మెదక్: తవ్వినకొద్దీ అక్రమాలే.. అన్నట్లుగా మారింది ఏడుపాయల ఆలయ ఈఓ వ్యవహార శైలి. వనదుర్గామాత ఆభరణాల వ్యవహారం ఇంకా సమసిపోకముందే తునికి నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు విషయం తెరమీదకు వచ్చింది. మొక్కులో భాగంగా 2018లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అమ్మవారికి బంగారు గొలుసును సమర్పించారు. దీనిని అప్పటి ఈఓ శ్రీనివాస్‌కు అప్పగించారు. కాగా ప్రస్తుతం ఆ గొలుసు రికార్డుల్లో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
బయటకొచ్చింది ఇలా..
2016 నుంచి 2019 వరకు కౌడిపల్లి మండలం తునికినల్ల పోచమ్మ ఆలయంలో శ్రీనివాస్ ఈఓగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అమ్మవారికి 5 తులాల బంగారు గొలుసును బహూకరించారు. 2019 జూన్‌లో ఈఓ శ్రీనివాస్ ఏడుపాయల ఆలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
ఇటీవల ఎమ్మెల్యే దంపతులు నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వస్తున్నారని, ఆయన అందించిన బంగారు గొలుసును అమ్మవారికి అలంకరించాలని ఆలయ చైర్మన్ గోపాల్‌రెడ్డి ప్రస్తుత ఈఓ మోహన్‌రెడ్డికి సూచించారు. కాగా.. శ్రీనివాస్ బదిలీ అయిన సమయంలో తనకు చెక్‌బుక్, క్యాష్‌బుక్‌లు మాత్రమే ఇచ్చారని, అమ్మవారి ఆభరణాలు ఏమీ ఇవ్వలేదంటూ మోహన్ రెడ్డి చెప్పడంతో అసలు విషయం బయటకువచ్చింది.
ఆలయానికి సంబంధించిన లావాదేవీల వివరాలను ఎందుకు రికార్డు చేయలేదనే ప్రశ్న తలెత్తుతుంది. ఎమ్మెల్యే బహూకరించిన గొలుసునే రికార్డులో లేదంటే మామూలు భక్తులు అందించిన కానుకల మాటేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు విషయంపై ఈఓ సార శ్రీనివాస్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బంగారు చైన్ బహూకరించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కాగా అది తన సంరక్షణలోనే ఉందని చెప్పడం కొసమెరుపు.
Comments
Please login to add a commentAdd a comment