స్కీం పేరిట కుచ్చుటోపి | With the name of scheme finance company theft money | Sakshi
Sakshi News home page

స్కీం పేరిట కుచ్చుటోపి

Published Mon, Aug 17 2015 3:59 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM

స్కీం పేరిట కుచ్చుటోపి

స్కీం పేరిట కుచ్చుటోపి

- బోర్డు తిప్పేసిన ఎస్సారార్ ఫైనాన్స్
- మోసపోయిన 540 మంది
- పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, మంచిర్యాల :
అంతా చిరు వ్యాపారులు, చిరుద్యోగులు.. ఒకేసారి ద్విచక్ర వాహనం కొనుగోలు చేసే స్థోమత లేని వారే. ఇక్కడే వీరి అశక్తతను సొమ్ము చేసుకుందామనుకున్న కొందరు దుకాణం తెరిచారు. ‘నెలకు కొంత చెల్లిస్తే చాలు.. ప్రతీనెలా డ్రాలో గెలిచిన వారికి ద్విచక్ర వాహనం ఇస్తాం, ఆ తర్వాత డబ్బు కట్టనవడం లేదు.. ఇక డ్రా రాని వారికి కాలపరిమితి ముగిశాక మొత్తం డబ్బు ఇచ్చేస్తాం’ ఇలాంటి ప్రచారంతో పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేసి.. సుమారు రూ.2కోట్లతో ఉడాయించిన వైనమిది. మంచిర్యాలలో ఎస్సారార్ హైర్‌పర్చేస్ అండ్ ఫైనా న్స్ పేరిట జరిగిన ఈ మోసాన్ని గుర్తించిన పలువురు బాధితులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.
 
36 నెలలు.. నెలకు రూ.1390..
మంచిర్యాల పట్టణం బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఎస్సారార్ మోటార్ క్రెడిట్ పేరిట స్కీంను 2012లో 299 మంది సభ్యులతో ప్రారంభించారు. సభ్యులు నెలకు రూ.1390 చెల్లిస్తే డ్రాలో ఎంపికైన వారికి  రూ. 40,040 తిరిగి ఇస్తామని చెప్పారు. డ్రాలో ఎంపికైన తర్వాత వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రచారం చేయడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నమ్మారు. తర్వాత అవే షరతులు.. నిబంధనలతో మే 2013లో 299 మందితో మరో స్కీం ప్రారంభిం చారు.

రెండు స్కీంల్లో గత నెల వరకు 58 మందిని డ్రాలో ఎంపిక చేశారు. ఇలా సాగుతుండగా.. వాయి దాలు చెల్లించేందుకు కొందరు కార్యాలయానికి గత నెలలో వెళ్తే తాళం వేసి ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసి నా నిర్వాహకులు స్పందించకపోవడంతో ఆదివా రం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఫైనాన్స్ నిర్వాహకులు పంజాల రాజు, వంగర సు మంత్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. కాగా.. ఫైనాన్స్ నిర్వాహకులు పంజాల రాజు 20 రోజుల క్రితమే స్థానిక సీసీసీలోని తన ఇం టికి తాళం వేసి పరారయ్యాడని.. మరో భాగస్వామి వంగతి సుమంత్ రెండు నెలల కిత్రమే తన సొంత ఊరు తెనాలి వెళ్లిపోయాడని తెలుస్తోంది.

కాగా, డ్రా లో గెలిచిన వారిలో కొందరికి ఇంకా బైక్‌లు ఇవ్వలేదని చెబుతున్నారు. మొదటి స్కీం కింద ఇప్పటి  వ రకు 267 మంది(డ్రాలో ఎంపికైన 32 మంది మి నహా) రూ.1,390 చొప్పున రూ.1,18,76,160 చె ల్లించారు. రెండో స్కీం కింద 273 మంది (డ్రాలో ఎంపికైన 26 మంది మినహా)  రూ.98,66,220 చె ల్లించారు. రెండు స్కీంలు కలిపి నిర్వాహకులు రూ. 2.30 కోట్ల పైగానే వసూలు చేసినట్లు అంచనా. కానీ 58 మందికే రూ.40,040 చొప్పున రూ. 23,22,320 మాత్రమే కావడం గమనార్హం. ఈ మేరకు పోలీసు లు సత్వరమే స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరుతున్నారు.
 
నమ్మి మోసపోయా...
నేను సీసీసీలో చిన్న షాపు పెట్టుకుని జీవిస్తున్నా. నెలకు కొంత డబ్బు వెనకేసుకుందామనే ఆలోచనతో పాటు వాహనం తీసుకుందామనే ఉద్దేశ్యంతో నెలకు రూ.1390 ఎస్సారార్‌లో చెల్లించా. ఇప్పటి వరకు 31 నెలల పాటు రూ. 43,090 కట్టాను. ప్రతినెలా ఎవరో ఒకరు డ్రా లో గెలుస్తుండగా, వారిలో కొందరికి ఇంకా బైక్ ఇయ్యలే. ఇప్పటికీ వాళ్లు ఫైనాన్స్ చుట్టూ తిరుగుతున్నారు. ఇంతలో నేను 32వ నెల వాయిదా చెల్లిద్దామని వస్తే ఆఫీసుకు వెళితే బంద్ ఉంది. ఆరా తీస్తే రాజు, సుమంత్ పారిపోయారని తెలిసింది. దీంతో మరికొందరితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశా.     
- కె.యాదగిరి, సీసీసీ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement