మెదక్: ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా సిద్దిపేట ముందుకు సాగుతోంది. మనిషి జీవన ప్రమాణాలతోపాటు ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు వస్తున్నాయి. బిజీ ప్రపంచంలో శారీరక శ్రమలేక ఎన్నో అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం సిద్దిపేట వేదిక అవుతోంది.
సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్, జిల్లా పోలీస్ శాఖ సమన్వయంతో ఆగస్టు 6న హాఫ్ మారథాన్ నిర్వహిస్తున్నారు. అందులో 5, 10, 21 కిలో మీటర్ల విభాగాలు ఏర్పాటు చేశారు. అందుకోసం ఇప్పటికే ఆసక్తి ఉన్న వారి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
హాఫ్ మారథాన్ అంటే..
మారథాన్ అంటే 42.195 కిలో మీటర్లు(26.385 మైళ్లు), హాఫ్ మారథాన్ అంటే 21.0975 కిలో మీటర్లు(13.192 మైళ్లు) అంటారు. ఇలాంటి రన్‌లను అరుదుగా నిర్వహిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరంలో సుమారుగా 800 పైగా జరుగుతున్నాయి. 2021 సంవత్సరంలో ఉగాండాకు చెందిన జాకబ్ కిప్లిమో హాఫ్ మారథాన్‌ను 57.31నిమిషాల్లో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సాధించగా, మహిళల విభాగంలో 1.02గంటలో హాఫ్ మారథాన్‌ను ఇథియోపియాకు చెందిన లెటెన్‌బెట్ పూర్తి చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు.
రంగనాయకసాగర్ వేదికగా..
హాఫ్ మారథాన్‌కు సిద్దిపేటలోని రంగనాయకసాగర్ వేదిక కాబోతుంది. ఆగస్టు 6(ఆదివారం)న ఉదయం 5.30గంటలకు హాఫ్ మారథాన్(21.0975 కిలో మీటర్లు) సిద్దిపేట పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం నుంచి ప్రారంభమై రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్ట పైన రన్ సాగనుంది.
అదే రోజు ఉదయం 5:30 గంటలకు 5, 10 కిలో మీటర్ల పరుగు పందెం రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్ట పై జరగనుంది. ఈ రన్‌లో ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, సినీ నటులు, ప్రముఖ క్రీడాకారులు పాల్గొననున్నారు.
గెలుపొందిన వారికి నగదు పురస్కారాలు
హాఫ్ మారథాన్‌లో గెలుపొందిన విజేతలకు నగదు పురస్కారాలు అందించనున్నారు. పురుషులు, మహిళలకు వేరువేరు విభాగాలుగా విభజించి అందించనున్నారు.
హాఫ్ మారథాన్ విజేతలకు ప్రథమ బహుమతి రూ.50వేలు, ద్వితీయ రూ.25వేలు, తృతీయ రూ.10వేల నగదును, పది కిలోమీటర్ల పందెంలో ప్రథమ రూ.25వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ బహుమతి రూ.10వేలు, 5కిలోమీటర్లలో ప్రథమ రూ.15వేలు, ద్వితీయ రూ.10వేలు, తృతీయ రూ.5వేల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపికను అందించనున్నారు. ఇలా మొత్తంగా నగదు పురస్కారాలు రూ3.30లక్షలను అందించనున్నారు.
ఈ నెల 25తో ముగియనున్న ఎంట్రీలు
హాఫ్ మారథాన్ రన్‌లో పాల్గొనే వారు ఈ నెల 25వ తేదీ సాయంత్రం 6గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే 5కిలోమీటర్ల రన్‌కు సంబంధించిన ఎంట్రీ గడువు ముగిసింది. జ్ట్టి ఞట://టజిఝ23.జ్ఞీ301.ఛిౌఝ లింక్‌ను ఓపెన్ చేసి వివరాలను నమోదు చేయాలి. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు హాఫ్ మారథాన్, 10 కిలో మీటర్ల రన్‌కు 14 సంవత్సరాలు నిండిన వారు అర్హులు, 5కిలో మీటర్ల రన్‌లో 10 సంవత్సరాలు నిండిన వారు పాల్గొనేందుకు అర్హులు.
పోస్టర్ ఆవిష్కరణ
చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరు ఎంపీడీఓ కార్యాలయంలో హాఫ్ మారథాన్ పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను శనివారం సిద్దిపేట ఏసీపీ సురేందర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోటీల్లో పాల్గొనే వారు రిజిస్ట్రేషన్ చార్జీలు 5కే రన్‌కు రూ.200, 10కే రన్‌కు రూ.300, 21కే రన్‌కు రూ.500 చెల్లించి ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేయించుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment