సాక్షి, కొత్తగూడెం: పంటనే నమ్ముకున్న అన్నదాత కడుపుకొట్టి.. వచ్చిన పరిహారం గోల్‌మాల్ చేసిన అధికారుల్లో హైరానా నెలకొంది. ఈ వ్యవహారంలో లోకాయుక్త సీరియస్‌గా స్పందించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని సంబంధిత అధికారులకు వణుకు పుడుతోంది. పరిహారం నొక్కేసిన వైనంపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అక్రమాలు వెలుగుచూడనున్నాయి.
జిల్లాలో 2009 నుంచి 2012 వరకు జరిగిన పంట నష్టపరిహారం పంపిణీని ఇష్టారాజ్యంగా చేశారు. ఇందులో క్షేత్రస్థాయి అధికారుల పాత్ర ఎక్కువగా ఉంటే.. సంబంధిత ఉన్నతాధికారులు కూడా స్వాహా పర్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో యథేచ్ఛగా దండుకున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేసిన రూ.99 కోట్ల పరిహారంలో సుమారు రూ. 20 కోట్లు పక్కదారి పట్టినట్లు సమాచారం. అసలు పంట నష్టం అంచనాలోనే క్షేత్రస్థాయి సిబ్బంది తమ మాయాజాలన్ని ప్రదర్శించినట్లు తెలిసింది. ఎక్కువ సంఖ్యలో రైతులు పంట నష్టపోయినట్లు ప్రభుత్వానికి నివేదికలు పంపడంతో.. దానిపై మళ్లీ క్షేత్ర స్థాయిలో ఆయా అధికారులు పరిహారానికి ఎవరు అర్హులో అనేది విచారణ చేయించలేదు. దీంతో ప్రభుత్వానికి పంపిన తొలి విడత జాబితాలోనే ఎక్కువ మంది అనర్హులకు కూడా పరిహారం అందేలా చోటు దక్కింది. మండల స్థాయి అధికార పార్టీ నాయకులు సంబంధిత శాఖల సిబ్బందితో మిలాఖత్ అయి జాబితాలో అనర్హులకు స్థానం కల్పించేలా చక్రం తిప్పారు. అర్హులైన బాధిత రైతులకు ఈ జాబితాలో చోటు దక్కలేదు. దీనిపై వ్యవసాయ, రెవెన్యూ అధికారుల చుట్టూ వారు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరకు ఆయా రైతులు లోకాయక్తను ఆశ్రయించడంతో అక్రమాలకు పాల్పడిన అధికారులు ఆందోళన చెందుతున్నారు.
ఇష్టారాజ్యంగా పరిహారం..
ఖమ్మం రూరల్ మండలంలో ఈ పరిహారం పంపిణీ అడ్డగోలుగా చేసినట్లు బాధిత రైతులు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. పరిహారం పంపిణీలో జరిగిన అవకతవకలపై ఆధారాాలతో సహా లోకాయుక్తకు అందజేశారు. ఆదర్శ రైతుల కుటుంబాల్లో నాలుగు నుంచి ఐదుగురి వరకు పరిహారం చెక్కులు రావడం, ఒక గ్రామానికి చెందిన రైతులను మరో గ్రామంలోని జాబితాలో పెట్టడం వంటి రుజువులు చూపించారు. అలాగే ఇల్లెందు మండలానికి చెంది.. ఖమ్మం రూరల్ మండలంలోని బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంటున్న 8వ తరగతి విద్యార్థి పేరు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సర్వే నంబర్ పరిధిలో ఉన్న తరి భూమిలో పత్తి సాగు చేసినట్లు రికార్డుల్లో చూపించారు. అసలు ఈ భూమి వరిసాగుకు మాత్రమే అనుకూలం. ఇలా అనేక అవకతవకలకు పాల్పడ్డారు. ఖమ్మం రూరల్ మండలంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పరిహార స్వాహా పర్వం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రూ. కోట్ల పరిహారం అనర్హులకు దక్కినట్లు సమాచారం. అర్హులైన రైతులకు కూడా పరిహారం పంపిణీ ప్రహసనంగా జరగడంతో అక్రమాలకు పాల్పడే అవకాశం ఆయా సిబ్బంది, అధికారులకు కలిసివచ్చిందనే ఆరోపణలున్నాయి.
రికార్డులను తారుమారు చేసే యత్నం..
బాధిత రైతులు లోకాయుక్తను ఆశ్రయించగా, దీనిపై విచారణ జరపాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఇలా పరిహారం గోల్‌మాల్‌పై ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘ఇన్‌ఫుట్ సబ్సిడీ.. ఔట్’ శీర్షికన కథనం వెలువడడంతో అధికారులు ఉరుకులు.. పరుగులు పెడుతున్నా రు. గతంలో ఎంత మందికి పరిహారం పంపిణీ అయింది, అనర్హులు ఎవరికి ఇచ్చాం.. అన్న కోణంలో రికార్డులను చూసుకుంటున్నట్లు సమాచారం. లోకాయుక్త సీరియస్‌గా స్పందించడంతో ఈ వ్యవహారంలో పూర్తి స్థాయిలో విచారణ జరిగి ఉద్యోగానికి ఎసరు పడుతుందన్న భయంతో రికార్డులను తారుమారు చేసే యత్నంలో ఉన్నట్లు తెలిసింది. అంతేకాకుండా కొంతమంది అధికారులు.. లోకాయుక్తను ఆశ్రయించిన రైతుతో కూడా ఈవ్యవహారంపై చర్చించి.. ‘తమ ఉద్యోగాలు పోగొడతారా..?’ అని ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికారుల వణుకుతో తీగలాగితే జిల్లా వ్యాప్తంగా పంట పరిహారం స్వాహా పర్వం డొంక కదిలే అవకాశం ఉంది.
అధికారుల హైరానా..!
Published Mon, Dec 30 2013 6:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement