nalla pochamma temple
-
ప్రజాభవన్‌లో వైభవంగా బోనాలు
లక్డీకాపూల్: ఆషాడ మాసం సందర్భంగా ఆదివారం తెలంగాణ ప్రజాభవన్‌లోని నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి హాజరయ్యారు. ప్రజాభవన్‌కి విచ్చేసిన సీఎం, మంత్రులకు భట్టి దంపతులు పుష్ప గుచ్చాలతో స్వాగతం పలికారు. పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భట్టి దంపతులు బోనాలకు, మహంకాళి అమ్మవారి ఘటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత నల్ల పోచమ్మ అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేశా రు. అనంతరం మంత్రి కొండా సురేఖ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, ఎమ్మెల్యే ఎన్ ఉత్తమ్ పద్మావతి, పలువురు మహిళా ప్రజా ప్రతినిధులు బోనమెత్తారు. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మహంకాళి అమ్మవారి ఘటాన్ని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చి జోగిని తలపై ఎత్తారు.డిప్యూటీ సీఎం నివాసం నుంచి ప్రజాభవన్ ఆవరణలోని నల్ల పోచమ్మ దేవాల యం వరకు డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యా సాల మధ్యన బోనాలను ఎత్తుకెళ్లారు. అనంతరం అమ్మవారికి భట్టి విక్రమార్క దంపతులు బోనంలో ఉన్న నైవేద్యాన్ని సమరి్పంచారు. నల్ల పోచమ్మ దేవాలయంలో భట్టి విక్రమార్కతో కలిసి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో విలసిల్లాలని అమ్మవారిని వేడుకున్నారు. -
తునికి నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు.. అసలు ఏమైంది..??
మెదక్: తవ్వినకొద్దీ అక్రమాలే.. అన్నట్లుగా మారింది ఏడుపాయల ఆలయ ఈఓ వ్యవహార శైలి. వనదుర్గామాత ఆభరణాల వ్యవహారం ఇంకా సమసిపోకముందే తునికి నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు విషయం తెరమీదకు వచ్చింది. మొక్కులో భాగంగా 2018లో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అమ్మవారికి బంగారు గొలుసును సమర్పించారు. దీనిని అప్పటి ఈఓ శ్రీనివాస్‌కు అప్పగించారు. కాగా ప్రస్తుతం ఆ గొలుసు రికార్డుల్లో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బయటకొచ్చింది ఇలా.. 2016 నుంచి 2019 వరకు కౌడిపల్లి మండలం తునికినల్ల పోచమ్మ ఆలయంలో శ్రీనివాస్ ఈఓగా విధులు నిర్వర్తించారు. అప్పట్లో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అమ్మవారికి 5 తులాల బంగారు గొలుసును బహూకరించారు. 2019 జూన్‌లో ఈఓ శ్రీనివాస్ ఏడుపాయల ఆలయానికి బదిలీ కాగా, ఆయన స్థానంలో మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఎమ్మెల్యే దంపతులు నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి వస్తున్నారని, ఆయన అందించిన బంగారు గొలుసును అమ్మవారికి అలంకరించాలని ఆలయ చైర్మన్ గోపాల్‌రెడ్డి ప్రస్తుత ఈఓ మోహన్‌రెడ్డికి సూచించారు. కాగా.. శ్రీనివాస్ బదిలీ అయిన సమయంలో తనకు చెక్‌బుక్, క్యాష్‌బుక్‌లు మాత్రమే ఇచ్చారని, అమ్మవారి ఆభరణాలు ఏమీ ఇవ్వలేదంటూ మోహన్ రెడ్డి చెప్పడంతో అసలు విషయం బయటకువచ్చింది. ఆలయానికి సంబంధించిన లావాదేవీల వివరాలను ఎందుకు రికార్డు చేయలేదనే ప్రశ్న తలెత్తుతుంది. ఎమ్మెల్యే బహూకరించిన గొలుసునే రికార్డులో లేదంటే మామూలు భక్తులు అందించిన కానుకల మాటేమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నల్లపోచమ్మ అమ్మవారి గొలుసు విషయంపై ఈఓ సార శ్రీనివాస్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బంగారు చైన్ బహూకరించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. కాగా అది తన సంరక్షణలోనే ఉందని చెప్పడం కొసమెరుపు. -
స్వయంగా తీసుకెళ్లి సచివాలయమంతా చూపించి..
సాక్షి, హైదరాబాద్: నూతన సచివాలయంలో ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న నల్ల పోచమ్మ ఆలయం, మసీదు, చర్చిలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో కలసి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఆలయంలో జరిగిన తొలి పూజలు, మసీదు, చర్చిలలో నిర్వహించిన తొలి ప్రార్థనల్లో ఇరువురు కలసి పాల్గొన్నారు. గవర్నర్ సచివాలయానికి తొలిసారి వచ్చిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్వయంగా దగ్గరుండి ప్రత్యేకతలను చూపించారు. కొత్త సచివాలయం నిర్మాణంలో భాగంగా నల్ల పోచమ్మ ఆలయం, మసీదులను తొలగించిన విషయం తెలిసిందే. ఇటీవల ఆ రెండింటితోపాటు చర్చిని కూడా కొత్తగా, విశాలంగా నిర్మించారు. శుక్రవారమే వాటిని ప్రారంభించి అందరినీ అనుమతిస్తున్నారు. చర్చిలో కేక్‌ను కట్ చేస్తున్న గవర్నర్ తమిళిసై. చిత్రంలో సీఎం కేసీఆర్, సీఎస్ శాంతి కుమారి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బాల్క సుమన్ తదితరులు గవర్నర్‌ను ఘనంగా స్వాగతించి.. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆలయం, మసీదు, చర్చిల ప్రారంబోత్సవ ఏర్పాట్లు, సచివాలయ అంశాలపై ఉద్యోగ సంఘం నేతలతో కాసేపు మాట్లాడారు. కాసేపటికి అక్కడికి చేరుకున్న గవర్నర్ తమిళిసైకు మేళతాళాల మధ్య సీఎం, సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి జరుగుతున్న చండీయాగం పూర్ణాహుతిలో గవర్నర్, సీఎం పాల్గొన్నారు. తర్వాత ఆలయంలో నల్ల పోచమ్మ అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. దీనికి అనుబంధంగా నిర్మించిన శివాలయం, ఆంజనేయస్వామి ఆలయాలనూ దర్శించుకున్నారు. తర్వాత ఎలక్ట్రిక్ వాహనంలో వారు చర్చి వద్దకు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై రిబ్బన్ కట్ చేసి చర్చిని ప్రారంభించారు. కేక్ కట్ చేసి బిషప్ డానియేల్‌కు, సీఎంకు అందించారు. తర్వాత బిషప్ ఆధ్వర్యంలో తొలి ప్రార్థనలు నిర్వహించారు. తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ కాంతి వెస్లీ ముఖ్యమంత్రికి జ్ఞాపికను బహూకరించారు. తర్వాత వారంతా పక్కనే ఉన్న మసీదుకు చేరుకున్నారు. అక్కడ ఇమాం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం మతపెద్దలు, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్‌లతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించాలని అసదుద్దీన్ కోరగా.. ‘‘రాష్ట్రంలో సోదరభావం ఇలాగే పరిఢవిల్లాలి. ఇందుకు ప్రభుత్వపరంగా మావంతు చొరవ చూపుతాం. కొత్త మసీదు అద్భుతంగా, నిజాం హయాంలో కట్టిన తరహాలో గొప్పగా రూపొందింది. ఇలా అన్ని మతాల ప్రార్థన మందిరాలు ఒక్కచోట ఏర్పాటైన తెలంగాణ సచివాలయం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతుంది..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో కలసి మసీదును ప్రారంభిస్తున్న తమిళిసై. చిత్రంలో హోంమంత్రి మహమూద్ అలీ తదితరులు సచివాలయాన్ని గవర్నర్‌కు చూపిన కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో కొత్త సచివాలయాన్ని నిర్మించినా.. ఇప్పటివరకు గవర్నర్ అందులో అడుగుపెట్టలేదు. శుక్రవారమే తొలిసారిగా అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రార్థన మందిరాల్లో కార్యక్రమాలు ముగిశాక సీఎం కేసీఆర్.. సచివాలయాన్ని తిలకించాలంటూ గవర్నర్ తమిళిసైని ఆహ్వనించారు. స్వయంగా దగ్గరుండి మరీ కొత్త భవనం ప్రత్యేకతలు, నిర్మాణంలో తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ, ఇతర అంశాలను వివరించారు. తన చాంబర్‌కు తోడ్కొని వెళ్లి అక్కడ శాలువాతో సత్కరించారు. శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కూడా కావటంతో.. గవర్నర్‌కు ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి కుంకుమ దిద్ది సంప్రదాయ పద్ధతిలో సత్కరించారు. అనంతరం వారంతా తేనీటి విందులో పాల్గొన్నారు. -
నల్లపోచమ్మ ఆలయంలో చోరీ
మనురు (మెదక్) : మెదక్ జిల్లా మనురు మండలంలోని నల్లపోచమ్మ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఈ విషయాన్ని ఆదివారం ఉదయం గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. మండలంలోని బోరించ గ్రామంలోని నల్లపోచమ్మ ఆలయంలోకి చొరబడిన దుండగులు 3.5 కేజీల వెండి ఆభరణాలు, 4 హుండీలు ఎత్తుకెళ్లారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
తొలిసారిగా సెక్రటేరియట్ కు సీఎం కేసీఆర్
-
తొలిసారిగా సెక్రటేరియట్ కు సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్ఎస్ అధినేత కల్లకుంట్ల చంద్రశేఖర రావు తన మంత్రులతో కలిసి ఈ మధ్యాహ్నం తొలిసారిగా తెలంగాణ సచివాలయం చేరుకున్నారు. కేసీఆర్‌కు సచివాలయ ఉద్యోగులు రెడ్‌కార్పెట్ స్వాగతం పలికారు. తెలంగాణ సంప్రదాయమైన బతుకమ్మ, బోనాలతో కేసీఆర్ కు మహిళలు స్వాగతం పలికారు. అనంతరం సచివాలయం నల్లపోచమ్మ గుడిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఉద్యోగులు నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులను ఆయన అభినందించారు. కేసీఆర్ తనయ కవిత, సీనియర్ నాయకుడు కేశవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.