సాక్షి, కడప : వెనుకబడిన రాయలసీమను రతనాల సీమగా మార్చాలంటే.. సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని గురువారం తలపెట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. అన్నిచోట్ల పాఠశాలలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించి మద్దతు ప్రకటించాయి. జిల్లాలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద కూడా ప్రత్యేక బలగాలను మోహరించారు.
అంబులెన్స్‌లతో భారీ ర్యాలీ :
రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ కడపలో రాయలసీమ రాజధాని సమితి ఆధ్వర్యంలో అంబులెన్స్‌ల అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాజధానికి అనువైన ప్రాంతమైన కర్నూలును ప్రభుత్వం గుర్తించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మద్దతు
కడపలో బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కడప కార్పొరేటర్లు రామలక్ష్మణ్‌రెడ్డి, కె.బాబు, జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ పులి సునీల్‌కుమార్, మాజీ కార్పొరేటర్ బాబు ప్రత్యక్ష ఆందోళనలలో పాల్గొనడంతోపాటు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అనంతరం ఆందోళనకారులతో కలిసి వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రాజంపేటలో విధులు
బహిష్కరించిన న్యాయవాదులు
బంద్ నేపథ్యంలో రాజంపేటలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శరత్‌కుమార్‌రాజు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి మద్దతు ప్రకటించారు. అంతేకాకుండా ఆందోళనకారులతో కలిసి వాహనాలను అడ్డుకున్నారు. పలుచోట్ల పాఠశాలలను మూయించారు.
పలుచోట్ల పాక్షికంగా బంద్
జిల్లాలోని రాయచోటి, రైల్వేకోడూరు, పులి వెందుల, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాలలో బంద్ పాక్షికంగా జరిగింది. రాయచోటిలో మధ్యాహ్నం వరకు బస్సులు తిరగకుండా ఆందోళనకారులు అడ్డుకున్నారు. కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు కూడా పాఠశాలలను మూసివేయించారు. పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు తదితర ప్రాంతాలలో ఉదయం 10గంటలనుంచే వాహనాలు యథావిధిగా తిరగడంతో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు.
బంద్ ప్రశాంతం
Published Fri, Sep 5 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 PM
Advertisement
Advertisement