సాక్షి, సిద్దిపేట: ఓటు హక్కు కోసం అనూహ్య స్పందన లభించింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం చేపట్టింది. అక్టోబర్ 5వ నుంచి 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించారు. నూతనంగా ఓటు హక్కు కోసం 22,095 మంది దరఖాస్తు చేశారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఈ నెల 11న తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ జాబితాలో పేర్లు ఉన్న వారందరూ ఈసారి ఎన్నికల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
క్షేత్ర స్థాయిలో..
ఫారం–6 ద్వారా ఓటు హక్కు కోసం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను ఈ నెల 8వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను బీఎల్‌ఓలకు అందించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి మండల తహసీల్దార్ కార్యాలయాలకు అందిస్తారు. అర్హత ఉన్న వారి వివరాలను ఎన్నికల సంఘం సంబంధించిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనుంది. ఈ నెల 11న తుది జాబితాల వెల్లడిస్తారు.
పెరగనున్న ఓట్ల సంఖ్య!
నూతనంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత ఉన్న వారికి ఓటు హక్కును కల్పిస్తారు. ఈ నెల 30న ఎన్నికలు ఉండటంతో నూతనంగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. 18 ఏళ్లు ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకునే విధంగా బీఎల్‌ఓలు, రాజకీయ పార్టీల నాయకులు సైతం కృషి చేశారు. నూతనంగా పలువురికి ఓటు హక్కును కల్పిస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య పెరగనుంది. నాలుగు నియోజక వర్గాల్లో ప్రస్తుతం 9,25,868 మంది ఓటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment