సాక్షి, అమరావతి: ప్రతి జిల్లాలో యువత నైపుణ్యంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని పర్యాటక, యువజన సర్వీసుల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. యువతలో దేశభక్తి, సంస్కృతిని పెంపొందించే అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మంగళవారం యువజన సర్వీసుల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రి పలు అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రంగాల్లో యువతకు పెద్ద పీట వేస్తున్నారని, దీనికి అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్దిలో యువత భాగం కావాలని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు . యువత నైపుణ్యం పెంపుదలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిత్వ వికాసంపై యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా వరల్డ్ హార్ట్ డే, నేషనల్ సైన్స్, గాంధీ జయంతి వంటి వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. స్త్రీల పట్ల గౌరవం పెంపొందించే కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. మత్తు, మద్యం వల్ల కలిగే అనార్థాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మానవ సంబంధాలు బాగా దెబ్బతింటున్నాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాపై కూడా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. సంస్కృతి, సాంప్రదాయలను గుర్తించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ కాలేజీలు, యూనివర్సిటీల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment