పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న బీజేపీ నాయకులు.. (ఇన్‌సెట్‌లో) ధ్వంసమైన ప్రచార రథం
సాక్షి, మెదక్/సిద్ధిపేట్: నియోజకవర్గంలో ఎప్పుడు.. ఏం జరుగుతుందో తెలియని భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాన పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడంతో వారం రోజులుగా నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో గత నెల 30న సూరంపల్లిలో ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి జరిగిన ఘటన విదితమే. ఆ సమయంలో గన్‌మెన్లు అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పటికే కత్తి పొట్టలో బలంగా దిగడంతో ఎంపీకి యశోద ఆస్పత్రిలో వైద్యులు శస్త్రచికిత్స చేశారు.
ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మరువకముందే గురువారం రాత్రి బీజేపీ ప్రచార రథంపై ముగ్గురు దాడికి పాల్పడ్డారు. ప్రధానమంత్రి మోదీ, ఎమ్మెల్యే రఘునందన్‌రావుల ఫ్లెక్సీలు చింపివేశారు. ముబారస్‌పూర్ శివారులో దాడికి యత్నించడంతో అప్రమత్తమైన డ్రైవర్ శివ బీజేపీ నాయకులకు సమచారం అందించారు. వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. దాడికి చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలంటూ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
అభ్యర్థుల్లో గుబులు!
దాడుల నేపథ్యంలో గ్రామాల్లో ప్రచారానికి వెళ్లాలంటేనే అభ్యర్థుల్లో గుబులు నెలకొన్నట్లు సమాచారం. ప్రధానంగా బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు తమ క్యాడర్‌ను ఇప్పటికే అప్రమత్తంగా చేసుకొని ఉండడంతో పోటాపోటీ వాతావరణం నెలకొంది.
పోలీసుల పహారా..
గ్రామాల్లో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేపడుతున్న ఇంటింటా ప్రచారానికి బందోబస్తును పటిష్టం చేశారు. అలాగే నియోజకవర్గంలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ అధికారులు పెట్రోలింగ్ చేపడుతున్నారు. ఏదిఏమైనా వరుస ఘటనలతో నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఉదిక్తంగా తయారైంది.
Comments
Please login to add a commentAdd a comment