‘‘అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తాం. బ్యాంకుల్లో తాకట్టులో ఉన్న బంగారాన్ని ఇంటికి చేరుస్తాం.’’ తేనె పూసిన మాటలతో ఎన్నికల ముందు రైతుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించిన చంద్రబాబు.. ఐదేళ్లు గడిచినా మాట నిలుపుకోలేకపోయారు. అధికారం కట్టబెట్టిన ప్రజలను, రైతులను టీడీపీ ప్రభుత్వం అప్పుల పాలు చేసి రోడ్డున నిలిపింది. అరకొర రుణమాఫీ వడ్డీలకూ సరిపడక.. తాకట్టులోని బంగారం విడిపించుకునే దారి కనిపించక చుక్కలు చూస్తున్నారు. బ్యాంకుల నుంచి నోటీసులు.. పత్రికల్లో వేలం ప్రకటనలతో అవమాన భారం అన్నదాతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికారం చేపట్టే రోజుకు జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల్లో 10.24లక్షల ఖాతాలకు సంబంధించి రూ.6,817.85 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వం తేల్చిన లెక్కల ప్రకారం 8.20లక్షల ఖాతాలు రుణమాఫీకి అర్హత సాధించాయి. ఈ లెక్కన రూ.4,944కోట్ల రుణమాఫీ కావాలి. అంటే.. రూ.3,093.06కోట్ల పంట రుణాలు, రూ.1851.18కోట్ల బంగారు రుణాలు మాఫీ కావాల్సి ఉంది. అయితే ప్రభుత్వం మాత్రం పంట, బంగారు రుణాలు కలిపి కేవలం రూ.2,956కోట్లు మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది.
ఇదీ ‘బంగారు’ అప్పుల లెక్క
జిల్లా వ్యాప్తంగా 2.12లక్షల మంది రైతులు బంగారం తనఖా పెట్టి రూ.1851.18కోట్లు రుణంగా తీసుకున్నారు. సర్కారు లెక్క ప్రకారం ఇవన్నీ మాఫీ కావాలి. అయితే ప్రభుత్వం కేవలం 1.32లక్షల ఖాతాల్లో రూ.905.12కోట్ల బంగారం రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించింది. దీంతో తక్కిన 79,939 ఖాతాల్లోని రూ.946.06కోట్లు మాఫీ చేయకుండా రైతులను మోసం చేసింది. అంతటితో ఆగలేదు. మాఫీ చేస్తామని ప్రకటించిన మొత్తంలో కూడా రూ.218.42కోట్లను మాత్రమే మాఫీ చేసింది. ఇదేంటని విపక్షాలు ప్రశ్నిస్తే మొదటి విడత మాఫీ అని, తక్కిన బకాయిలు విడతల వారీగా చెల్లిస్తామని బుకాయించారు. దాదాపు ఐదేళ్ల పదవీకాలం ముగిసింది. తిరిగి ఎన్నికలు వచ్చాయి. ఇప్పటి వరకూ బంగారం రుణాలు మాఫీ చేయాలనే ఆలోచనే ప్రభుత్వానికి లేకుండా పోయింది. అంటే మొత్తంగా జిల్లాలో రైతులకు రూ.1851.18కోట్ల బంగారం రుణాలు ఉంటే ప్రభుత్వం రూ.218.42కోట్లు మాత్రమే మాఫీ చేసింది. ఈ వంచనతో రైతులకు చెందిన రూ.1632.76కోట్ల బకాయి మిగిలింది. మాఫీ చేసిన సొమ్మును.. మాఫీ చేయాల్సిన సొమ్ముకు వడ్డీని ఈ ఐదేళ్లకు లెక్కిస్తే ఏ మూలకూ సరిపోని పరిస్థితి.
బంగారం వేలం వేస్తామని నోటీసులు
బంగారం రుణాలపై ప్రభుత్వ వ్యవహార శైలిని బ్యాంకర్లు గమనించారు. రుణమాఫీ విధానంపై లోతుగా అధ్యయనం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏటా 20 శాతం రుణమాఫీ చేసినా.. వడ్డీనే 14–18శాతం అవుతుంది. అంటే ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం వడ్డీ కూడా మాఫీ చేయలేని పరిస్థితి. దీంతో తీసుకున్న రుణమాఫీతో సంబంధం లేకుండా తీసుకున్న రుణాలను గడువులోపు చెల్లించాలని బ్యాంకర్లు రైతులకు నోటీసులు జారీ చేశారు. ఇవి కాకుండా రైతుల పేర్లు, తీసుకున్న రుణం, వేలం తేదీలను పత్రికల్లో రోజూ పేజీలకు పేజీలు ప్రకటనలు ఇచ్చారు. రెండేళ్ల పాటు బ్యాంకర్ల నుంచి ఇదే వేధింపులు కొనసాగాయి. పత్రికల్లో వేలం ప్రకటనలు, ఇంటికి నోటీసులు చూసి రైతులు తీవ్ర అవమానానికి లోనయ్యారు. వరుస కరువులతో కుదేలవుతున్న జిల్లా రైతులు పూటగడవటమే కష్టమైన తరుణంలో కర్ణాటక, కేరళ ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకుంటున్నారు. సత్తువ లేని రైతులు భిక్షాటనకు సిద్ధపడ్డారు. ఇంతటి దారుణ పరిస్థితిలో ఉన్నప్పుడు ఏ నోటీసు ఇస్తే తామేం రుణాలు చెల్లిస్తామని రైతులు బంగారాన్ని వదిలేసిన ఘటనలు కోకొల్లలు. ఇంకొందరు అప్పులు చెల్లించలేక, వేలం వేస్తారనే అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలకు తెగించారు. ఇలా గడిచిన 58 నెలల్లో 273 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కుటుంబాలతో పాటు అప్పులపాలైన లక్షలాది రైతు కుటుంబాల వేదనకు ప్రత్యక్షంగా చంద్రబాబు ప్రభుత్వం కారణమైంది.
రైతులకు అండగా నిలిచిన జగన్
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ‘అనంత’ను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణించాలి. ఇక్కడి వ్యవసాయ పరిస్థితులు, కరువు ప్రభావం మరే ప్రాంతంతో పోల్చలేనిది. పైగా ఇక్కడ రెండు పార్లమెంటు స్థానాలతో పాటు 12 అసెంబ్లీ స్థానాలను జిల్లావాసులు టీడీపీకి కట్టబెట్టారు. అప్పుల బాధ తాళలేక గత ఐదేళ్లలో వందలాది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయినా ప్రభుత్వం మాత్రం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేకపోయింది. రైతుకు భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. జిల్లా పరిస్థితులను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా విఫలమయ్యారు. కానీ విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఆత్మహత్య చేసుకున్న 82 రైతు కుటుంబాల ఇళ్లకు నేరుగా వెళ్లి భరోసా కల్పించారు.
రుణమాఫీ నగదు వడ్డీకి జమ
గ్రామంలో ఎనిమిది ఎకరాల పొలం ఉంది. వేరుశనగతో పాటు రాగి, వరి పంటలు సాగు చేస్తున్నాం. వర్షాలు లేకపోవడంతో పొలంలో బోరుబావి తవ్విచ్చేందుకు 2013లో అగళి కర్ణాటక బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టి రూ.లక్ష అప్పుగా తీసుకున్నాం. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు మాటలను పూర్తిగా విశ్వసించాం. ఆ తర్వాత ఆయన మాట మార్చడం, నగలు వేలం వేస్తామని బ్యాంకోళ్లు నోటీసులు ఇవ్వడంతో ప్రయివేట్‌గా వడ్డీకి తీసుకొచ్చి విడిపించుకున్నా. వచ్చిన అరకొర రుణమాఫీ సొమ్ము వడ్డీకే జమేసుకున్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం.
– విజయ్‌కుమార్, కె.బ్యాడిగెర గ్రామం, రొళ్ల మండలం
Comments
Please login to add a commentAdd a comment