ఏమిటీ దారుణం | Bandh sucessfully in kurnool district | Sakshi
Sakshi News home page

ఏమిటీ దారుణం

Published Sat, Feb 15 2014 2:06 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

Bandh sucessfully in kurnool district

సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరు సాగిస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కై విభజన బిల్లును రాష్ట్రం దాటించినా.. పార్లమెంట్‌లో బిల్లును అడ్డుకునేందుకు ప్రజా మద్దతు కూడగడుతోంది. సమైక్య గళం ఢిల్లీకి వినిపిస్తోంది. గురువారం పార్లమెంట్‌లో ఎంపీల బహిష్కరణను నిరసిస్తూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఉద్యోగ.. ఉపాధ్యాయ.. న్యాయవాద సంఘాలతో పాటు వైఎస్‌ఆర్ విద్యార్థి సంఘం కదంతొక్కాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడగా.. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. విభజనకు వ్యతిరేకంగా విద్యార్థుల నినాదాలు హోరెత్తాయి.
 
 సాక్షి, కర్నూలు: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ చేపట్టిన బంద్ విజయవంతమైంది. వైఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్ నగర కన్వీనర్ టి. అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సా ర్సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ నుంచి ర్యాలీగా బయలు దేరి కొండారెడ్డి బురుజు సర్కిల్ మీదుగా రాజ్‌విహార్ సెంటర్‌కు చేరుకుని రెండు గంటల పాటు అక్కడ రాస్తారోకో జరిపారు. దీంతో నలువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. నారాయణ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున రాస్తారోకోలో పాల్గొని సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.
 
 అలాగే న్యాయవాదులు సోనియా దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. రాజ్‌విహార్ సర్కిల్‌లో  దిష్టిబొమ్మను దహనం చేశారు.  డోన్: పార్టీ కార్యాలయం నుంచి జాతీయ రహదారి వరకు వాహనాలలో ర్యాలీగా బయల్దేరి అనంతరం ఐటీఐ కళాశాల వద్ద  జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన రాస్తారోకోతో వాహనాలు బారులు తీరాయి. మండలంలోని చిన్నమల్కాపురం గ్రామంలో.. ప్యాపిలి పట్టణంలో వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించి బంద్ నిర్వహించారు.
 
 కోవెలకుంట్ల :
 వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కర్రా హర్షవర్ధన్‌రెడ్డి, మండల క న్వీనర్ గాండ్ల పుల్లయ్య నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తెల్లవారుజామున ఉదయం 5 గంటలకే ఆర్టీసీ డిపోకే చేరుకుని బస్సుల రాకపోకలు అడ్డుకున్నారు. డిపోలోని 62 బస్సులు డిపోకే పరిమితం అయ్యాయి. పట్టణంలో వ్యాపారసంస్థలు, దుకాణాలు మూసివేసి బంద్ కు సహకరించాలని కోరారు. బస్టాండ్ నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా నిర్వహించారు.
 
 బనగానపల్లె : వైఎస్‌ఆర్‌సీపీ మైనార్టీనాయకుడు ఫిదాహుస్సేన్ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలను మూసివేయించారు. నియోజకరవ్గ సమన్వయకర్త ఎర్రబోతుల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో కొలి మిగుండ్లలో ధర్నా నిర్వహించారు.
 
 సమైక్యమే ఎజెండా కావాలి
 నంద్యాల, న్యూస్‌లైన్: సమైక్యరాష్ట్ర పరిరక్షణే అన్ని పార్టీల ఎజెండా కావాలని వైఎస్సార్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమానాగిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నంద్యాల పట్టణంలో విలేకరులతో మాట్లాడారు. సీమాంధ్రకు చెందిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు మూకుమ్మడిగా పోరాడితే తప్ప రాష్ట్రం సమైక్యంగా ఉండబోదని భూమా అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన వ్యవహారం చివరి అంకానికి చేరుకుందని, రాజకీయాలకు అతీతంగా పోరాటం జరపాలని కోరారు. అన్ని పార్టీలు సమైక్యమే ఎజెండాగా కొనసాగాలన్నారు.
 
 సమైక్యాంధ్ర కోరితే ఏ జిల్లాలను ఏ ప్రాంతంలో కలిపే అవకాశం లేకుండా పోతుందన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రతిపాదన తెస్తే ఉద్యమం నీరుగారిపోయే ప్రమాదం ఉందని తెలిపారు. సమైక్యాంధ్ర ప్రతిపాదన తప్ప మరొక ప్రతిపాదన ఉండవద్దని పరోక్షంగా కేంద్ర మంత్రి కావురి సాంబశివరావుకు సలహా ఇచ్చారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు ఆడిన నాటకంతోనే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఆ రెండు పార్టీలు ఇప్పటికీ తమ వైఖరి మార్చుకోవడం లేదన్నారు.
 
 టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇప్పటికీ సమన్యాయం అంటూ ఇరు ప్రాంతాలకు చెందిన ఎంపీలతో డ్రామాలు ఆడిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం కూడా ఏకపక్షంగా వ్యవహరించకూడదన్నారు. లోకసభకు ఉన్న మర్యాదను, గౌరవాన్ని మంట కలిపిన ఘనత యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి దక్కిందన్నారు. రాష్ట్రంలో రెండు మూడు సంవత్సరాల నుంచి ప్రశాంత పరిస్థితులు లేకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు. రాష్ట్ర శ్రేయస్సునే లక్ష్యంగా చేసుకొని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోతూ పోరాటం చేస్తున్నారన్నారు. సమైక్య రాష్ట్రం కోసం చిత్తశుద్ధిగా పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనేనన్నారు.  
 
 కాంగ్రెస్, టీడీపీలదే విభజన పాపం
 కల్లూరు, న్యూస్‌లైన్: విభజన పాపం కాంగ్రెస్, టీడీపీలదేనని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రెండో రోజు బంద్ విజయవంతమైంది. వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు గుత్తిరోడ్డులోని ఫ్లైఓవర్ వద్దకు చేరుకుని 44వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ నిరసనలో గౌరుదంపతులు పొల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో చడీచప్పుడు కాకుండా 10 సెకండ్లలో టీ బిల్లును ప్రవేశపెట్టామని చెప్పడం కాంగ్రెస్ పార్టీ నాయకుల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
 
 ప్రతిపక్ష పార్టీ నేతలకు అర్థంకాని రీతిలో బిల్లు ప్రవేశపెట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. టీ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కూడా తెలుగుదేశం పార్టీ రెండు నాల్కల ధోరణి అవలంబించిందన్నారు. ఆ పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలను ఒకవైపు, సీమాంధ్ర ఎంపీలను మరోవైపు ఎగదోసేందుకే చంద్రబాబు నాయుడు.. ఢిల్లీలో మకాం వేశారన్నారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్‌ఆర్‌సీపీ అని గౌరు చరితారెడ్డి అన్నారు.
 
 విభజన ఆగిపోయేవరకు ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాలు చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కేవీసుబ్బారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కేవీ సుబ్బారెడ్డి, గౌరు యువసేన అధ్యక్షుడు ప్రసాద్, పార్టీ కల్లూరు అర్బన్ కన్వీనర్ పెరుగు పురుషోత్తంరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు తోట వెంకటకృష్ణారెడ్డి, బీసీ, యువజన, మహిళా విభాగాల కన్వీనర్లు పాతపాడు శ్రీనాథ్, జరపట అంజి, మంగమ్మ, మైనార్టీ నాయకుడు ఫిరోజ్, పార్టీ నాయకులు సంజన్న, మూర్తిరెడ్డి, గిడ్డయ్య, పుసులూరు పల్లె సుధాకరరెడ్డి, పర్ల దేవస్థానకమిటీ చైర్మన్ నాగభూషణం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement