
గుర్తింపు లేని పాఠశాలలపై దాడులు
వైవీయూ : కడప నగరంలో గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న కోఆపరేటివ్ కాలనీ, మాసాపేటలోని ఇంగ్లీషు మీడియం హైస్కూళ్లపై జిల్లా విద్యాశాఖ అధికారులు దాడులు చేసి మూసివేయించారు. గురువారం నగరంలో గుర్తింపు లేని 4 పాఠశాలలను గుర్తించి ముందుగా రెండింటిపై దాడులు నిర్వహించి మూసివేయించారు. మరో పాఠశాల చిరునామా దొరకక అధికారులు వెనుదిరిగారు.
ఈ సందర్భంగా డీఈఓ కె.అంజయ్య మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 21 పాఠశాలలు గుర్తింపు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని మండలాల విద్యాశాఖ అధికారులకు గుర్తింపులేని పాఠశాలలపై చర్యలకు ఆదేశించామన్నారు. ఇప్పటికైనా సంబంధిత యాజమాన్యాలు గుర్తింపు తీసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు సైతం గుర్తింపు లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో కడప డిప్యూటీ డీఈఓ ఐ. ప్రసన్నాంజనేయులు, ఎంఈఓ వి. నాగమునిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.