విజయనగరం కంటోన్మెంట్: బాహుబలి టిక్కెట్ల విషయంలో ప్రేక్షకుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. రూ.40, రూ 80 ఉండే టిక్కెట్ల ధరలను భారీగా పెంచి బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్లాక్ టిక్కెట్ల విక్రయానికి సంబంధించి జిల్లాలోని చాలా థియేటర్ల యజమానులు రింగయినట్టు చెబుతున్నారు. అందరూ ప్రత్యేక టిక్కెట్లను ముద్రించి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొన్ని థియేటర్ల యజమానులు తమ సిబ్బందితో ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్‌చేసుకుని, వాటిని బ్లాక్ చేస్తున్నారని పట్టణానికి చెందిన అభిమానులు కొందరు తెలిపారు.
మరోవైపు ప్రభుత్వాధికారులే ఎక్కువ సంఖ్యలో టిక్కెట్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో సుమారు 54 థియేటర్లుండగా బాహుబలి సినిమాను ఒకటిరెండు మినహా దాదాపు అన్ని థియేటర్లలోనూ ఇదే సినిమాను ప్రదర్శించేందుకు రంగం సిద్ధమయింది. జిల్లా కేంద్రంలో ఎనిమిది థియేటర్లు ఉండగా ఏడు థియేటర్లలో బాహుబలి సినిమానే వేస్తున్నారు. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురంతో పాటు ఎస్ కోట, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల వంటి చిన్న సెంటర్లలోనూ పలు థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కాగా సాలూరులో సినిమా థియేటర్ యజమానే స్వయంగా వచ్చి గ్రీవెన్స్‌సెల్‌లో అధిక రేట్లపై ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని సామాన్య ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బ్లాక్‌లోటిక్కెట్లు విక్రయిస్తే చర్యలు : జేసీ రామారావు
అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తే తగిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ బి రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. బాహుబలి చలన చిత్రాన్ని సినిమాటోగ్రఫీ నిబంధనల మేరకు రెగ్యులర్ సమయాలలోనే ప్రదర్శించాలని, అదనపు సీటింగ్ ఏర్పాటు చేయకూడదని పేర్కొన్నారు. ప్రేక్షకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని, బ్లాక్ మార్కెట్లో టిక్కెట్లు విక్రయించకుండా తగిన చర్యలు తీసుకోవాలని, సీటింగ్ పరిమితిని పర్యవేక్షించాలని, రెవెన్యూ, పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసినట్టు జేసీ తెలిపారు.
అంతా బ్లాక్!
Published Fri, Jul 10 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 5:11 AM
Advertisement
Advertisement