మంత్రి గంటా సోదరుడి పేరుతో టీచర్లకు అందిన ఆహ్వాన పత్రిక
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సంక్రాంతి పండుగకు కుటుంబ సభ్యులతో కలిసి సొంత గ్రామాలకు వెళ్లి సరదాగా గడుపుదామని సంబరపడ్డ అధికారులు, ఉపాధ్యాయులను ప్రకాశం జిల్లా విద్యాశాఖ ఆదేశాలు నివ్వెరపోయేలా చేశాయి. సంక్రాంతి పండుగనాడు సొంత ఊళ్లలో కాకుండా మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత గ్రామం ప్రకాశం జిల్లాలోని కామేపల్లికి తరలివచ్చి సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని జిల్లా విద్యాశాఖాధికారి హుకుం జారీ చేశారు.
మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులను తీసుకుని కామేపల్లికి రావాలని ఆయన శనివారం ఉదయం 7 గంటలకే ఈ మెసేజ్ పెట్టారు. ఈ మెసేజ్ జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ చేరింది. అందులో పండుగ సందర్భంగా కామేపల్లిలో రంగోలి, పాటలు, డ్యాన్స్, ముగ్గుల పోటీలు నిర్వహించి పిల్లలకు, ఉపాధ్యాయులకు బహుమతులు ఇస్తారని పేర్కొన్నారు. దీనికోసం మంత్రి గంటా సోదరుడు, విద్యా శాఖను అన్నీ తానై నడిపిస్తున్న గంటా చిరంజీవి ఏకంగా ఆహ్వాన పత్రికలను ముద్రించి పంచిపెట్టడం గమనార్హం. మంత్రి తీరుపై ఉపాధ్యాయుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బహిరంగంగా విమర్శలు చేయలేక మీడియా కార్యాలయాలకు ఫోన్లు చేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment