న్యూఢిల్లీ: సినిమాల రీమేక్ తెలుసుకదా? పాత సినిమాను మళ్లీ తీస్తారు. ఇక్కడ కథ దాదాపు మారకపోవచ్చు. కానీ డైరెక్టర్, హీరో, హీరోయిన్, ఇతర నటీనటులు మాత్రం కొత్త వాళ్లుంటారు. అలాగే కొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది కనక దాని సాయంతో సినిమాను మంచి క్వాలిటీతో తీస్తారు. పాత సినిమా అందరికీ తెలిసే ఉంటుంది. అప్పుడు దాన్ని మళ్లీ తీస్తున్నారనే వార్త వస్తే అది వెంటనే ఆడియన్స్‌కు చేరిపోతుంది. హైప్ క్రియేట్ అవుతుంది. ఇదంతా ఎందుకంటే... ఇటీవల కాలంలో వాహన తయారీ కంపెనీలూ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. పాత బ్రాండ్ల వెంటపడుతున్నాయి. కొత్త ప్రొడక్టులకు పాత బ్రాండ్ పేరు తగిలించి మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి.
దిగ్గజ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా తన హ్యాచ్‌బ్యాక్ కారు ‘బాలెనో’ను మళ్లీ మార్కెట్‌లో లాంచ్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన మస్తాన్‌వలీ ఈ మధ్యే ఆ కారు కొన్నాడు. అది పాత బ్రాండ్ కదా? ఎందుకు కొన్నావు? అని స్నేహితులు అడిగితే.. మెరుగైన నాణ్యతతో, ప్రీమియం ఫీచర్లతో కంపెనీ కారును మార్కెట్‌లోకి తీసుకువచ్చిందని, అందుకే కొన్నానని సమాధానమిచ్చాడు. ఇక్కడ మస్తాన్‌వలీ ఒక్కడే కాదు!! ఆయనలాగా చాలా మంది ఆ బ్రాండ్ వాహనాలను కొన్నారు. కంపెనీలు ఇదే అంశంతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవాలని చూస్తున్నాయి. కొత్త ఫీచర్లతో పాత బ్రాండ్లను మళ్లీ తీసుకువస్తే వాటికి ఆదరణ ఉంటోందని కంపెనీలు భావిస్తున్నాయి.
పాత బ్రాండ్లతో ప్రయోజనాలు: ఆటోమొబైల్ కంపెనీలకు పాత బ్రాండ్లతో రెండు ప్రధానమైన ప్రయోజనాలున్నాయి. అందులో మొదటిది పబ్లిసిటీ. కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరిస్తే.. దాన్ని కస్టమర్లకు చేరువ చేయడానికి చాలా ఖర్చు చేయాల్సి వస్తుంది. పాత బ్రాండ్లకు అవసరం లేదు. రెండోది కాలం. కొత్త మోడల్ కస్టమర్లను ఆకర్షించాలంటే కొంత కాలం పడుతుంది. అదే పాత బ్రాండ్లు అయితే అందరికీ తెలిసే ఉంటాయి. మళ్లీ వాటిని మార్కెట్‌లోకి తీసుకువస్తే వెంటనే వినియోగదారులకు కనెక్ట్ అవుతాయి.
కొత్తవి క్లిక్ అవుతాయా?
కంపెనీలకు ఇక్కడ ఇంకో సమస్య ఉంది. సక్సెస్ అయితే ఓకే. కాకపోతే!!. దాని గురించి మరచిపోవాలి. అలాగే ఆ బ్రాండ్ కంపెనీపై కొంతమేర ప్రతికూల ప్రభావం చూపుతుంది. జఫ్రీస్ ఈక్విటీ రీసెర్చ్ అండ్ స్ట్రాటజీ సర్వే ప్రకారం.. 2014–17 మధ్యకాలంలో టూవీలర్ విభాగంలో 26 కొత్త మోడళ్ల ఆవిష్కరణల్లో కేవలం ఒక్కటే విజయవంతమయ్యింది. ఇక ఫోర్‌వీలర్ విభాగానికి వస్తే సక్సెస్ రేటు 35కి 8గా ఉంది.
భారత్‌లోనూ ఇదే ట్రెండ్: పాత బ్రాండ్ల పునరుద్ధరణ అంతర్జాతీయంగా ఎప్పటి నుంచో ఉంది. భారత్‌లో ఇటీవలే ఈ ట్రెండ్ మొదయ్యింది. ‘కొన్ని బ్రాండ్లుంటాయి. అవి ప్రస్తుతం మార్కెట్‌లో ఉండకపోవచ్చు. కానీ కస్టమర్లకు బాగా గుర్తుంటాయి. ఇలాంటి వారి కోసం కంపెనీలు పాత బ్రాండ్లను మరిన్ని ప్రత్యేకతలతో మళ్లీ మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి’ అని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ కుమార్ కందస్వామి తెలిపారు.
శాంత్రో మళ్లీ వస్తోంది!!
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన శాంత్రో బ్రాండ్‌ను మళ్లీ 2018లో మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. దీంతో ఎంట్రీ లెవెల్ విభాగంలో జెండా ఎగరవేయాలని కంపెనీ భావిస్తోంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త ఇంటర్‌సెప్టర్
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఇంటర్‌సెప్టర్‌ను మళ్లీ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ‘పాపులర్ పాత బైక్స్ కస్టమర్లపై బాగా ప్రభావం చూపి ఉంటాయి. దాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇంటర్‌సెప్టర్ 1960–70 నాటి బైక్. అమెరికన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించారు. మేమిప్పుడు సరికొత్త ఇంటర్‌సెప్టర్‌ను ఆవిష్కరించాం’ అని రాయల్ ఎన్‌ఫీల్డ్ స్ట్రాటజీ హెడ్ మార్క్ వెల్స్ తెలిపారు.
పాత బ్రాండ్లతో లాభమా? నష్టమా?
పాత బ్రాండ్లను తీసుకురావడం వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయి. పాపులర్ అయిన పాత బ్రాండ్లను మళ్లీ తీసుకురావడం గొప్ప విషయం కాదు. బ్రాండ్ల రూపకల్పన, అభివృద్ధికి ఈ చర్య వ్యతిరేకం. ఆటోమొబైల్ పరిశ్రమలో బ్రాండ్లు అనేవి ప్రత్యేకమైన శకానికి సంబంధించి ఉంటాయి. గతకాలపు అభిరుచులను గుర్తుకు చేస్తాయి. ‘కంపెనీలు కొత్త బ్రాండ్లు తీసుకువచ్చినా కస్టమర్లు ఆదరిస్తారు. దానికి పలు ఉదాహరణలున్నాయి.
వ్యయాల తగ్గుదలను దృష్టిలో ఉంచుకుంటే పాత బ్రాండ్లను పునరుద్ధరించొచ్చు’ అని హరీశ్ బిజూర్ కన్సల్టెన్స్ వ్యవస్థాపకుడు హరీశ్ బిజూర్ తెలిపారు. ‘కొన్ని మోడళ్ల వల్ల కంపెనీలు వెలుగులోకి వస్తాయి. కొన్ని సందర్భాల్లో బ్రాండ్లు.. కంపెనీ పేరును గుర్తుకు తెస్తాయి. ఇలాంటి బ్రాండ్లను కంపెనీలు పునరుద్ధరిస్తే ఫలితం ఉంటుంది’ అని బ్రాండ్ కన్సల్టెన్సీ సంస్థ ఎక్స్‌పీరియల్ ఫౌండర్ అవీక్ చటోపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment