చిన్నారి దేవీశ్రీప్రసాద్‌తో తల్లిదండ్రులు
గొల్లప్రోలు: మూడేళ్ల చిన్నారి గుండెకు గాయమైంది. పుట్టుకతోనే గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారికి ఆపరేషన్ చేయకపోతే ప్రాణానికి ముప్పు అని వైద్యులు నిర్ధారించారు. గొల్లప్రోలులోని ఈబీసీ కాలనీకి చెందిన ఉమ్మిడి చంద్రశేఖర్, నీరజల మూడేళ్ల కుమారుడు దేవీశ్రీప్రసాద్ రెండో సంతానం. 2016లో పుట్టిన చిన్నారికి గుండె కొట్టుకును శబ్ధంలో తేడాను గమనించిన వైద్యులు స్కానింగ్ చేయించడం ద్వారా ఏరోటిక్ వాల్వ్ మూసుకుపోయి బ్లాక్ అవ్వడం ద్వారా రక్తసరఫరా మూసుకుపోయినట్టు గుర్తించారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో రూ.రెండులక్షలు వెచ్చించి గుండె వైద్యపరీక్షలు నిర్వహించి ప్రమాదకరమైన గుండె వ్యాధిగా నిర్ధారించారు.
అప్పటి నుంచి క్రమం తప్పకుండా వైద్యులు సూచన మేరకు మందులు వాడుతున్నారు. ఇటీవల బెంగుళూరులోని ఆర్‌ఎక్స్ డీఎక్స్ ఆసుపత్రి, కొలంబియా ఆసియా ఆసుపత్రి వైద్యులు పరిక్షలు నిర్వహించగా వాల్వ్ లీకేజీ ఎక్కువగా ఉండడంతో పాటు ఎడమ వైపు గుండె పరిమాణం పెద్దదిగా ఉన్నట్టు గుర్తించారు. గుండె పంపింగ్ కూడా బాగా తగ్గినట్టు గుర్తించారు. జనవరిలో ఓపెన్ హార్ట్ ఆపరేషన్ నిర్వహించకపోతే ప్రాణానికి ప్రమాదం అని కొలంబియా ఆసియా వైద్యులు తెలిపారు. కొన్ని గంటలపాటు నిరంతరాయంగా నిర్వహించే ఆర్‌ఓఎస్‌ఎస్ ఆపరేషన్‌కు సుమారు రూ.ఎనిమిది లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పురుగు మందులు షాపులో గుమస్తాగా పని చేస్తూ నెలకు రూ.10వేలు సంపాదించుకునే చిన్నారి తండ్రి చంద్రశేఖర్ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు తట్టుకునే ఆర్థిక స్థోమత లేక తల్లడిల్లిపోతున్నాడు. గుండె చికిత్స కోసం ప్రభుత్వం, దాతలు సహాయం చేయాలని చంద్రశేఖర్ కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment