టీడీపీ నేతపై లైంగికదాడి యత్నం కేసు | Attempted to sexual assault case on TDP leader | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతపై లైంగికదాడి యత్నం కేసు

Published Tue, Jun 23 2015 1:26 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

టీడీపీ నేతపై లైంగికదాడి యత్నం కేసు - Sakshi

టీడీపీ నేతపై లైంగికదాడి యత్నం కేసు

 కాకినాడ క్రైం : అధికార గర్వంతో కాకినాడలో తెలుగుదేశం పార్టీ నేతల అకృత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవల భూ దందాలు, మహిళల కిడ్నాప్ కేసుల్లో అధికార దర్పాన్ని ప్రదర్శించి కొందరు దొరికిపోయారు. ఇలాగే ఓ నేత మహిళపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. పోలీసులు కూడా అధికారపక్షం నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి బాధితులకు అన్యాయం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన విశ్వనాథుల రామలక్ష్మి టైలరింగ్ చేస్తుంటారు. ఆమెకు దూసర్లపూడి వారి వీధికి చెందిన సీమకుర్తి స్వాతిశ్రీ పరిచయమయ్యారు. ఆమె తన అప్పులు తీర్చుకునేందుకు కొంత సొమ్ము అప్పుగా ఇవ్వాలని రామలక్ష్మిని కోరారు. దీంతో రామలక్ష్మి మరో పది మంది నుంచి కొద్ది మొత్తంలో అప్పు తీసుకుని దానిని స్వాతిశ్రీకి అందజేశారు.
 
 రామలక్ష్మికి స్వాతిశ్రీ రూ.13 లక్షలు అప్పుపడింది. వడ్డీతో కలిసి రూ.25 లక్షలు కావడం, డబ్బు ఇచ్చిన వారు రామలక్ష్మిపై ఒత్తిడి తీసుకురావడంతో సొమ్ము తిరిగి ఇవ్వాల్సిందిగా స్వాతిశ్రీని రామలక్ష్మి కోరారు. దీంతో వారి మధ్య వివాదం జరిగింది. కాకినాడ రంగయ్యనాయుడు వీధికి చెందిన తెలుగుదేశం  నాయకుడు పినిశెట్టి సతీష్ వారికి మధ్యవర్తిగా వ్యవహరించాడు. రామలక్ష్మి అప్పుల వ్యవహారం సర్దుబాటు అయ్యాక రూ.లక్ష మిగిలింది. దీంతో రూ. 20 వేలు ఖర్చులు తీసుకుని మిగిలిన రూ.80 వేలు తనకు ఇవ్వాల్సిందిగా సతీష్‌ను రామలక్ష్మి కోరారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఉన్న ఆమెపై సతీష్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెపై లైంగికదాడి చేసేందుకు యత్నించాడు. దీంతో రామలక్ష్మి త్రీ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. తనపై లైంగికదాడికి సతీష్ యత్నించాడని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సతీష్‌పై 354, 420, 506 రెడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.
 
 ఇదిలా ఉంటే సతీష్‌పై కేసు నమోదైనట్లు త్రీ టౌన్ పోలీసులు అతనికి నోటీసు జారీ చేసి మిన్నకుండిపోయారు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. దీనిపై త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. ప్రసాదరావును వివరణ కోరగా.. కేసు నమోదు చేసి వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. ఏడేళ్లలోపు శిక్షపడే నేరాలలో నిందితులను అరెస్టు చేసే అధికారం తమకు లేదని వివరణ ఇచ్చారు. తాము లేదా కోర్టు వారు పిలిచినప్పుడు హాజరు కావాలని నోటీసులు మాత్రం ఇస్తామన్నారు. సతీష్‌కు కూడా నోటీసు జారీ చేశామన్నారు. రామలక్ష్మి చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement