
ఆయుష్ ఉండేనా?
పీపీపీ పద్ధతిలో నిర్వహించేందుకు{పభుత్వ సన్నాహాలు
సర్కారుతో సంప్రదిస్తోన్న పలు కంపెనీలు
ఉద్యోగుల్లో భయం.. భయం
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైద్యసేవలందిస్తోన్న ఆయుష్‌కు ఆయువు మూడినట్టే కనిపిస్తోంది. ఇప్పటికే వ్యవసాయంలో ఆదర్శరైతులు.. ఉపాధి పథకంలో.. ఫీల్ట్ అసిస్టెంట్లను తొలగించిన ప్రభుత్వం తాజాగా వైద్యశాఖలోనూ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. పబ్లిక్, ప్రయివేటు భాగస్వామ్యంతో ఏజెన్సీల ద్వారా వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం పావులు కదుపుతోంది. దీంతో ఆయుష్.. ఉంటుందా... ఊడుతుందా అర్థంకాక ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
పలమనేరు: భారతీయ సాంప్రదాయ వైద్య విధానంగా పేరున్న ఆయుష్‌లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయుష్ సేవలను పీపీపీ( పబ్లిక్ ప్రయివేట్ పార్టనర్‌షిప్) ద్వారా నిర్వహించేందుకు ప్రభుత్వం సమయాత్తమైనట్టు తేలిపోయింది. ఈ విధానంతో తమకు ముప్పు తప్పదని ఆయుష్‌లోని ఉద్యోగులు, కొత్త కొలువుల కోసం వేచి చూస్తున్న నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఏడేళ్లుగా ఆయుష్‌లో నోటిఫికేషన్ లేక ఎదురుచూపులు చూస్తున్న తరుణంలో ప్రయివేటు ఏజెన్సీలు కింద కాంట్రాక్టు వైద్యులుగా పనిచేయాల్సిందేనేమోనన్న భయం రోజురోజుకూ పెరుగుతోంది. కేంద్రం ఆయుష్ విభాగాన్ని మరింత భలోపేతం చేసేందుకు భారీగా నిధులను అందస్తోంది. అయితే మన రాష్ట్రంలో మాత్రం పీపీపీని ప్రవేశపెట్టేందుకు శరవేగంగా పావులు కదుపుతున్నారు.
ప్రస్తుతం విధానం ఇలా...
జిల్లాలోని ఆయుష్( అల్లోపతి,యోగా అండ్ నేచురోపతి,యునాని, సిద్ద, హోమియోపతి)లో మొత్తం 48 వైద్యశాలలున్నాయి. ఇందులో రెగ్యులర్, ఎన్‌హెచ్‌ఆర్‌ఎం ద్వారా కాంట్రాక్టులలో దాదాపు 150 మంది వరకు ైవె ద్యులు, వందల సంఖ్యలో కిందిస్థాయి సిబ్బంది పనిచేస్తున్నారు. వీరు గామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్యసేవలను అందిస్తున్నారు. అయితే ఆయుష్‌కు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏజెన్సీల ద్వారా ఇవే సేవలు అందుబాటులో కొస్తే ఆయుష్ ఇక తెరమరుగైనట్లేన న్న వాదనలు వినిపిస్తున్నాయి.
పీపీపీతో ఇలా...
దేవాదాయశాఖ తన పరిధిలోని భూములను కారు చౌకగా...కంపెనీలకు ఇస్తే.. ప్రయివేటు కంపెనీలు తమ సిబ్బంది, పరికరాలతో వైద్యసేవలందించే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇదే జరిగితే వైద్యుల నియమకం, మందుల పంపినీని ఏజెన్సీలే నిర్వహించనున్నాయి. ఇప్పటికే కేరళ ఆయుర్వేదం, కోటకల్ ఆయుర్వేదం,ఆర్య వైద్య నిలయం, శాంతగిరి తదితర సంస్థలు పీపీపీలోకి వెళ్లి సేవలందించేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. వీరి ఆధ్వర్యంలో ఈ సేవలు జరిగితే భవిష్యత్తులో ఆయుష్ ఉనికి ప్రశ్నార్థకంగా మారనుంది. మరోవైపు ఈ శాఖలో నోటిఫికేషన్‌పడి సుమారు ఏడేళ్లవుతోంది. జిల్లాలో దాదాపు 200 మంది కొత్త నిరుద్యోగులు ఆయుష్‌లో కొలువుల కోసం వేచి చూస్తున్నారు. అయితే ప్రభుత్వం పీపీపీని అమలు చేస్తోండడంతో తమను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటారా లేక ఏజేన్సీల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించుకుంటారా అనే ఆయోమయం ఉంది. ఏదేమైనా ప్రభుత్వ కొత్త విధానం ఆయుష్‌ను పెంచుతుందా లేక ఉన్న ఆయుష్‌ను తగ్గిస్తుందా వేచి చూడాల్సిందే.