సాక్షి, మెదక్: ఈసారి తెలంగాణ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసేవారికంటే హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో నలుగురు నేతలు హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధం అవుతున్నారు. మరోనేత కొద్దిలో హ్యాట్రిక్ అవకాశం కోల్పోయారు. కచ్చితంగా గెలుస్తామనే ధీమాతో ఉన్నారా నేతలు. మరి ఆ మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఎవరు? ఆ సెగ్మెంట్లలో రాజకీయాలు ఎలా ఉన్నాయి? ప్రచారం ఎలా సాగుతోంది?
ఉమ్మడి మెదక్ జిల్లా ఎన్నికల్లో రికార్డ్ సృష్టించినవారిలో గడచిన రెండు దశాబ్దాల కాలంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ప్రముఖంగా కనిపిస్తారు. సిద్ధిపేట ఈ ఇద్దరు నేతలకు పెట్టని కోటగా తయారైంది. ఈసారి ఎన్నికల్లో గజ్వేల్, పఠాన్‌చెరు, మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నారు.
ముఖ్యంగా గజ్వేల్ నుంచి రెండుసార్లు విజయం సాధించిన సీఎం కేసీఆర్ మూడోసారి అక్కడే పోటీ చేస్తున్నారు. కేసీఆర్ విజయం గురించి కంటే..ఆయన సాధించే మెజారిటీ మీదే చర్చలు జరుగుతున్నాయి. నర్సాపూర్ లో మదన్ రెడ్డి గత రెండు ఎన్నికల్లోనూ విజయం సాధించారు..మూడోసారి బరిలోకి దిగి హ్యాట్రిక్ సాధించాలనుకున్నారు కాని..గులాబీ బాస్ మాత్రం నర్సాపూర్ టిక్కెట్‌ను మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డికి కేటాయించారు. దీంతో మదన్‌రెడ్డికి తృటిలో అవకాశం చేజారింది.
కాంగ్రెస్ నేతలంతా ఒకవైపే వస్తే..
నారాయణఖేడ్ నియోజకవర్గంలో వాడ వాడలా ప్రచారం ముమ్మరంగా సాగుతూ పండుగ వాతావరణం కనిపిస్తోంది. BRS అభ్యర్థి భూపాల్ రెడ్డి తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు. నారాయణఖేడ్ సెగ్మెంట్ కాంగ్రెస్ కు కంచుకోట. 2016లో అప్పటి కాంగ్రెస్ MLA కిష్టారెడ్డి ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఉప ఎన్నికలో తెలంగాణ ఉద్యమం ఊపుతో గులాబీ పార్టీ గెలుపొందింది.
2018 ఎన్నికల్లో కూడా TRS అభ్యర్థి భూపాల్ రెడ్డి 58 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో సునాయాసంగా గెలుపొందారు. ఇప్పడు హ్యాట్రిక్ కోసం భూపాల్ రెడ్డి పరుగులు పెడుతున్నారు. ఒక వేళ సీటు కోసం పోటీపడుతున్న కాంగ్రెస్ నేతలంతా ఒక తాటిపైకి వచ్చి ప్రచారం నిర్వహిస్తే మాత్రం గులాబీ పార్టీ అభ్యర్థికి పోటీ గట్టిగానే ఉంటుంది. ఏమైనా తేడా కొడితే మాత్రం భూపాల్ రెడ్డి హ్యాట్రిక్ విజయం మీద నీళ్లు చల్లినట్టే అవుతుంది.
మెదక్ లో ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి గెలుపు అంత సులభం కాదంటున్నారు అక్కడి రాజకీయ విశ్లేషకులు. 2014లో 30 వేలకు పైగా..2018లో 48 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందిన పద్మా దేవేందర్ రెడ్డి మూడోసారి బరిలోకి దిగారు. అభ్యర్థులను ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్ ఒకసారి మెదక్ నియోజకవర్గంలో పర్యటించారు.
సీఎం పర్యటనతో.. పద్మా దేవేందర్ హ్యాట్రిక్!
సీఎం పర్యటనతో BRS కార్యకర్తల్లో జోష్ నింపినప్పటికీ మెదక్ లో పద్మా దేవేందర్ హ్యాట్రిక్ కొడతారా అనే సందేహం మాత్రం వెంటాడుతోంది. కాంగ్రెస్ నుండి మైనంపల్లి రోహిత్ పోటీ పడుతుండటంతో బీఆర్ఎస్ అభ్యర్థికి ఈసారి కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రోహిత్ గ్రామగ్రామాన తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బిఆర్ఎస్ కార్యకర్తలు కొందరు పద్మా దేవేందర్ రెడ్డి మీద ఉన్న అసంతృప్తితో కాంగ్రెస్ లో చేరుతున్నారు. మరి ఈసారి విజయం ఎవరిని వరిస్తుందో..?
మినీ ఇండీయాగా పిలుచుకునే పఠాన్ చెరులో బీఆర్ఎస్ అభ్యర్థిగా ముందుగానే గూడెం మహిపాల్ రెడ్డిని ఖరారు చేశారు కేసీఆర్. 2014లో 18 వేలకు పైగా మెజారిటీ సాధించిన గూడెం మహిపాల్ రెడ్డి 2018 ఎన్నికల్లో 38 వేలకు పైగా మెజారిటీ సాధించారు. బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డ నీలం మధు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతానని ప్రకటించారు. ప్రత్యర్థులు ఎవరైనా..ఎంతమంది బరిలో ఉన్నా.. మాస్ లీడర్‌గా పేరున్న మహిపాల్ రెడ్డి గెలుపు కష్టమేమి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన పఠాన్‌చెరు నియోజకవర్గంలో మహిపాల్‌రెడ్డి చేసిన అభివృద్ధి పనులే ఆయన్ను గెలిపిస్తాయంటున్నారు గులాబీ పార్టీ కార్యకర్తలు.
సీఎం కేసీఆర్ మూడోసారి బరిలో..
ఇక గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ మూడోసారి బరిలో దిగారు. గజ్వేల్ లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ అధికారంలోకి వస్తుందని అనేకసార్లు రుజువైంది. అధికారంలోకి మేమే వస్తామంటూ అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నాయకత్వాలు చెప్పుకుంటున్నాయి.
కానీ గజ్వేల్ లో గెలుస్తామని మాత్రం ఆ రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేయడం లేదు. కాంగ్రెస్ నుండి తూముకుంట నర్సా రెడ్డి ఎంత మేరకు ప్రభావం చూపుతారో తెలీదు కానీ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రం ప్రభావం చూపిస్తారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2014లో 18 వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన కేసీఆర్ 2018లో 58 వేల ఓట్లతో విజయం సాధించారు. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేత కేసీఆర్ గజ్వేల్ గెలుపు నల్లేరు మీద నడకే కానీ అందరి దృష్టి గులాబీ బాస్ సాధించే మెజారిటీ మీదే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment