
దారుణం..!
♦ పరిచయస్తుని గదిలో ఇంటర్ విద్యార్థిని మృతదేహం
♦ గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులు
♦ రూమ్‌కు తీసుకువచ్చి హత్య చేశారని ఆరోపణ
♦ పోలీసుల అదుపులో నిందితుడు ?
‘ కాలేజీకి వెళ్లి వస్తానమ్మా’ అంటూ వెళ్లిన కుమార్తె విగతజీవిలా పడిఉండడాన్ని చూసిన ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. కన్నబిడ్డ కళ్ల ఎదుటే మృతదేహంలా పడివుండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇంటిలో భోజనం చేసి వెళ్లిన కుమార్తె తేజశ్విని పరిచయస్తుని గదిలో నిర్జీవంగా పడిఉండడాన్ని అనుమానిస్తున్నారు. తన బిడ్డకు మాయమాటలు చెప్పి గదికి తీసుకువచ్చి హత్య చేశారని ఆరోపిస్తున్నారు. ఇంటర్మీడియెట్ విద్యార్థిని హత్యోదంతం రేపల్లె పట్టణంలో శుక్రవారం సంచలనం సృష్టించింది.
రేపల్లెటౌన్ : పట్టణంలోని 14వ వార్డుకు చెందిన బొమ్మిడి సాంబశివవరప్రసాద్, రాజేశ్వరి దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. స్థానికంగా వెల్డింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కుమార్తె తేజశ్వినిని నాలుగు రోజుల క్రితం ఇంటర్మీడియెట్‌లో చేర్పించారు. కుమారులు జ్యోతిప్రకాష్, దినేష్‌లు 9, 6వ తరగతి చదువుతున్నారు. 12వ వార్డులో అద్దెకు ఉంటున్న నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన చిప్పల నాగరాజు స్థానికంగా రొయ్యల కంపెనీలో పనిచేస్తున్నాడు.
కొద్ది రోజుల కిందట నాగరాజు, తేజశ్విని మధ్య పరిచయం ఏర్పడింది. ఇదిలా ఉండగా తేజశ్విని గురువారం ఉదయం కాలేజీకి వెళ్లి భోజనానికి మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. భోజనం చేసి కాలేజీకి వెళ్లివస్తానమ్మా అంటూ తల్లి రాజేశ్వరికి చెప్పి వెళ్లింది. సాయంత్రం దాటినా తేజశ్విని ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు కాలేజీకి వెళ్లి వాకబు చేశారు. మధ్యాహ్నం నుంచి కాలేజీకి రాలేదని అక్కడ చెప్పటంతో ఆందోళనకు గురయ్యారు. కొత్తపాలెంలోని అమ్మమ్మ, నిజాంపట్నంలో పెద్దమ్మ ఇళ్లతో పాటు బంధువులకు ఫోన్‌లు చేసినా ఫలితం కనిపించలేదు.
చివరకు ఇంటిలో ఉన్న సెల్‌ఫోన్‌కు నాలుగు సార్లు కాల్ వచ్చిన నంబర్‌ను వాకబు చేసి, అది రొయ్యల కంపెనీలో పనిచేసే చిప్పల నాగరాజుదిగా గుర్తించారు. దీంతో నాగరాజు సోదరి ఇంటికి వెళ్లగా, ఆమె బెదిరింపు ధోరిణితో మాట్లాడటంతో నాగరాజుపై అనుమానం వచ్చి బంధువులతో కలసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో నాగరాజు రూమ్ యజమాని అడుసుమల్లి శాంతకుమారి ఓ బాలిక మృతదేహం నాగరాజుకు అద్దెకు ఇచ్చిన గదిలో పడివున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. దీంతో అనుమానం వచ్చి సీఐ మల్లిఖార్జునరావు తో పాటు వెళ్లి చూడగా, తేజశ్వినిగా గుర్తించి బోరున విలపించారు.
నా బిడ్డను హత్య చేశారు..
తేజశ్వినికి మాయమాటలు చెప్పి గదికి తీసుకువెళ్లి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు రాజేశ్వరి, సాంబశివవరప్రసాద్, బంధులు ఆరోపిస్తున్నారు. దీంట్లో నాగరాజుతో పాటు కొంత మంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతదేహం మెడపై రక్తం మరకలు, నోటిపై నురగ ఉన్నాయి. గదిలో డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ పడివుండి ఉన్నాయి. తేజశ్విని తానే స్వయంగా ఈ గదికి వచ్చిందా లేక ఎవరైనా ఎత్తుకొచ్చారా, హత్యకు ఎలా గురైంది అనే అంశాలు మిస్టరీగానే ఉన్నాయి .ఇదిలా ఉండగా నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
హత్య కేసుగా నమోదు..
శవపంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యకేసుగా నమోదు చేసినట్టు సీఐ మల్లిఖార్జునరావు చెప్పారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి...
విద్యార్థిని హత్య వార్త క్షణాల్లో పట్టణంలో వ్యాపించటంతో అధిక సంఖ్యలో జనం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తేజశ్విని మృతికి కారణమైన చిప్పల నాగరాజును కఠినంగా శిక్షించాలని ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అదే విధంగా నాగరాజుతో పాటు ఆ గదికి వెళ్లింది ఎవరు అనే అంశంపై, ఆ లోపల ఏం జరిగిందనే విషయంపై క్షుణ్ణంగా దర్యాప్తు నిర్వహించి నిజాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.