ఇసుకే బంగారమాయనె! | Bangaramayane sand! | Sakshi
Sakshi News home page

ఇసుకే బంగారమాయనె!

Published Thu, Jan 29 2015 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

ఇసుకే బంగారమాయనె!

ఇసుకే బంగారమాయనె!

సాక్షి ప్రతినిధి, కర్నూలు : నూతన ఇసుక పాలసీతో ప్రజలకు ప్రభుత్వం చుక్కలు చూపెడుతోంది. రోజుకో కొత్త విధానంతో ఇసుకను మరింత ఖరీదుగా మారుస్తోంది. ఇసుక ఇక ముందు బంగారాన్ని తలపించనుంది. ఇప్పటికే రవాణా చార్జీలను మినహాయించి క్యూబిక్ మీటర్‌కు రూ. 500 చెల్లిస్తున్న వినియోగదారులు.. ఇక మీద వే బ్రిడ్జి బిల్లులను భరించాల్సి రావచ్చు. అంతేకాదు సొంత వాహనాల్లో ఇసుకను తరలించుకుపోతే సదరు వాహనానికి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను అమర్చుకోవాల్సి రావచ్చు.

ఈ భారాన్ని కూడా వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇసుక డిపోల నుంచే వినియోగదారులకు సరఫరా చేయాలన్న తాజా నిర్ణయంతో రీచ్‌ల నుంచి డిపోల వరకు అయ్యే రవాణా భారం కూడా వినియోగదారులే భరించాల్సి రావచ్చు. ఫలితంగా డిపోల వద్ద క్యూబిక్ మీటరు ఇసుక ధర రూ. 650 నుంచి రూ. 800 వరకు చెల్లించాల్సి రావచ్చు. మొత్తం మీద నూతన ఇసుక పాలసీతో ప్రభుత్వం కాస్తా.. ఇసుకను బంగారంగా మార్చివేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
ప్రతీ లోడుకూ వే బిల్లు ఉండాల్సిందే...!
నూతన ఇసుక పాలసీలో భాగంగా ప్రస్తుతం స్వయం సహాయక మహిళా సంఘాలు (ఎస్‌హెచ్‌జీ)ల ద్వారా ఇసుక వ్యాపారం నిర్వహిస్తున్నారు. రీచ్‌ల వద్ద ఎస్‌హెచ్‌జీలకు చెందిన వ్యక్తులు ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చిన ఆర్డర్ల మేరకు జేసీబీల ద్వారా ఇసుకను లారీల్లో కానీ ట్రాక్టర్లల్లో కానీ నింపుతున్నారు. అయితే, కచ్చితంగా ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక (ఒక క్యూబిక్ మీటరు ఇసుక 1.68 టన్నులకు సమానం) లారీలో ఉందనే విషయం తేల్చిచెప్పడం కష్టం. సూచాయిగా జేసీబీల ద్వారా నింపి పంపుతున్నారు.

దీనితో కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. కొద్ది మందికి ఎక్కువ, మరి కొద్ది మందికి తక్కువ ఇసుక వస్తుందనే విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా ఇసుక తరలింపులో వినియోగదారులు పోలీసుల నుంచి రవాణాశాఖ సిబ్బంది నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వే బిల్లులు లేవంటూ రవాణాకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. వీరికి మాముళ్లు ఇస్తేనే కానీ బండిని ముందుకు కదలనివ్వడం లేదన్న ఆరోపణలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఇసుకను తీసుకెళ్లాలనుకున్న వినియోగదారులు ముందుగా లారీని వే బ్రిడ్జి వద్ద తూకం వేయించుకుని.. ఇసుక నింపుకున్న తర్వాత మళ్లీ వే బ్రిడ్జి వద్ద తూకం వేయించుకుని.. రెండు బిల్లులను రీచ్‌ను నిర్వహిస్తున్న వారికి సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు అయ్యే వ్యయాన్ని వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇసుక ధర పెరిగిందని బాధపడుతున్న వినియోగదారులకు ఇది గోరుచుట్టపై రోకటిపోటుగా పరిణమించనుంది.
 
ఇక మీదట సొంత వాహనాల్లోనే...!
ప్రభుత్వం గుర్తించిన వాహనాల్లోనే ఇసుకను తరలించాలన్న ప్రభుత్వం.. ఇక మీదట సొంత వాహనాల్లో తరలించుకుపోయేందుకు అనుమతినిచ్చింది. అయితే... సదరు సొంత వాహనదారులు ఆ వాహనానికి జీపీఎస్‌ను అమర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అయ్యే సుమారు రూ. 10 వేల మొత్తాన్ని వారే భరించాల్సి రానుంది. అంటే అటు వే బ్రిడ్జి బిల్లుతో పాటు జీపీఎస్ బిల్లు కూడా వినియోగదారుల జేబును గుల్ల చేయనుందన్నమాట.
 
కొత్తగా 5 ఇసుక డిపోలు
ప్రస్తుతం నేరుగా రీచ్‌ల నుంచి ఇసుకను సరఫరా చేస్తున్నారు. రీచ్‌ల వద్ద సరిగా ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఇసుక రవాణాకు సమస్యలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఇసుక రవాణాకు అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఇసుక డిపోలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా కర్నూలుతో పాటు నంద్యాల, ఆత్మకూరు, ఆదోని, డోన్ ప్రాంతాలో ఇసుక డిపోలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సుమారు 3-4 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ డిపోల్లో ప్రాథమికంగా 30 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను నిల్వ చేయాలని నిర్ణయించారు.

రీచ్‌ల నుంచి ప్రభుత్వమే ఇసుకను ఈ డిపోల వద్దకు తరలించనుంది. ఈ డిపోల నుంచే నేరుగా వినియోగదారులు ఇసుకను తరలించుకుపోవాల్సి ఉం టుంది. రీచ్‌ల నుంచి ఇసుక రవాణాను ఇక మీదట పూర్తిగా నిలిపివేయనున్నారు. అయితే... రీచ్‌ల నుం చి డిపోల వరకు ఇసుకను తరలించేందుకు అయ్యే వ్యయాన్ని కూడా వినియోగదారులే భరించాల్సి ఉంటుంది. ఫలితంగా డిపోల వద్ద ఇక మీదట నుంచి క్యూబిక్ మీటరు ఇసుక ధర ప్రాంతాన్ని బట్టి రూ. 650 నుంచి రూ. 800 వరకూ ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద అటు వే బ్రిడ్జి బిల్లులు, ఇటు జీపీఎస్ పోటుతో పాటు రీచ్ నుంచి డిపో వరకు తరలించేందుకు అయ్యే రవాణా భారంతో వినియోగదారుడికి మరింత భారంగా మారనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement