'బలిమెల'లో మృతదేహం కలకలం
విశాఖపట్నం: ఏవోబీలోని బలిమెల రిజర్వాయర్ లో బయటపడిన మృతదేహం కలకలం రేపింది. తొలుత ఈ మృతదేహం ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుది అయి ఉంటుందని భావించారు. దాంతో దీనిపై పెద్ద ఎత్తున కలకలం రేగింది. దానికి తోడు అక్కడకు సమీపంలో మరో రెండు మృతదేహాలు ఉన్నాయని కూడా అన్నారు. స్థానికులు ఈ మృతదేహాలను గమనించి, మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. అయితే.. బలిమెల రిజర్వాయర్‌లో కనిపించిన మృతదేహం.. చింతల్‌పాంగీ గ్రామానికి చెందిన వ్యక్తిదని గుర్తించారు. కుటుంబ కలహాలతో వారం రోజుల క్రితం రిజర్వాయర్‌లో దూకినట్లు స్థానికులు తెలిపారు. దాంతో దీనిపై చెలరేగిన ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పడింది.
ఎన్ కౌంటర్ జరిగినప్పటి నుంచి మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) ఆచూకీ లేకపోవడంతో ఇప్పుడు బయటపడిన మృతదేహం ఆయనదా అనే సందేహాలు సైతం ఒక దశలో వ్యక్తమయ్యాయి. ఎన్‌కౌంటర్‌లో ఆర్కే మరణించారా.. తప్పించుకున్నారా, పోలీసులు నిర్బంధించారా అనేది మిస్టరీ మారిన నేపథ్యంలో ఈ మృతదేహం తీవ్ర ఉత్కంఠ రేపింది. అయితే.. చివరకు అది స్థానికుడిదేనని తేలడంతో చిక్కుముడి వీడింది.