సాక్షి, మచిలీపట్నం : పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన అత్తారింటికి దారేది పైరసీని పోలీసులు నిగ్గు తేల్చారు. పైరసీకి ఊతమిచ్చింది వీరేనంటూ హడావుడిగా ఐదుగురిపై కేసు నమోదు చేసి సరిపెట్టారు. అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. డీవీడీలు, మెమరీ కార్డులు, సెల్‌ఫోన్లు, యూ ట్యూబ్ ద్వారా ఈ సినిమా పైరసీ సర్వత్రా వ్యాపించింది. తీరా పైరసీకి పాల్పడినవారు వీరేనంటూ కేసు నమోదు చేసినప్పటికీ ఇంత తీవ్రస్థాయిలో కలకలం రేపిన వ్యవహారంపై అనేక అనుమానాలు తొంగిచూస్తున్నాయి.
ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేసిన జిల్లా పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే కేసును కొలిక్కి తెచ్చి బుధవారం ఐదుగురి అరెస్టు చూపించారు. అందుకు స్నేహితుల మధ్య సరదాగా చేతులు మారిందని పైరసీ డీవీడీ వ్యవహారంపై పటిష్టమైన కథనాన్ని వినిపించారు. అంతవరకు బాగానే ఉన్నా ఈ సినిమా పైరసీకి గురికావటం వెనుక కీలకమైన కారణాలను అన్వేషించటంలో మాత్రం వైఫల్యం కనిపిస్తోంది.
అనుమానాలెన్నో..
సాక్షాత్తూ సినిమా నిర్మాత దగ్గర పనిచేసే ఎడిటింగ్ అసిస్టెంట్ ఈ పైరసీకి కీలక సూత్రధారి కావటం పలు అనుమానాలకు తావిస్తోంది. స్నేహితునికి ఇచ్చేందుకు ఆ సినిమా క్లిప్పింగ్‌లను నిర్మాత కంప్యూటర్ నుంచి డీవీడీ రూపంలో డౌన్‌లోడ్ చేసినట్లు చెబుతున్నప్పటికీ దాని వెనుక బలమైన కారణాలు ఉన్నాయనే అనుమానాలు రేగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ముగ్గురు కానిస్టేబుళ్ల పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. పైరసీ సినిమాను చూశారు తప్ప వారు తప్పు చేయలేదంటూ ఇద్దరు కానిస్టేబుళ్లను కేసులో చేర్చకుండా మినహాయింపు ఇవ్వటం గమనార్హం.
సినీ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ దగ్గర పనిచేసే ఎడిటింగ్ అసిస్టెంట్ చీకటి అరుణ్‌కుమార్ పైరసీని తీసుకువచ్చి యూసఫ్‌గూడ కానిస్టేబుల్ కట్టా రవికి ఇచ్చాడని, అతను స్పీడ్ పోస్ట్ ద్వారా పెడనలో ఉంటున్న తన మిత్రుడు సుధీర్‌కుమార్‌కు ఇచ్చాడని, అక్కడి నుంచి వీడియోగ్రాఫర్ పోరంకి సురేష్, దేవి మొబైల్ అధిపతి కొల్లిపర అనిల్‌కుమార్‌ల చేతులు మారిందని పోలీసులు చెబుతున్నారు. ఈ ఐదుగురిపై సెక్షన్ 420 (చీటింగ్), కాపీరైట్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ (ఐటీ) కింద కేసులు నమోదు చేశారు.
పైరసీ సినిమా చూడటం ప్రోత్సహించటం కాదా?
ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా కనిపిస్తున్నది వీరు ఐదుగురేనా, పైరసీ సినిమాను చూడటం కూడా ప్రోత్సహించినట్లేనన్న విషయం కూడా మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తెలియదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. స్నేహం కోసం సీడీ ఇచ్చినట్లు గొప్పగా చెబుతున్నా ఈ మొత్తం వ్యవహారంలో సెల్ పాయింట్ నిర్వాహకులు రూ.50కే డీవీడీని అమ్ముకుని పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఇది చాలదన్నట్లు యూ ట్యూబ్‌లో కూడా పెట్టడంతో ఎవరికివారే సినిమా పైరసీని డౌన్‌లోడ్ చేసుకుని చూసి ఎంజాయ్ చేశారు. సరదా కోసం కాకపోయినా కొందరు ఆర్థిక లబ్ధిని ఆశించి పైరసీగా మార్కెట్‌లో చెలామణి చేసేందుకు తెగించారన్నది బహిరంగ రహస్యం. దీనిపై హడావుడిగా దర్యాప్తు చేసి ఐదుగురిపై కేసు నమోదు చేసి తమ పని అయ్యిందనుకోవటం కంటే లోతైన దర్యాప్తు చేస్తే పైరసీ మూలాలను గుర్తించే అవకాశం ఉంది.
అత్తారింటికి దారిది!
Published Thu, Sep 26 2013 1:30 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
Advertisement