
బంగ్లా నౌకలకు స్వాగతం పలుకుతున్న ఈఎన్‌సీ నేవీ సిబ్బంది
సాక్షి విశాఖపట్నం : ద్వైపాక్షిక విన్యాసాల్లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ యుద్ధ నౌకలు విశాఖ చేరుకున్నాయి. తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రానికి చేరుకున్న బంగ్లా నౌకలు బీఎన్‌ఎస్ అలీ హైదర్, బీఎన్‌ఎస్ షాడినోటాలకు భారత నౌకాదళ బృందం ఘన స్వాగతం పలికింది. అనంతరం విశాఖ సాగర జలాల్లో ఇరుదేశాల నౌకలు ప్రదర్శించిన విన్యాసాలు అలరించాయి. ఇండియా– బంగ్లాదేశ్ సమన్వయ గస్తీ (కార్పాట్) విన్యాసాల్లో భాగంగా తొలుత బంగ్లాదేశ్ సాగర జలాల్లో భారత నౌకలు విన్యాసాలు చేశాయి. ఈ నెల 16 వరకు విశాఖలో రెండో విడత విన్యాసాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఐఎన్‌ఎస్ రణ్‌విజయ్, ఐఎన్‌ఎస్ ఖతర్‌తో కలిసి సాగర జలాల్లో విన్యాసాలు నిర్వహించారు. రెండు దేశాల మధ్య వృత్తిపరమైన సహకారం, గస్తీ కార్యకలాపాల్లో సమన్వయం, నౌకాదళ శిక్షణ, నిర్వహణ వ్యవహారాల్లో భాగస్వామ్యం మెరుగు పడేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు చేపట్టినట్లు ఇరు దేశాల నౌకాదళాధికారులు తెలిపారు.