ఆంధ్ర వాటా 56 టీఎంసీలు
ఒడిశాకు 39 టీఎంసీలు
బలిమెల నీటి వినియోగంపై అధికారుల సమావేశం
సీలేరు : ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలకు నీరందించే బలిమెల రిజర్వాయర్‌లో ఏపీ వాటాగా 56 టీఎంసీలు నీరు ఉందని ఏపీ జెన్‌కో (మోతుగూడెం) ఇన్‌చార్జి సీఈ నాగభూషణరావు తెలిపారు. బలిమెల రిజ ర్వాయర్ నీటి వినియోగంపై బుధవారం బలిమెలలో సమీక్షించారు. అనంతరం సీలేరు ఏపీ జెన్‌కో గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బలిమెల జలాశయంలో మొత్తం 95 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. ఇందులో ఒడిశాకు 39, ఆంధ్రకు 56 టీఎంసీలు కాగా, ఇప్పటికే 16 టీఎంసీలు ఒడిశా అదనంగా వాడుకుందన్నారు. విద్యుత్ ఉత్పత్తి అనంతరం గోదావరి డెల్టాకు నీటిని పంపడంతో ఒడిశాతోపాటు సమానంగా ఆంధ్ర నీటిని వాడుకోవలసి ఉందని, ఈమేరకు బలిమెలలో ఉన్న నీటిని ఆంధ్రకు తెచ్చుకునేందుకు నిర్ణయించామన్నారు.
ప్రస్తుతం ఉన్న నీటితో రానున్న వేసవిలో విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని, మాచ్‌ఖండ్, సీలేరు, మోతూగుడెం, డొంకరాయి జలాశయాల్లో ఉన్న నీటితో విద్యుత్ ఉత్పత్తికి ఎటువంటి ఢోకా లేదని తెలిపారు. సమావేశంలో ఒడిశా హైడ్రోపవర్ కార్పొరేషన్, ఒడిశా నీటి వనరుల విభాగం అధికారులతోపాటు ఏపీజెన్‌కో ఎస్‌ఈ మురళీ మోహన్, ఈఈ ఈఎల్ రమేష్, జలవిద్యుత్ కేంద్రం డీఈ సుధాకర్, ఏడీలు చలపతిరావు, భీమశంకరం పాల్గొన్నారు.