
‘బాబు’ పాలనపై కామ్రేడ్ల కన్నెర్ర
నెల్లూరు (సెంట్రల్): అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబుకు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదంటూ కామ్రేడ్లు కన్నెర్ర చేశారు. అధికారం వచ్చినప్పటి నుంచి కార్మికులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న ప్రభుత్వం కూలి పోవాలని కోరుకుంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన ఐకేపీ యానిమేటర్లను, వారికి మద్దతు పలికిన సీపీఎం నాయకులను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్టు చేసినందుకు నిరసనగా సోమవారం నగరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు మాట్లాడుతూ కొన్ని రోజుల నుంచి యానిమేటర్లు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదన్నారు.
చంద్రబాబుకు పోయే కాలం దగ్గర్లోనే ఉన్నందున ఈ విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఎన్నికల ముందు హామీలివ్వడం కాదని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిలబెట్టుకోవాలన్నారు. అలా కాకుండా కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ఐకేపీ యానిమేటర్లు జీతాలు చెల్లించాలని అడుగుతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. తమ గోడును అసెంబ్లీ వరకు వినిపించేందుకు చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన వారిని రాత్రిళ్లు అరెస్టు చేయడం దారుణమన్నారు.
ఇప్పుడే ఈ ప్రభుత్వం తీరు ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో భయంకరంగా తయారవుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క రోజు కూడా ఈ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదంటూ ఘాటుగా స్పందించారు. చంద్రబాబు గత పాలన మాదిరే ఇప్పుడు అవలంబించి సమస్యలపై ప్రశ్నించేవారిని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిందన్నారు. త్వరలో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. తొలుత సీఐటీయూ కార్యాలయం నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు షాహినాబేగం, విజయమ్మ, చాంద్‌బాషా, దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.