tenders allegation
-
‘ఐలా’ లీలలు!
సాక్షి, అమరావతి: విజయవాడ ఆటోనగర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా) అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ఆటోనగర్ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులకు ఐలా అధికారులు టెండర్లను ఆహ్వానించారు. గత నాలుగేళ్లుగా టెండర్లు లేకుండానే పారిశుద్ధ్య పనులు చేపట్టిన టీడీపీ వర్గీయులే మళ్లీ టెండర్లు దక్కించుకునేలా ఐలా అధికారులు నిబంధనల్లో మార్పులు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఐలాకు చెందిన ఓ జోనల్‌స్థాయి అధికారి ఈ వ్యవహారంలో చక్రం తిప్పారన్న వాదన వినిపిస్తోంది. పారదర్శకంగా నిర్వహించాల్సిన టెండర్ల ప్రక్రియ గాడితప్పింది. తమకు అనుకూలురైన వారికే టెండర్లు కట్టబెట్టాలన్న దురుద్దేశంతో విజయవాడ ఆటోనగర్‌లోని ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(ఐలా) అధికారులు లేని నిబంధనలు సృష్టించినట్లు తెలుస్తోంది. తద్వారా గతంలో పనులు చేపట్టిన వారికే తిరిగి పనులు కట్ట్టబెట్టారన్న వాదన వినిపిస్తోంది. ఎక్కడా లేని నిబంధనలు.. ఆటోనగర్‌లో పారిశుద్ధ్య పనులకు ఐలా అధికారులు ఈ నెల 2వ తేదీన టెండర్లను ఆహ్వానించారు. అయితే ఎక్కడా లేనివిధంగా టెండర్‌లోని నిబంధనలు ఉండటం.. కొంత మంది వ్యక్తులకు లబ్ధి చేకూరేలా వాటిని రూపొందించడం జరిగింది. టెండర్లు ఎవరికి దక్కుతాయో తెలియకుండానే కాంట్రాక్టర్లు వర్కర్ల గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు జతపరచాలని షరతు విధించారు. డ్వాక్రా సంఘాలకు సంబంధించిన 19 ఏళ్ల ఆడిట్ రిపోర్టు అడిగారు. అలాగే ఆయా సంఘాలకు సంబంధించి జీఎస్టీ సర్టిఫికెట్ జతపర్చమన్నారు. అలాగే ఐలాపై కోర్టుకు వెళ్లిన వారు అనర్హులు అనే నిబంధన కూడా పెట్టారు. వీటిపై గతంలో ఐలా పరిధిలో పారిశుద్ధ్య పనులు చేపట్టిన కొందరు కాంట్రాక్టర్లు ఏపీఐఐసీ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆ నిబంధనలను సడలిస్తున్నామంటూనే.. గడిచిన ఐదేళ్ల కాలంలో ఎక్కడైనా రూ. 34 లక్షల పారిశుద్ధ్య పనులు చేసినట్లుగా సర్టిఫికెట్‌ను జతపర్చాలని కొత్త మెలిక పెట్టారు. చివరకు తమకు అనుకూలంగా ఉన్నవారికే పనులు దక్కేలా చక్రం తిప్పారు. మొత్తం పనుల విలువ రూ. 33.65 లక్షలు.. ఆటోనగర్‌లోని పారిశుద్ధ్య పనుల కోసం ఐలా అధికారులు ‘బ్లాక్–ఏ’.. ‘బ్లాక్–బీ’ పనులకు ఐలా అధికారులు టెండర్లను ఆహ్వానించారు. ఒక్కో టెండర్ విలువ రూ. 16,82,595గా నిర్థారించారు. టెండర్ నిబంధనల మేరకు కాంట్రాక్ట్ దక్కించుకున్నవారు ఆటోనగర్ 3వ క్రాస్ నుంచి 5వ క్రాస్ వరకు, ఫేస్–2, ఫేస్–3లో గల ప్రాంతంలోని 165 ఎకరాల స్థలంలో సుమారు 12 కిలో మీటర్ల పొడవుగల అన్ని రహదారులు, పేవ్మెంట్స్, ఫుట్‌పాత్‌లను శుభ్రపరచడంతోపాటు చెత్త, మట్టి, బూడిద, ఇసుక, రాళ్లు, సిల్టు, పిచ్చిమొక్కలు, చిన్నచిన్న జంతు కళేబరాలు.. ఇలా మొత్తం రోజూ ఉత్పత్తి అయ్యే 15 టన్నుల చెత్తను 24 మంది వర్కర్లతో తొలగించి దానిని మూడు టిప్పర్ల ద్వారా పాతపాడు, సింగ్‌నగర్ డంపింగ్ యార్డులకు తరలించాలి. మూడు నెలల కాల వ్యవధి ఉన్న ఈ పనుల మొత్తం విలువ రూ. 33.65 లక్షలు. మూడే దరఖాస్తులు.. అందులో ఒకటి డమ్మీ..! టెండర్ల ప్రక్రియలో ఐలాకు చెందిన జోనల్ అధికారి ఒకరు చక్రం తిప్పినట్లు సమాచారం. ఈ పనులకు గట్టి పోటీ ఉంటుందని తెలిసి.. గతంలో పనిచేసిన వారికే మళ్లీ పనులు దక్కేలా నిబంధనలు రూపొందించారనే ఆరోపణలు ఉన్నాయి. ఏడాది కాల పరిమితితో 2015లో ఐలా నిర్వహించిన టెండర్లలో గోగినేని ఉమా అనే మహిళ లారీలకు సంబంధించిన చెత్తను తరలించే పనులు దక్కించుకోగా.. కానూరి మణితా అనే మరో మహిళ పారిశుద్ధ్య పనులను దక్కించుకున్నారు. ఆ తర్వాత ఏడాది నుంచి నేటి వరకు నాలుగేళ్లపాటు ఎలాంటి టెండర్లు నిర్వహించకుండానే వారిద్దరికి ఆయా పనులను అప్పగించారు. అప్పటి, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావుతోపాటు, ఐలా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సుంకర దుర్గాప్రసాద్‌కు వారు సన్నిహితులనే ప్రచారం ఉంది. అందువల్లే వారికి టెండర్ల లేకుండానే పనులు అప్పగించారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా శుక్రవారం నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో గోగినేని ఉమా, కానూరి మణితాతోపాటు వై.దేవదాస్ అనే వ్యక్తి మాత్రమే దరఖాస్తులు దాఖలు చేయడం గమనార్హం. అయితే వారిద్దరికే మళ్లీ టెండర్లు దక్కితే ఐలాపై విమర్శలు వెల్లువెత్తుతాయన్న కారణంతో చైర్మన్ సూచనల మేరకు వై.దేవదాస్ అనే వ్యక్తితో డమ్మీ దరఖాస్తు దాఖలు చేయించినట్లు తెలుస్తోంది. రెండు పనుల్లోనూ దేవదాస్ దాఖలు చేసిన టెండర్ అనర్హత సాధించడమే ఇందుకు నిదర్శనమని ఐలా అధికారవర్గీయులు గుసగుసలాడుకుంటున్నారు. -
హంగులకే కోట్లు ఇస్తున్నారు
సాక్షి, ఆదిలాబాద్ : అసలు కంటే కొసరే ఎక్కువ అన్నట్టుంది ఆదిలాబాద్ కొత్త మున్సిపాలిటీ భవన నిర్మాణం తీరు. భవన నిర్మాణం కంటే మిగితా హంగులకే రెట్టింపు ఖర్చు చేస్తుండటం గమనార్హం. ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా ప్రారంభమైన ఈ భవన నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడంలేదు. పైపెచ్చు.. అంచనా వ్యయాలు పెరుక్కుంటూ ఇంతవరకూ వచ్చింది. మొదట మున్సిపల్ ఫండ్ కొత్త రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలకవర్గం ఆదిలాబాద్ బల్దియాలో కొలువుదీరిన తర్వాత 2017లో మున్సిపాలిటీ కోసం కొత్త భవనం నిర్మించాలని తలపెట్టారు. అప్పట్లో రూ.3.50 కోట్ల అంచనా వ్యయంతో భవనం అన్ని సదుపాయాలతో నిర్మించాలని భావించారు. అప్పుడు మున్సిపాలిటీకి కేంద్రం నుంచి వచ్చే బీఆర్జీఎఫ్ నిధులను దీనికోసం వెచ్చించాలని యోచించారు. అయితే బీఆర్జీఎఫ్ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో అసలు సమస్య వచ్చింది. దీంతో అప్పటికే మిగులు బీఆర్జీఎఫ్ నిధులు, మున్సిపల్ ఫండ్ కలిపి రూ.1.70 కోట్లతో భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. టెండర్‌ను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించారు. ఆ నిధుల మేరకు కేవలం భవన నిర్మాణం చేసి వదిలిపెట్టారు. భవనానికి లోపల, బయట తుది మెరుగులకు నిధులు లేకపోవడంతో పనులు నిలిచిపోయాయి. నాసిరకంగా నిర్మాణం అప్పట్లో కాంట్రాక్టర్ భవన నిర్మాణానికి సంబంధించి నాణ్యత పాటించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఈ భవన నిర్మాణంలో పెచ్చులు ఊడిపోయాయని చెబుతున్నారు. అంతేకాకుండా నిర్మాణ సమయంలో వాటర్ క్యూరింగ్ సరిగా చేయకపోవడంతో భవనం నాణ్యతపై ప్రశ్న తలెత్తుతోంది. దీంతోనే పెచ్చులు ఊడిపోయాయని పలువురు పేర్కొంటున్నారు. కోట్ల నిధులు వెచ్చించి భవనాలు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు సరైన పర్యవేక్షణ చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అధికారులు కాంట్రాక్టర్ల అడుగులకు మడుగులొత్తడం ఈ పరిస్థితికి కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఆర్అండ్బి కింద ఆరునెలల క్రితం ఈ టెండర్ మంజూరైంది. అయితే వరుసగా ఎన్నికలు రావడంతో టెండర్ పనులు పూర్తికాలేదు. తాజాగా టెండర్ పూర్తిచేసి కాంట్రాక్టర్‌కు రూ.3 కోట్ల పనులను అప్పగించారు. అందులో భాగంగా మున్సిపాలిటీ భవనాన్ని ఆకర్షణీయమైన హంగులతో నిర్మాణం పూర్తి చేసేందుకు 15 రోజుల కిందట పనులు ప్రారంభించారు. అయితే మున్సిపల్ అధికారుల తీరుపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ప్రధానంగా వరుసగా ఎన్నికలు వచ్చిన సమయంలో కలెక్టర్ అనుమతి తీసుకొని వివిధ పనులు చేపట్టారు. మున్సిపాలిటీ భవన నిర్మాణ పనులు ఇదివరకే ప్రారంభమైన దృష్ట్యా కలెక్టర్ అనుమతితో ఎప్పుడో మళ్లీ టెండర్ చేసి పనులు అప్పగించేందుకు చర్యలు తీసుకొని ఉంటే ఈపాటికి భవన నిర్మాణం పూర్తయ్యేది. అయితే పాలకవర్గం పదవీకాలం జూలై 2వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలో అప్పటివరకు వేచిచూసిన అధికారులు ఇటీవల టెండర్ పనులు పూర్తిచేయడం వెనక ఆంతర్యమేమిటో? ఆర్అండ్బీ నిధులతో మళ్లీ జీవం బీఆర్జీఎఫ్ నిలిచిపోవడం, ఇటు మున్సిపాలిటీలో నిధులు లేకపోవడంతో మున్సిపాలిటీ నూతన భవన నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో అసలు భవన నిర్మాణం పూర్తవుతుందా?.. లేదా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల పట్టణ శివారులో ఉన్న పలు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసిన విషయం విదితమే. అందులో భాగంగా ఆదిలాబాద్ బల్దియాను 36 వార్డుల నుంచి 49 వార్డులకు పెంచారు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులు, సిబ్బందికి మరింత బాధ్యత, పనితీరు పెరగనుంది. దీనికితోడు ప్రస్తుతం ఉన్న భవనం విస్తరించిన మున్సిపాలిటీ కార్యకలాపాలకు సరిపోనివిధంగా ఉండడం కూడా రానున్న రోజుల్లో కొత్త భవనం ఆవశ్యకతను తెలియజేస్తుంది. ప్రస్తుతం ఉన్న భవనానికి ఎదురుగానే ఇందిరా టౌన్‌హాల్ స్థలంలో ప్రస్తుతం సంప్‌హౌజ్‌కు సమీపంలోనే ఈ కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. జీ ప్లస్ 3 నమూనాలో నిర్మిస్తున్న ఈ సముదాయంలో పైఅంతస్తు పూర్తిగా సమావేశ మందిరం కోసం చేపడుతున్నారు. ప్రస్తుతం 49 వార్డులకు పెరగడంతో కౌన్సిలర్ల సంఖ్య 49తో పాటు కోఆప్షన్ సభ్యులు, అధికారులు అందరూ కలిపి సుమారుగా వందమంది సమావేశ మందిరంలో కూర్చునేందుకు వీలుగా భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం భవనం నిర్మించినప్పటికీ మెరుగులు దిద్దాల్సి ఉంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ పనులు చేపట్టేందుకు వీలుగా రూ.3 కోట్లు వెచ్చిస్తున్నారు. సమావేశ మందిరంలో పూర్తిగా సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా భవిష్యత్‌లో గ్రేడ్–1 మున్సిపాలిటీ నుంచి మరింత ఉన్నత గ్రేడ్ సాధించినా ఈ భవనంలో కార్యకలాపాలకు సరిపోయేలా పనులు చేపడుతున్నారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్‌ను వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. దీంతో మున్సిపల్ ఏఈ అరుణ్‌ను వివరణ కోరగా భవన నిర్మాణ పనులు మళ్లీ 15 రోజుల కిందట ప్రారంభించినట్లు తెలిపారు.త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
‘మేడిగడ్డ’ బ్యారేజీల నిర్మాణం ఏ రేట్లతో?
సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా నిర్మించే కొత్త బ్యారేజీలకు ఏ ధరలను నిర్ణయించాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించే మార్గంలో బ్యారేజీలకు కొత్త స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల (ఎస్ఎస్ఆర్) ప్రకారం.. ఇప్పటికే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తే ప్రభుత్వంపై 1,500 కోట్ల భారం పడుతుంది. దీంతో ప్రభుత్వం అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో ప్రాణహిత ప్యాకేజీ-3 పనులను చేస్తున్న కాంట్రాక్టర్లతో నీటిపారుదల శాఖ బుధవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. పాత ధరల ప్రకారం పనులు చేస్తామంటే నేరుగా కాంట్రాక్టు అప్పగిస్తామని, లేనిపక్షంలో కొత్తగా టెండర్లు పిలుస్తామని స్పష్టం చేసింది. నిర్ణయం తెలిపేందుకు రెండు రోజుల గడువు విధించింది. ‘ప్రాణహిత’ ప్యాకేజీలకు సీఈలు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో విభజించిన ప్యాకేజీ పనులకు జిల్లాల వారీగా చీఫ్ ఇంజనీర్ (సీఈ)లకే బాధ్యత కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 5 జిల్లాల పరిధిలోని సీఈలు వారివారి జిల్లాలోని ప్యాకేజీ పనులను పర్యవేక్షిస్తారు. ఆదిలాబాద్ జిల్లా సీఈ ప్రాణహితలోని ఒకటినుంచి 5 ప్యాకేజీలు, కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ 6 నుంచి 9 ప్యాకేజీలు, ఎస్సారెస్పీ సీఈ 27, 28 ప్యాకేజీలు, గోదావరి బేసిన్ సీఈ 20, 21 ప్యాకేజీ పనుల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. మిగిలిన అన్ని ప్యాకేజీ పనులకు ప్రాణహిత ప్రాజెక్టు సీఈకి బాధ్యత కట్టబెట్టారు.