సాక్షి, అమరావతి: విజయవాడ ఆటోనగర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా) అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఆటోనగర్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులకు ఐలా అధికారులు టెండర్లను ఆహ్వానించారు. గత నాలుగేళ్లుగా టెండర్లు లేకుండానే పారిశుద్ధ్య పనులు చేపట్టిన టీడీపీ వర్గీయులే మళ్లీ టెండర్లు దక్కించుకునేలా ఐలా అధికారులు నిబంధనల్లో మార్పులు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఐలాకు చెందిన ఓ జోనల్‌స్థాయి అధికారి ఈ వ్యవహారంలో చక్రం తిప్పారన్న వాదన వినిపిస్తోంది.
పారదర్శకంగా నిర్వహించాల్సిన టెండర్ల ప్రక్రియ గాడితప్పింది. తమకు అనుకూలురైన వారికే టెండర్లు కట్టబెట్టాలన్న దురుద్దేశంతో విజయవాడ ఆటోనగర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా) అధికారులు లేని నిబంధనలు సృష్టించినట్లు తెలుస్తోంది. తద్వారా గతంలో పనులు చేపట్టిన వారికే తిరిగి పనులు కట్ట్టబెట్టారన్న వాదన వినిపిస్తోంది.
ఎక్కడా లేని నిబంధనలు..
ఆటోనగర్‌లో పారిశుద్ధ్య పనులకు ఐలా అధికారులు ఈ నెల 2వ తేదీన టెండర్లను ఆహ్వానించారు. అయితే ఎక్కడా లేనివిధంగా టెండర్‌లోని నిబంధనలు ఉండటం.. కొంత మంది వ్యక్తులకు లబ్ధి చేకూరేలా వాటిని రూపొందించడం జరిగింది. టెండర్లు ఎవరికి దక్కుతాయో తెలియకుండానే కాంట్రాక్టర్లు వర్కర్ల గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు జతపరచాలని షరతు విధించారు. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన 19 ఏళ్ల ఆడిట్ రిపోర్టు అడిగారు. అలాగే ఆయా సంఘాలకు సంబంధించి జీఎస్టీ సర్టిఫికెట్ జతపర్చమన్నారు. అలాగే ఐలాపై కోర్టుకు వెళ్లిన వారు అనర్హులు అనే నిబంధన కూడా పెట్టారు. వీటిపై గతంలో ఐలా పరిధిలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన కొందరు కాంట్రాక్టర్లు ఏపీఐఐసీ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆ నిబంధనలను సడలిస్తున్నామంటూనే.. గడిచిన ఐదేళ్ల కాలంలో ఎక్కడైనా రూ. 34 లక్షల పారిశుద్ధ్య పనులు చేసినట్లుగా సర్టిఫికెట్‌ను జతపర్చాలని కొత్త మెలిక పెట్టారు. చివరకు తమకు అనుకూలంగా ఉన్నవారికే పనులు దక్కేలా చక్రం తిప్పారు.
మొత్తం పనుల విలువ రూ. 33.65 లక్షలు..
ఆటోనగర్‌లోని పారిశుద్ధ్య పనుల కోసం ఐలా అధికారులు ‘బ్లాక్–ఏ’.. ‘బ్లాక్–బీ’ పనులకు ఐలా అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఒక్కో టెండర్ విలువ రూ. 16,82,595గా నిర్థారించారు. టెండర్ నిబంధనల మేరకు కాంట్రాక్ట్ దక్కించుకున్నవారు ఆటోనగర్ 3వ క్రాస్ నుంచి 5వ క్రాస్ వరకు, ఫేస్–2, ఫేస్–3లో గల ప్రాంతంలోని 165 ఎకరాల స్థలంలో సుమారు 12 కిలో మీటర్ల పొడవుగల అన్ని రహదారులు, పేవ్‌మెంట్స్, ఫుట్‌పాత్‌లను శుభ్రపరచడంతోపాటు చెత్త, మట్టి, బూడిద, ఇసుక, రాళ్లు, సిల్టు, పిచ్చిమొక్కలు, చిన్నచిన్న జంతు కళేబరాలు.. ఇలా మొత్తం రోజూ ఉత్పత్తి అయ్యే 15 టన్నుల చెత్తను 24 మంది వర్కర్లతో తొలగించి దానిని మూడు టిప్పర్ల ద్వారా పాతపాడు, సింగ్‌నగర్ డంపింగ్ యార్డులకు తరలించాలి. మూడు నెలల కాల వ్యవధి ఉన్న ఈ పనుల మొత్తం విలువ రూ. 33.65 లక్షలు.
మూడే దరఖాస్తులు.. అందులో ఒకటి డమ్మీ..!
టెండర్ల ప్రక్రియలో ఐలాకు చెందిన జోనల్ అధికారి ఒకరు చక్రం తిప్పినట్లు సమాచారం. ఈ పనులకు గట్టి పోటీ ఉంటుందని తెలిసి.. గతంలో పనిచేసిన వారికే మళ్లీ పనులు దక్కేలా నిబంధనలు రూపొందించారనే ఆరోపణలు ఉన్నాయి. ఏడాది కాల పరిమితితో 2015లో ఐలా నిర్వహించిన టెండర్లలో గోగినేని ఉమా అనే మహిళ లారీలకు సంబంధించిన చెత్తను తరలించే పనులు దక్కించుకోగా.. కానూరి మణితా అనే మరో మహిళ పారిశుద్ధ్య పనులను దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి నేటి వరకు నాలుగేళ్లపాటు ఎలాంటి టెండర్లు నిర్వహించకుండానే వారిద్దరికి ఆయా పనులను అప్పగించారు.
అప్పటి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతోపాటు, ఐలా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సుంకర దుర్గాప్రసాద్‌కు వారు సన్నిహితులనే ప్రచారం ఉంది. అందువల్లే వారికి టెండర్ల లేకుండానే పనులు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా శుక్రవారం నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో గోగినేని ఉమా, కానూరి మణితాతోపాటు వై.దేవదాస్ అనే వ్యక్తి మాత్రమే దరఖాస్తులు దాఖలు చేయడం గమనార్హం. అయితే వారిద్దరికే మళ్లీ టెండర్లు దక్కితే ఐలాపై విమర్శలు వెల్లువెత్తుతాయన్న కారణంతో చైర్మన్ సూచనల మేరకు వై.దేవదాస్ అనే వ్యక్తితో డమ్మీ దరఖాస్తు దాఖలు చేయించినట్లు తెలుస్తోంది. రెండు పనుల్లోనూ దేవదాస్ దాఖలు చేసిన టెండర్ అనర్హత సాధించడమే ఇందుకు నిదర్శనమని ఐలా అధికారవర్గీయులు గుసగుసలాడుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment