పాపం సాకేత్!
బరి తెగింపు.. ఎవరేమి చేస్తారులే అనే బలుపు.. వెంటాడి లాగేద్దాం వస్తే గొలుసులు.. పోతే ప్రాణాలు అన్నట్లు.. చైన్ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. గురువారం ఒక్క రాత్రే ఒక్క రాజేంద్రనగర్ పరిసరాల్లో కేవలం గంటన్నరలో మూడు ఉదంతాలు చోటు చేసుకున్నాయి. పాపం ఓ చిన్నారి తీవ్రంగా గాయపడడం విచారకరం.
రాజేంద్రనగర్: రోజురోజుకీ బరితెగిస్తున్న స్నాచర్లు పోలీసులకే సవాల్ విసురుతున్నారు. మెడలో ఉన్న గొలుసుల్ని లాగే క్రమంలో తీవ్రంగా గాయపడుతున్న బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఉస్మానియా వర్శిటీ పరిధిలో ఏకంగా ఓ మహిళ మృత్యువాత పడింది. గురువారం రాత్రి రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో జరిగిన వరుస స్నాచింగ్స్‌లో ఏడాదిన్నర వయస్సున్న సాకేత్ తీవ్రంగా గాయపడ్డాడు. స్నాచర్లు పంజా విసిరే సమయంలో వాహనంపై ప్రయాణిస్తున్న తల్లిఒడిలో నిద్రిస్తున్న ఈ పసివాడు తల్లితో సహా కిందపడ్డాడు. రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి 8.30 నుంచి 10 గంటల మధ్య మూడు ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ఒకే ముఠా పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదర్‌గూడకు చెందిన చంద్రశేఖర్ తన భార్య లావణ్య, కుమారుడు సాకేత్‌లతో కలిసి పల్లెచెర్వులో జరిగిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు.
కార్యక్రమం ముగిసిన తర్వాత తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆరామ్‌ఘర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు లావణ్య మెడలోని మూడు తులాలు బంగారు గొలుసు లాగేశారు. ఆకస్మికంగా జరిగిన ఈ ఉదంతంతో అదుపు తప్పిన లావణ్య ఒడిలోని బిడ్డతో సహా రోడ్డుపై పడిపోయారు. దీంతో లావణ్యకు స్వల్ప గాయాలు కాగా.. సాకేత్ ఎడమ కాలు విరగడంతో పాటు ముఖానికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరూ స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందారు. స్నాచింగ్ విషయం చెప్తున్న పోలీసులు బాలుడికి గాయాలైన విషయాన్ని మాత్రం అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.
మరో రెండు ఘటనల్లో...
శివరామ్‌పల్లికి చెందిన విజయ్ తన భార్య లలితతో కలిసి పల్లెచెర్వులో బతుకమ్మ సంబరాలకు హాజరై తిరిగి వస్తున్నారు. పల్లెచెర్వు దాటిని కొద్దిసేపటికే వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లలిత మెడలోని 2.5 తులాల పుస్తెలతాడు తాక్కుని ఉడాయించారు.
హైదర్‌గూడకు చెందిన వెంకటయ్య తన భార్య సంతోషితో కలిసి స్థానికంగా ఉన్న సాయిబాబ దేవాలయానికి వెళ్ళారు తిరిగి వస్తున్న సమయంలో వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సంతోషి మెడలోని 3.5 తులాల బంగారు గొలుసు స్నాచింగ్ చేశారు.
మహిళ మెడలో గొలుసు మాయం
కుత్బుల్లాపూర్: ఆటోలో మాయ లేడీలు ఓ మహిళ మెడ నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. కుత్బుల్లాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసముండే శశికళ ఐడీపీఎల్ ఎస్‌బిహెచ్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె బుధవారం షాపూర్‌నగర్ నుంచి ఆటోలో బ్యాంక్‌కు బయలుదేరారు. ఆ సమయంలో ముఖాలకు స్కార్ఫ్‌లు కట్టుకున్న ముగ్గురు మహిళలు చుట్టూ పోగై పథకం ప్రకారం మెడలో ఉన్న సుమారు రూ.1.20 లక్షల విలువ చేసే ఐదు తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. బ్యాంక్‌కు వెళ్లిన శశికళ మెడలో పుస్తెలతాడు లేకపోవడంతో తోటి ఉద్యోగులు అడగ్గా ఆమె గొలుసు పోయిన విషయం గుర్తించి షాకయ్యారు. ఈ విషయంపై బాలానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆటో నడిపిన వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
చైన్ స్నాచింగ్
బంజారా హిల్స్: ఇంటి ముందు నిలబడిన మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు తస్కరించిన ఘటన శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పొలీసులు తెలిపిన వివరాలు.. శ్రీనగర్ కాలనీ సమీపంలోని ఎల్లారెడ్డిగూడ ఆర్ బీఐ క్వార్టర్స్ ఎదురుగా నివసించే విజయలక్ష్మి (44) అనే మహిళ శుక్రవారం రాత్రి 9 సమయంలో భోజనం చేసి వచ్చి ఇంటి ముందు నిలబడింది. అమె నిలబడ్డ రెండు మూడు నిమిషాలకే నంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్‌పై ముసుగులు ధరించి వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆమె మెడలోని రెండు తులాల మంగళ సూత్రాన్ని లాక్కొని క్షణాల్లో పరారయ్యారు. ఒక్క ఉదుటన గొలుసు లాగడంతో ఆమె కింద పడి పోయింది. ఆమె కేకలు విని కుటుంబం సభ్యులు బయటకు వచ్చి ప్రథమ చికిత్స చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు దర్యాప్తు చేస్తున్నారు.