సిద్ధిపేట్: రాజకీయ వర్గాలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్, దుబ్బాకలో మాధవనేని రఘునందన్‌రావు, జనగామలో ఆరుట్ల దశమంతరెడ్డి బరిలో దిగనున్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ గజ్వేల్ బరిలో నిలుస్తుండటంతో పోటీ ఆసక్తికరంగా మారనున్నది. ముందుగా ప్రకటించిన విధంగానే ఈటల గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ అధిష్టానం ఈటలకు హుజురాబాద్‌తోపాటు గజ్వేల్ సీటును సైతం కేటాయించింది.
గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఫౌల్ట్రీఫారం పరిశ్రమను కొనసాగించడంవల్ల ఇక్కడి నాయకులు, ప్రజలతో ఈటలకు పరిచయాలున్నాయి. గజ్వేల్ అభ్యర్థిత్వం ఖరారైన నేపథ్యంలో దసరా తర్వాత ఇక్కడ భారీ కార్యక్రమం చేపట్టి ఎన్నికల ప్రచారానికి సమాయత్తం కానున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. గజ్వేల్ ఎన్నికను బీజేపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశాలున్నాయి.
ఈటల రాజకీయ నేపథ్యం
● 2002లో బీఆర్‌ఎస్‌లో చేరిక.
● 2004 ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక, బీఆర్‌ఎస్ ఎల్‌పీ నేతగా బాధ్యతల నిర్వహణ.
● 2008 ఉపన్నికల్లో విజయం, పునర్విభజనలో భాగంగా కమలాపూర్ హుజూరాబాద్ నియోజకవర్గంగా ఆవిర్భవించడంతో 2009 ఎన్నికల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ గెలుపు.
● 2010 ఉప ఎన్నికల్లో మరోసారి గెలుపు.
● తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేతిరి సుదర్శన్‌రెడ్డిపై విజయం. ఈ సందర్భంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
● 2018 ఎన్నికల్లో గెలిచి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు.
● 2021 మే 2న మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి 2021 జూన్ 12న రాజీనామా చేశారు.
● 2021 అక్టోబర్ 30న జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మరోసారి గెలుపొందారు.
ప్రొఫైల్
● పేరు: మాధవనేని రఘునందన్‌రావు
● తల్లిదండ్రులు: భగవంతరావు, భారతమ్మ
● భార్య: మంజులదేవి
● కూతురు: డాక్టర్.సింధు
● స్వస్థలం: బొప్పాపూర్ (ఉమ్మడి దుబ్బాక మండలం)
● పుట్టిన తేదీ: 3–4–1965
● విద్యార్హతలు: బీఎస్సీ, బీఈడీ, ఎల్‌ఎల్‌బీ
● వృత్తి: అడ్వకేట్,ప్రస్తుతం దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు.
మంచి వక్తగా ... అడ్వకేట్‌గా, జర్నలిస్టుగా, ఉపాధ్యాయుడిగా పని చేసిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు మంచి వక్తగా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సుపరిచితుడు. బీజేపీలో సైతం కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు గెలుపుతో రాష్ట్రంలో బీజేపీకి మంచి ఊపు వచ్చిందని ప్రచారం.
విద్యార్థి దశ నుంచే నాయకుడిగా..
సామాజిక సేవ చేయాలన్న సంకల్పంతో విద్యార్థి దశ నుంచే కాలేజీ స్థాయిలో నాయకుడిగా ఒక ప్రత్యేకత చాటుకున్నారు ఆరుట్ల దశమంతారెడ్డి. బీజేపీలో జాతీయ స్థాయి నాయకుల మన్ననలతో జనగామ నియోజకవర్గ నుంచి పోటీచేసే అవకాశం దక్కించుకున్నారు. దీంతో పార్టీ శ్రేణుల్లో సంతోషం వెల్లివిరిసింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ ప్రతినిధిగా ఉద్యమం చేసిన దశమంతరెడ్డి ప్రజానాయకుడిగా బీజేపీలో ముద్ర వేసుకున్నారు. గెలుపేలక్ష్యంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల వద్దకు వెళ్తామని దశమంతారెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment