సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీ డిజైనింగ్‌లో భాగంగా నిర్మించే కొత్త బ్యారేజీలకు ఏ ధరలను నిర్ణయించాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. కాళేశ్వరం దిగువన ఉన్న మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నీటిని తరలించే మార్గంలో బ్యారేజీలకు కొత్త స్టాండర్డ్ షెడ్యూల్ రేట్ల (ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం.. ఇప్పటికే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తే ప్రభుత్వంపై 1,500 కోట్ల భారం పడుతుంది.
దీంతో ప్రభుత్వం అయోమయంలో పడింది. ఈ నేపథ్యంలో ప్రాణహిత ప్యాకేజీ-3 పనులను చేస్తున్న కాంట్రాక్టర్లతో నీటిపారుదల శాఖ బుధవారం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది. పాత ధరల ప్రకారం పనులు చేస్తామంటే నేరుగా కాంట్రాక్టు అప్పగిస్తామని, లేనిపక్షంలో కొత్తగా టెండర్లు పిలుస్తామని స్పష్టం చేసింది. నిర్ణయం తెలిపేందుకు రెండు రోజుల గడువు విధించింది.
‘ప్రాణహిత’ ప్యాకేజీలకు సీఈలు
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో విభజించిన ప్యాకేజీ పనులకు జిల్లాల వారీగా చీఫ్ ఇంజనీర్ (సీఈ)లకే బాధ్యత కట్టబెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 5 జిల్లాల పరిధిలోని సీఈలు వారివారి జిల్లాలోని ప్యాకేజీ పనులను పర్యవేక్షిస్తారు. ఆదిలాబాద్ జిల్లా సీఈ ప్రాణహితలోని ఒకటినుంచి 5 ప్యాకేజీలు, కాళేశ్వరం ప్రాజెక్టు సీఈ 6 నుంచి 9 ప్యాకేజీలు, ఎస్సారెస్పీ సీఈ 27, 28 ప్యాకేజీలు, గోదావరి బేసిన్ సీఈ 20, 21 ప్యాకేజీ పనుల పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. మిగిలిన అన్ని ప్యాకేజీ పనులకు ప్రాణహిత ప్రాజెక్టు సీఈకి బాధ్యత కట్టబెట్టారు.