వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్‌పై దాడి
అవినీతిని ప్రశ్నించినందుకు అధికారపక్ష కౌన్సిలర్ల వీరంగం
రసాభాసగా ముగిసిన కౌన్సిల్ సమావేశం
పోలీసులకు ఇరువర్గాల ఫిర్యాదు
నర్సీపట్నం: అధిక మొత్తంలో చైర్లు కొనుగోలు చేయడానికి తీర్మానించడం వెనుక అవినీతి స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ తమరాన నాయుడు అధికారులను నిలదీశారు. ఈ విషయమై అధికారపక్ష కౌన్సిలర్లు వాదనకు దిగడంతో పాటు నాయుడిపై చేయి చేసుకున్నారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సభను హుందాగా నడిపించాల్సిన మున్సిపల్ వైస్‌చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు మీ ఇష్టం వచ్చిన విచారణ జరిపించుకోండంటూ సభను ముగించి వెళ్లిపోయారు. గురువారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా ముగిసింది. మున్సిపల్ కార్యాలయానికి 30 నీల్‌కమల్ కుర్చీలను ఒక్కొక్కటి రూ. 625కి కొనుగోలు చేయడానికి అజెండాలో పొందుపరిచారు. బయట షాపులో అదే చైర్ రూ.425 ఇస్తుంటే రూ.625కు కొనుగోలు చేయడానికి తీర్మానం చేయటంలో అవినీతి కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ ప్లోర్‌లీడర్ తమరాన నాయుడు మున్సిపల్ అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనికి అధికారపక్ష కౌన్సిలర్లు రావాడ నాయుడు, పైల గోవిందరావు చెరుకూరి సత్యనారాయణ అడ్డుతగిలారు.
దీంతో అధికార పక్ష, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులను ప్రశ్నిస్తే మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారని నాయుడు అధికారపక్ష సభ్యులను నిలదీశారు. ఈ సమయంలో సమావేశానికి అధ్యక్షత వహించిన వైస్‌చైర్మన్ సన్యాసిపాత్రుడు కల్పించుకుని మీ ఇష్టం వచ్చిన విచారణ జరిపించుకోండంటూ సభను ముగిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్లిపోవటం మంచి పద్ధతి కాదని ప్రతిపక్షసభ్యులు సన్యాసిపాత్రుడిని నిలదీసినా, ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోయారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ హాల్ నుండి బయటకువస్తూ అధికారం మీ చేతుల్లో ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తు ఊరుకోలేమని అనడంతో అధికారపక్ష కౌన్సిలర్లు గొడవకు దిగారు. ఈ సమయంలో కొందరు అధికారపక్ష కౌన్సిలర్లు ప్లోర్‌లీడర్ నాయుడుపై చేయిచేసుకున్నారు. అయినప్పటికీ నాయుడు, సహచర కౌన్సిలర్లు హుందాగా వ్యవహరించారు. అధికారపక్ష కౌన్సిలర్లు అరుపులు కేకలతో మున్సిపల్ కార్యాలయం దద్దరిల్లింది. కార్యాలయం ఆవరణలో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులపై టీడీపీ కౌన్సిలర్లు గొడవకు దిగారు. ఈ సంఘటనపై ప్రతిపక్ష సభ్యులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అందుకు ప్రతిగా అధికార సభ్యులు కూడా ఫిర్యాదుచేశారు.