రక్తదానంపై అవగాహన పెరగాలి
రక్తనిధి కేంద్రం అధికారి డాక్టర్ సత్యశ్రీనివాస్
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: రక్తదానంపై యువతకు మరింత అవగాహన పెరగాలని ప్రభుత్వ రక్తనిధి కేంద్రం జిల్లా అధికారి డాక్టర్ సత్యశ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎస్‌బీఐ గ్రామీణ ఉపాధి శిక్షణ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధి శిక్షణ కోసం వచ్చిన యువతీయువకులు సమాజానికి అవసరమైన సేవా కార్యక్రమలపై దృష్టి సారించాలన్నారు.
అత్యవసర సమయంలో రక్తం అందక చాలా మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చాలామందికి రక్తదానం చేస్తే నీరసించిపోతామనే అపోహలున్నాయని,అటువంటి వాటిని విడనాడాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్న వారు ప్రతి మూడు నెలలకొకసారి రక్తదానం చేయవచ్చన్నారు.
రక్తనిధి కేంద్రాల్లో కూడా నిల్వలు లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అటువంటి సమయంలో రక్తం అవసరమైన రోగులు చాలా ఇబ్బందిపడుతున్నరని చెప్పారు. శిక్షణకు వచ్చిన వారిని చైతన్యపరిచి రక్తదానం శిబిరం నిర్వహించిన శిక్షణ కేంద్రం నిర్వాహకులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలను ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించారు. అనంతరం 15 మంది విద్యార్థులు, సంస్థ సిబ్బంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో సంస్థ డెరైక్టర్ వేమూరి శివశంకర్, సిబ్బంది వర్మ, తదితరులు పాల్గొన్నారు.