బలిమెలలో బయటపడిన అయిదు మృతదేహాలు
ముంచంగిపుట్టు: రంగబయలు పంచాయతీ కొసంపుట్టు సమీపంలో బలిమెల జలాశయం గెడ్డలో నాటుపడవ బోల్తా పడి మునిగిన అయిదుగురి మృతదేహాలు శుక్రవారం బయటపడ్డాయి. ఈ దుర్ఘటన బుధవారం జరగడం తెలిసిందే. మృతులంతా గిరిజన విద్యార్థినులే. ఇద్దరు మాత్రం తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. కొసంపుట్టుకు చెందిన ఏడుగురు విద్యార్థినులు బుధవారం నాటుపడవపై కొసంపుట్టు నుంచి మల్కన్‌గిరి జిల్లా కాల్‌గూడ గ్రామానికి వెళ్తున్నారు. మధ్యలో పడవకు రంధ్రం ఏర్పడి నీరు చేరడంతో మునిగిపోయింది. ఇందులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్లు నాయకం జానకి (15), నాయికం కాంతమ్మ(13)లతో పాటు జనభ. కొండమ్మ(12), ముందిలి జోగతి(10), ముందిలి లక్ష్మి(13) మృతి చెందారు. ఎం.రామ్‌నాథ్, ఎం.సురేంద్ర ప్రాణాలతో బయటపడ్డారు. శుక్రవారం మృతదేహలను గ్రామస్తులే వెలికి తీశారు.
అధికారులెవరూ రాకపోవడంతోమృతదేహాలను వీఆర్వో కె.కోటిబాబు, సర్పంచ్ జి.శ్రీను సమక్షంలో గెడ్డ వద్దే ఖననం చేశారు. జీపీఏస్ పాఠశాలలో రెండేళ్లుగా ఉపాధ్యాయుల్లేక మూతపడటంతో విద్యార్థులు చదువు కోసం దూరప్రాంతానికి వెళ్లాల్సి రావడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలను వైఎస్సార్ సీపీ నేతలు పాంగి పాండురంగస్వామి, కె.గాసిరావు, ఎస్.రుక్మాంగధర్, ఆర్.గణపతి పరామర్శించారు. పాండురంగ స్వామి మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు.