బంద్‌తో బాబుకు వణుకు పుట్టిద్దాం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరుబాట పట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 29న బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంలో ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ముఖ్యనాయకులు, నియోజకవర్గ సమన్వయకర్తలు సమావేశమయ్యారు. ఆ సందర్భంగా పార్టీ జిల్లా పరిశీలకునిగా నియమితులైన ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను సత్కరిస్తున్న దృశ్యమిది.
- వైఎస్సార్ సీపీ జిల్లా పరిశీలకుడు సుభాష్‌చంద్రబోస్, జిల్లా అధ్యక్షుడు సుబ్బారాయుడు
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వణుకు పుట్టించాలని పార్టీ జిల్లా పరిశీలకుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో చంద్రబోస్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించాలన్నారు.
రైతుల రుణాలు పూర్తిస్థాయిలో మాఫీ కాలేదని, డ్వాక్రా రుణాలు, బెల్టు షాపుల రద్దు, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో పదవీ విరమణ వయసు పెంపు వంటి ఎన్నికల హామీలను చంద్రబాబు ఇప్పటికీ అమలు చేయలేదనే అంశాన్ని ప్రజలకు వివరిం చాలని పార్టీ శ్రేణులకు సూచించారు. అక్రమ మార్గంలో పయనించే చింతమనేని వంటి నాయకులు కాలగర్భంలో కలిసిపోక తప్పదని స్పష్టం చేశారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సుబ్బారాయుడు మాట్లాడుతూ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీని స్తంభింపచేసిన తీరును పార్టీ శ్రేణులు స్ఫూర్తిగా తీసుకుని బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రజల సత్తా చూసి ఢిల్లీ పాలకుల్లో భయం పుడుతుందన్నారు. దీనికోసం ఇతర పార్టీల మద్దతు కూడగట్టాలని సూచించారు. సీపీఐ, సీపీఎం సానుకూలంగా స్పందించాయని వివరించారు.
నాయకులు ఏమన్నారంటే..
పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందన్నారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలకు ర్యాంకులు ఇవ్వడం పాలన విఫలమైనందుకా లేక రాష్ట్రాన్ని దోచుకుంటున్నందుకా అని ప్రశ్నించారు. మహిళలకు అన్నగా, కొడుకుగా ఉంటానన్న బాబు ఒక మహిళా తహసిల్దార్‌పై ప్రభుత్వ విప్ దాడి చేస్తే ఆమెను బెదిరించి బలవంతంగా నోరునొక్కేశారని పార్టీ మహిళా విభాగం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి ధ్వజమెత్తారు.
ముందుగా పార్టీ నాయకులు స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్‌లోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పరిశీలకునిగా తొలిసారిగా జిల్లాకు వచ్చిన సుభాష్ చంద్రబోస్‌ను సన్మానిం చారు. సమావేశంలో ఆచంట నియోజకవర్గ కన్వీనర్ ముదునూరి ప్రసాదరాజు, గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు, కొవ్వూరు నియోజకవర్గ పార్టీ కన్వీనర్ తానేటి వనిత, ఉంగుటూరు నియోజకవర్గ పార్టీ కన్వీనర్ పుప్పాల వాసుబాబు, దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ ఘంటా మురళి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు వందనపు సాయిబాల పద్మ, నాయకుడు కొయ్యే మోషేన్‌రాజు ప్రసంగించారు.
లంకా మోహన్‌బాబు, చెలికాని రాజ మోహనరావు, మేడపాటి చంద్రమౌళీరెడ్డి, కాశి రెడ్డి, కారుమంచి రమేష్, ముప్పిడి సంపత్ కుమార్, కేవీఎస్ రామకృష్ణ, గోలి శరత్‌రెడ్డి, పటగర్ల రామ్మోహనరావు, గంపల బ్రహ్మావతి, దిరిశాల వరప్రసాదరావు, గుడిదేశి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.