బాలికా విద్యకు కరువైన ప్రోత్సాహం | Badikostha Scheme Delayed In West Godavari | Sakshi
Sakshi News home page

బాలికా విద్యకు కరువైన ప్రోత్సాహం

Published Fri, Jun 15 2018 6:55 AM | Last Updated on Fri, Jun 15 2018 6:55 AM

Badikostha Scheme Delayed In West Godavari - Sakshi

పశ్చిమగోదావరి, నిడమర్రు:  బాలికా విద్యకు ప్రోత్సాహం కరవవుతోంది. ప్రభుత్వానికి పథకాల ప్రకటనలపై ఉన్న ప్రచారపు హోరు.. వాటి అమలులో లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. విద్యాహక్కు చట్టం ప్రకారం బాలికా విద్యను ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ నేపథ్యంలో ప్రారంభించిన అనేక పథకాలు నీరుగారుతున్నాయి. ఏటా విద్యార్థినులకు ప్రభుత్వం అందించే న్యాప్‌కిన్ల పంపిణీ పథకం టీడీపీ అధికారంలోకి వచ్చాక అటకెక్కింది. 9వ తరగతి విద్యార్థినులకు ఉచిత సైకిళ్లు అందించే పథకం ప్రారంభించినా అది వాయిదాల పర్వంగా సాగుతోంది. నైన్త్‌లో బాలికలకు అందించాల్సిన ఉచిత సైకిళ్లు అదే విద్యాసంవత్సరంలో పంపిణీ చేయకపోవడంతో బడికొస్తా పథకం లక్ష్యం నీరుగారుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. 

నీరు గారుతున్న లక్ష్యం
జిల్లాలోని ప్రభుత్వ  పాఠశాలల్లో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు 2016లో ‘బడికొస్తా’  పథకం ప్రకటించింది. ప్రాథమికోన్నత విద్యతోనే బాలికలు బడి మానేయకుండా ఉన్నత విద్యను కూడా కొనసాగించాలనేది ఈ పథకం లక్ష్యం. అందులో భాగంగా పాఠశాల దూరమంటూ చదువుకు స్వస్తి చెప్పకుండా, బాలికలను ప్రోత్సహించి వారు హైస్కూల్లో చేరేందుకు  9వ తరగతిలో చేరే ప్రతి బాలికకు ఉచితంగా ప్రభుత్వమే సైకిల్‌ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించారు. దీంతో 2016–17 విద్యా సంవత్సరంలో జిల్లాలో 9వ తరగతిలో నమోదైన 16,841 మంది బాలికలకు సైకిళ్ల పంపిణీ చేయ్యాల్సి ఉంది. కానీ ఆ విద్యా సంవత్సరంలో సైకిళ్ల పంపిణీ ప్రారంభించ లేదు. 2017–18 సంవత్సరంలో వారంతా 10వ తరగతిలోకి చేరాక ఆ సైకిళ్లను అందించారు. దీంతో 9వ తరగతిలో అందించాలనే లక్ష్యం నీరుగారింది.

గతేడాది ‘బడికొస్తా’కు మంగళం
2017–18 విద్యా సంవత్సరంలో 2016–17కు సంబంధించిన సైకిళ్లను ఏడాది తర్వాత  అందించారు. దీంతో గత ఏడాది 9వ తరగతి చదివిన బాలికలకు నేటి వరకూ ఉచిత సైకిళ్లు అందించలేదు. కనీసం వారి వివరాలు కూడా నేటి వరకూ ఉన్నత అధికారులు సేకరించలేదు. దీంతో గత ఏడాది ‘బడికొస్తా’ పథకంలోని ఉచిత సైకిళ్లకు ప్రభుత్వం మంగళం పాడిందంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది తొమ్మిదితో పాటు 8వ తరగతి బాలికలకు కూడా ఉచితంగా సైకిళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రటించిన నేపథ్యంలో గత ఏడాది నైన్త్‌ విద్యార్థినుల పరిస్థితి ఏమిటని వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ పథకంలో ప్రభుత్వ, జెడ్పీ, పురపాలక,, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ సామాజకవర్గాల బాలికలకు సైకిళ్లు అందనున్నాయి.  

35,200 మందికి లబ్ధి
గతంలో జిల్లాలో 16,841 మందికి సైకిళ్లు మంజూరయ్యాయి. వీటి పంపిణీని ఆధార్‌తో అనుసంధానం చేసి బయోమెట్రిక్‌ హాజరు ద్వారా అందించాలని నిర్ణయించడంలో వివిధ కారణాలతో జిల్లాలో 2,122 సైకిళ్లు మిగిలిపోయాయి. ఇవి పాఠశాలల్లోనూ, ఎమ్మార్సీ భవనాల్లోనూ మూలకు చేరాయి. ప్రస్తుతం 8, 9 తరగతుల విద్యార్థినులు 35,200 మంది ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కొక్క సైకిల్‌ ధర రూ.3,680 గా టెండర్‌ ప్రక్రియ పూర్తయినట్టు మే నెలలో రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో సైకిళ్ల పంపిణీకి రూ.12.95 కోట్లు నిధులు ఖర్చు చేయనున్నారు.

గతేడాది అందని సైకిళ్లు
గత విద్యా సంత్సరంలో 9వ తరగతి విద్యార్థినిలకు ఉచిత సైకిళ్లు అందలేదు. 2016–17 విద్యాసంవత్సరంలో 9వతరగతి చదివిన వారికి టెన్త్‌లోకి వచ్చాక సైకిళ్లు అందాయి. మా పాఠశాలకు రవాణా సౌకర్యం లేని మందలపర్రు, గుణపర్రు తదితర గ్రామాల నుంచి విద్యార్ధినిలు పాఠశాలకు వస్తారు. వీరికి సైకిల్స్‌ ఇవ్వడం వల్ల బాలికల హాజరుశాతం మెరుగవుతుంది.– యర్రంశెట్టి శేషగిరి, హెచ్‌ఎం, నిడమర్రు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement