల్టెన్స్ వ్యవస్థాపకుడు హరీశ్ బిజూర్ తెలిపారు. ‘కొన్ని మోడళ్ల వల్ల కంపెనీలు వెలుగులోకి వస్తాయి. కొన్ని సందర్భాల్లో బ్రాండ్లు.. కంపెనీ పేరును గుర్తుకు తెస్తాయి. ఇలాంటి బ్రాండ్లను కంపెనీలు పునరుద్ధరిస్తే ఫలితం ఉంటుంది’ అని బ్రాండ్ కన్సల్టెన్సీ సంస్థ ఎక్స్పీరియల్ ఫౌండర్ అవీక్ చటోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు. -
వాహన సంస్థల ’మిలియన్’ మార్చ్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజాలైన హీరో మోటోకార్ప్, హోండా సంస్థలు పండుగ సీజన్లో పది లక్షల వాహనాల విక్రయాల మైలురాయిని అధిగమించాయి. ఆగస్టు మధ్యలో ప్రారంభమైన పండుగ సీజన్లో ఇప్పటిదాకా 10,52,000 ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు హోండా వెల్లడించగా, తాము సైతం ఇప్పటిదాకా మిలియన్ పైగా వాహనాలను విక్రయించినట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. ఇక గత నెల గణాంకాల విషయానికొస్తే.. హీరో మోటోకార్ప్ 6.78% వృద్ధితో రికార్డు స్థాయిలో 7,20,739 ద్విచక్ర వాహనాలు విక్రయించింది. గత సెప్టెంబర్‌లో అమ్మకాలు 6,74,961. నెలవారీగా 7 లక్షల వాహన విక్రయాల మైలురాయి దాటడం ఇదే తొలిసారి అని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. అటు హోండా 6,01,998 యూనిట్లు విక్రయించింది. సెప్టెంబర్‌లో బజాజ్ అమ్మకాలు 14% అప్ మరోవైపు, బజాజ్ ఆటో అమ్మకాలు గత నెలలో 14 శాతం పెరిగాయి. కంపెనీ మొత్తం రూ. 4,28,752 వాహనాలు విక్రయించింది. గతేడాది సెప్టెంబర్‌లో అమ్మకాలు 3,76,765 యూనిట్లు. సెప్టెంబర్‌లో మొత్తం ఎగుమతులు 1,21,173 నుంచి 21 శాతం వృద్ధితో 1,46,973కి చేరాయి. సుజుకీ మోటార్ కార్ప్‌లో భాగమైన సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో 50,785 వాహనాలు విక్రయించింది. ఎగుమతులు కూడా కలిపితే సుమారు 33 శాతం వార్షిక వృద్ధితో మొత్తం 57,469 యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తెలిపింది. అటు, వీఈ కమర్షియల్ వెహికల్స్ (వోల్వో గ్రూప్, ఐషర్ మోటార్స్ జాయింట్ వెంచర్ సంస్థ) గత నెలలో 6,083 వాహనాలు విక్రయించింది. -
హైదరాబాద్‌లో సీడీకే గ్లోబల్ కార్యాలయం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన కంపెనీలు, డీలర్లకు టెక్నాలజీ సొల్యూషన్స్ అందిస్తున్న సీడీకే గ్లోబల్ హైదరాబాద్‌తోపాటు పుణేలో కార్యాలయాలను ప్రారంభించింది. హైదరాబాద్‌లో 1,000 సీట్లు, పుణేలో 500 సీట్ల సామర్థ్యంతో వీటిని నెలకొల్పింది. రెండు కార్యాలయాల్లో ప్రస్తుతం 800 మంది సిబ్బంది ఉన్నారు. వీటి ఏర్పాటుకు సుమారు రూ.100 కోట్లు వ్యయం చేసింది. నిర్వహణకు ఈ ఏడాది మరో రూ.220 కోట్లు వ్యయం చేస్తామని సీడీకే గ్లోబల్ సీఈవో స్టీవెన్ జె అనెనెన్ తెలిపారు. కంపెనీ ఇండియా ఎండీ రెడ్డి మల్లెడితో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘సీడీకే గ్లోబల్‌కు 100 దేశాల్లో 26 వేల మంది క్లయింట్లున్నారు. అమ్మకాలు పెరిగేందుకు కంపెనీ సేవలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా రూ.2.5 లక్షల కోట్ల విలువైన వ్యాపార అవకాశాలున్నాయి’ అని వివరించారు. -
150 సీసీ బైక్స్.. స్మార్ట్ రైడర్స్!
- కొనే ముందే మోడళ్లపై కసరత్తు - అత్యుత్తమమైతేనే రైడింగ్‌కు సై - దేశంలో నెలకు 80 వేల బైక్‌ల విక్రయం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహనమనగానే తొలుత గుర్తొచ్చేది మైలేజీ. అదే 150 సీసీ స్పోర్ట్ బైక్‌ల విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. అసలే యువ కస్టమర్లు. భిన్నమైన అభిరుచులు. వీరికి కావాల్సిందల్లా అత్యాధునిక టెక్నాలజీతో పవర్ఫుల్ మోడల్. ఇతర మోడళ్లకు ధీటుగా, ఆకర్షణీయంగా ఉండాల్సిందే. బైక్ గురించి పూర్తిగా అధ్యయనం చేశాకే కస్టమర్లు రైడ్‌కు సై అంటున్నారట. ఇందుకోసం రైడర్లు పెద్ద కసరత్తే చేస్తున్నారని వాహన కంపెనీలు అంటున్నాయి. ఇంటర్నెట్లో సర్చ్ చేయడం మొదలు టెస్ట్ రైడ్ వరకు అదో పెద్ద పరీక్షేనని చెబుతున్నాయి. భారత్‌లో 150 సీసీ విభాగంలో అన్ని కంపెనీలవి కలిపి నెలకు సుమారు 80 వేల బైక్‌లు అమ్ముడవుతున్నాయి. బైక్‌లపై అవగాహన.. మార్కెట్లోకి ఎటువంటి బైక్‌లు వస్తున్నాయి. వాటి సామర్థ్యమెంత. అంతర్జాతీయంగా ఏ మోడల్‌ను ఆధారంగా చేసుకుని డిజైన్ చేశారు. ఎటువంటి టెక్నాలజీని వాడారు వంటి ప్రశ్నలకు సమాధానం కస్టమర్ల వద్దే ఉంటోందని అంటున్నారు సుజుకి మోటార్ సైకిల్ ఇండియా మార్కెటింగ్ నేషనల్ హెడ్ అను అనామిక. ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని సేకరించడంలో 18-25 ఏళ్ల యువ రైడర్లు ముందుంటున్నారని వివరించారు. 100 సీసీ అంటే మైలేజీ, 125 సీసీ మైలేజీతోపాటు కొంచెం స్టైల్ అన్న భావన కస్టమర్లలో ఉందన్నారు. ‘150 సీసీ విషయంలో మాత్రం స్టైల్, పవర్, టెక్నాలజీయే గీటురాయి. బ్రాండ్ కూడా ప్రాధాన్య అంశమే. కంపెనీల మధ్య అత్యంత పోటీ విభాగమి ది. కస్టమర్లను మెప్పిం చడం చాలా కష్టం’ అని చెప్పారు. ఇప్పుడు మైలేజీ అధికంగా ఇచ్చే బైక్‌లూ వస్తున్నాయని తెలిపారు. మొత్తంగా అత్యుత్తమమైతేనే బైక్‌ను కొంటారని అన్నారు. కొత్త మోడళ్లు వస్తున్నాయ్.. 150 సీసీ బైక్‌ల విక్రయాల్లో 50 శాతం వాటాతో బజాజ్ పల్సర్ అగ్రస్థానంలో ఉంది. బజాజ్ డిస్కవర్లోనూ 150 సీసీ మోడళ్లున్నాయి. హోండా యునికార్న్, సీబీఆర్ 150ఆర్, యమహా ఫేజర్, ఎఫ్‌జడ్-ఎస్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160(ఇది 160 సీసీ), హీరో ఎక్స్ట్రీమ్, హంక్, అచీవర్, సుజుకి జిక్సర్(155 సీసీ), జీఎస్ 150-ఆర్ వంటి మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది. సుజుకి ఇటీవల విడుదల చేసిన జిక్సర్ సిరీస్‌లో కమ్యూటర్ బైక్ వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. అలాగే హీరో మోటో 150 సీసీతో కొత్త బైక్‌ను కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టబోతోంది. హోండా కూడా కమ్యూటర్ బైక్‌ను తీసుకొస్తోంది. అయితే ఇంజిన్ సామర్థ్యం 160 సీసీ ఉండొచ్చని సమాచారం. 2 శాతం అధికం.. భారత్‌లో నెలకు 13.5 లక్షల ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతున్నాయి. ఇందులో స్కూటర్లు 26 శాతం వాటాతో 3.5 లక్షల యూనిట్లుంది. మోటార్ సైకిళ్ల అమ్మకాల వృద్ధి రేటు 10-12 శాతముంది. సాధారణ బైక్‌లతో పోలిస్తే 150 సీసీ బైక్‌ల అమ్మకాల వృద్ధి రానున్న రోజుల్లో గణనీయంగా పెరుగుతుందని బజాజ్ మోటార్ సైకిల్ విభాగం ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. 100, 125 సీసీతో పోలిస్తే 150 సీసీ విభాగం వృద్ధి రేటు ప్రస్తుతం 2 శాతం అదనంగా ఉందని అన్నారు. ఈ విభాగంలో సగం కస్టమర్లు 100, 125 సీసీ నుంచి అప్‌గ్రేడ్ అయితే, మిగిలిన సగం మంది తొలిసారిగా బైక్‌ను కొనేవారుంటున్నారని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్త తెలిపారు. జిక్సర్ ద్వారా 150 సీసీ బైక్‌ల విభాగంలో 10 శాతం మార్కెట్ వాటాను మార్చినాటికి దక్కించుకుంటామని పేర్కొన్నారు.