- జిల్లా ఖజానా అధికారి కేడీవీఎం ప్రసాద్‌బాబు
విజయవాడ : బ్యాంక్ ఖాతాల వివరాలను అందించని ఉద్యోగుల జీతభత్యాలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి నిలిపివేస్తామని జిల్లా ఖజానా అధికారి కేడీవీఎం ప్రసాద్‌బాబు తెలిపారు. ‘ఆన్‌లైన్ ఇ-పేమెంట్ విధానం’పై విజయవాడ పశ్చిమ డివిజనల్ ట్రెజరీకి చెందిన అధికారులు, సిబ్బందితో ఆయన శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌బాబు మాట్లాడుతూ ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఖజానా కార్యాలయం ద్వారా చెల్లించే అన్నింటినీ ఆన్‌లైన్‌లో ఇ-పేమెంట్ ద్వారానే చేపట్టాలని సూచించారు.
ఈ విధానాన్ని మొదటిసారిగా కృష్ణాజిల్లాలో విజయవాడ, నూజివీడు డివిజన్ల పరిధిలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఖజానా కార్యాలయం ద్వారా జీతభత్యాలు చెల్లించే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలను సేకరించాలని ఆదేశించారు. జిల్లా ఖజానా సంచాలకులు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన డ్రాయింగ్ అధికారులుap.treasury.gov.inలో లాగిన్ అయ్యి తమ బిల్లులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.
జూలై నెల జీతాల బిల్లులను ప్రభుత్వ అధికారులు సమర్పించే సమయంలోనే ప్రతి ఉద్యోగి తమ బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ, బ్యాంక్ పేరు, ఎకౌంట్ నంబర్, ఉద్యోగి పేరు, బ్యాంక్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలుంటే జిల్లా ఖజానాధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో ఉప ఖజానాధికారులు బి.మోహన్‌రావు, బి.రాణి, డి.ఉమామహేశ్వరి, బి.వసంత, సిబ్బంది బి.ఆనంద్, నరసింహారావు, కె.మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.