అరసవల్లి : దేశంలో ఉన్న 300 రకాల పాముల్లో కేవలం 10 శాతం జాతులే హాని చేస్తాయని, ఇందులో నాగు పాము(కోబ్రా), రక్త పింజరి, కట్ల పాము, పొడ పాము(ఉల్లి పాము) అనే నాలుగు రకాలే(బిగ్ ఫోర్) తీవ్ర హాని కలిగిస్తాయని కళింగ సెంటర్ ఫర్ రెయిన్ ఫారెస్ట్ ఎకాలజీ(కేసీఆర్‌ఈ) ప్రతినిధి డాక్టర్ గౌరీశంకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో బెంగళూరుకు చెందిన ఈ సంస్థ ప్రతినిధులు ప్రత్యేక అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాములపై ప్రజల్లో ఎంతో భయాందోళనలున్నాయని, వీటిని పూర్తి అవగాహనతోనే రూపు మార్చాలని సూచించారు. అటవీ శాఖ సిబ్బంది పాముల సంరక్షణను కూడా విధుల్లో భాగమనే విషయాన్ని మరవకూడదని గుర్తుచేశారు. అంతకు ముందు పాముల సంచారం, కాటు వేసిన తరువాత, అలా గే ముందస్తు చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే ప్రత్యేక డాక్యుమెంటరీ ద్వారా పాముల రకాలను, జిల్లాలో సంచరిస్తున్న పలు రకాల పాము జాతులపై అవగాహన కల్పిం చారు.
అనంతరం కేసీఆర్‌ఈ మరో ప్రతినిధి కేఎల్‌ఎన్ మూర్తి జిల్లాలో పాముల సంచారం, తీసుకోవాల్సిన సంరక్షణా చర్యలపై వివరించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారులు సీహెచ్ శాంతిస్వరూప్, బలివాడ ధనుం జయరావు, రేంజర్లు, డిప్యూటీ రేంజర్లు, కేసీఆర్ ఈ ప్రతినిధులు ప్రియాంక స్వామి, గ్రీన్‌మెర్సీ సంస్థ ప్రతినిధి కేవీ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాలో సోంపేటకు చెందిన పాములను పట్టే నిపుణుడు బాలరాజు ఈ సంస్థ ప్రతినిధులను కలిసి పలు విషయాలు, సందేహాల పై చర్చించారు. ఈ సందర్భంగా బాలరాజుకు పాములను చాకచక్యంగా పట్టేలా ఉండే హుక్కు, బ్యాగర్‌లను డాక్టర్ గౌరీశంకర్ అందజేశారు.
నాటు మందుల జోలికి వెళ్లొద్దు
పాములను చూసి, లేదా పాము కాటు వేసిన అనంతరం బాధితుడు ఏమాత్రం భయపడ కూడదని, ఆభయమే ప్రాణాలను కోల్పోయేలా చేస్తుందని, అలాగే చికిత్స కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ నాటు మందుల జోలికి వెళ్లొద్దని కేసీఆర్‌ఈ ప్రతినిధి డాక్టర్ గౌరీశంకర్ సూచించారు. అటవీ శాఖాధికారులకు అవగాహన సదస్సు అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
స్థానిక జిల్లాలో వ్యవసాయమే ప్రధాన ఆధారమని, ఇక్కడి పంటపొలాల్లో ప్రస్తుత సీజన్‌లోనే పాము కాట్లతో ఎక్కువ మంది మృతి చెందుతున్న ఘటనలు చోటుచేసుకుంటాయన్నారు. ఇటువంటి సమయాల్లో నాటు మందులు కోసం ప్రయత్నాలు చేయకూడదని, వైద్య చికిత్సలపై ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలను తెలియజేశారు.
రాత్రి పూట ఆరుబయటకు వెళ్లినా, పొలాలకు వెళ్లినా టార్చిలైట్‌ను వెంట తీసుకెళ్లాలి.∙పాముకాటు వేసిన వెంటనే బాధితుడు భయపడకూడదు.అయితే తక్షణ చర్యలకు సిద్ధం కావాలి. పాముకాటు వేసినప్పుడు ఏమాత్రం గుండెపై ఒత్తిడి లేకుండా చూడాలి.
- కాటు వేసిన భాగంలో తాడు లేదా గుడ్డతో కట్టు వేయాలి.
- నాటు మందులను వినియోగించరాదు.
- అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ పాముకాటు రక్షణకోసం స్నేక్‌వీనమ్‌ను అందుబాటులో ఉంచాలి.
- ఈ మందులు ప్రతి గ్రామ పరిధిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment