prasad babu
-
ఉన్నతాధికారి నివాసంలో ఏసీబీ సోదాలు
సాక్షి, అమరావతి/కైకలూరు: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ (ఏపీఎస్డబ్ల్యూఆర్ఐఎస్) జాయింట్ సెక్రటరీ కె.డి.వి.ఎం.ప్రసాద్‌బాబు నివాసం, కార్యాలయాల్లో, కైకలూరు మండలం గుమ్మళ్లపాడులోని ఆయన బావ అందుగుల రూబెన్ ఇంట్లోను బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఆయన ఆదాయానికిమించి భారీగా ఆస్తులు సంపాదించినట్లు గుర్తించారు. 1991లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ఆయన తరువాత హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, సీఐగా పదోన్నతులు పొందారు. 2007లో గ్రూప్–1 అధికారిగా ఎంపికైన ఆయన ఖజానా శాఖలో ఏటీవోగా చేరారు. కృష్ణా జిల్లా డీఆర్డీఏ పీవోగా, ఖజానా శాఖ విజయవాడ డివిజనల్ అధికారిగా, కృష్ణాజిల్లా ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ అధికారిగా పనిచేశారు. ఆయన నివాసంలో నిర్వహించిన సోదాల్లో ఏసీబీ అధికారులు భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. ఏలూరులో రెండు ప్లాట్లు, విజయవాడ పోరంకిలో రెండు ప్లాట్లు, ఏలూరులోని మాదేపల్లిలో ఆర్సీసీ ఇల్లు, ఒక భవనం, హైదరాబాద్ భూదాన్ పోచంపల్లిలో జి+2 భవనం, పామర్రులో ప్లాట్, దెందులూరులో వ్యవసాయ భూమి, మూడు ఫోర్ వీలర్లు, రెండు టూ వీలర్ వాహనాలు, 500 గ్రాముల బంగారం, ఎల్ఐసీ పాలసీలు, మౌనిక ఆక్వా ఫామ్స్‌లో రూ.కోటి పెట్టుబడి, ఇతర వ్యక్తుల నుంచి రూ.26 లక్షల ప్రామిసరీ నోట్లు కలిగి ఉన్నట్టు గుర్తించారు. బుధవారం రాత్రి వరకు సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రసాద్ భార్య స్వగ్రామం గుమ్మళ్లపాడు కావడంతో అక్కడ తనిఖీలు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీకి చిక్కిన ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రకాశం జిల్లాలో నిందితుల పేర్లను తొలగించడానికి కొనకనమిట్ల ఎస్ఐ కె.దీపిక తరఫున రూ.45వేలు లంచం తీసుకుంటూ కానిస్టేబుల్ పి.నర్సింహరావు ఏసీబీకి చిక్కారు. హెచ్.ఎం.పాడు మండలం రాజగారిపల్లెకు చెందిన ఎ. నరసింహ, అతడి కుటుంబసభ్యుల పేర్లను 498 (అ) కేసులో ముద్దాయిలుగా పోలీసులు పేర్కొన్నారు. వారిపేర్లను ముద్దాయిల జాబితా నుంచి తొలగించేందుకు ఎస్ఐ కె.దీపిక రూ.60 వేలు డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అనంతరం ఎస్ఐ దీపిక ఆదేశాల మేరకు బాధితుల నుంచి రూ.45 వేలు లంచం తీసుకుంటున్న కానిస్టేబుల్ కె.నరసింహరావును ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నమోదు చేశారు. నిందితులు ఎస్ఐ దీపిక, కానిస్టేబుల్ నర్సింహరావును ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు. -
వ్యవసాయ రంగంలో నూతన అధ్యాయం
కర్నూలు (అగ్రికల్చర్): ‘వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రైతు భరోసా కేంద్రాలు దేశానికే రోల్ మోడల్‌గా మారనున్నాయి. గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఏర్పాటు కావటం.. ఇందులోనే వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు, అన్నిరకాల సేవలు అందుతుండటం విశేషం. ఏ అవసరమొచ్చినా రైతులు పట్టణాలకు పరుగులు తీయాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్య లేద’ని కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త జి.ప్రసాద్‌బాబు స్పష్టం చేశారు. ఆర్బీకేల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సోమవారం ఆయన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి, వర్కూరు గ్రామాల్లోని నాలుగు రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. అనంతరం తాను పరిశీలించిన అంశాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. అంతలోనే.. ఇంత మార్పా! ► నేను వెళ్లే సమయానికి మండల వ్యవసాయాధికారి అక్బర్‌బాషా, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు అక్కడే ఉండి రైతులకు సేవలందించటాన్ని గమనించాను. ► అక్కడ రైతులు కూర్చోడానికి కుర్చీలున్నాయి. ర్యాక్‌లు వచ్చాయి. వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంచే పుస్తకాలు కూడా కనిపించాయి. ► నేను వెళ్లిన ఆర్బీకేల్లో డిజిటల్ కియోస్క్‌లు, ఎల్ఈడీ టీవీలు, ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన కషాయాల తయారీ స్టవ్, కుక్కర్లను చూశా. ► వ్యవసాయ శాఖలో ఇంత మార్పును చూసి ఆశ్చర్యపోయా. రైతు గ్రామం విడిచి బయటకు రావాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందనే నమ్మకం కలిగింది. ► ఇక్కడే ఈ–కర్షక్ యాప్‌లో పంటలను నమోదు చేసి.. ఉచిత పంటల బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నారు. ► రైతులు తమకు కావాల్సిన వాటిని డిజిటల్ కియోస్క్ ద్వారా ఎంపిక చేసుకోవడం చూసి ఆశ్చర్యం వేసింది. ► ప్యాలకుర్తి, వర్కూరు గ్రామాల్లో ఎరువుల కోసం కియోస్క్ ద్వారా అక్కడి రైతులు ఆర్డర్ పెట్టడాన్ని గమనించాను. వారి ఆర్డర్ విజయవంతమైనట్లు వెంటనే వారి సెల్‌కు మెసేజ్ వచ్చింది. ► ఏ కంపెనీ ఎరువు లేదా పురుగు మందు కావాలన్నా ఎంపిక చేసుకునే సదుపాయం ఉంది. భూసార పరీక్షలూ ఇక్కడే.. ► గతంలో భూసార పరీక్షలు ప్రహసనంలా ఉండేవి. మట్టి నమూనాలు ఇస్తే.. వాటిని ఎప్పుడు పరీక్ష చేస్తారో తెలిసేది కాదు. పంటలు పూర్తయ్యే తరుణంలో ఫలితాలు ఇచ్చేవారు. ► ఆర్బీకేల వల్ల ఈ సమస్య తీరిపోయింది. దాదాపు రూ.80 వేల విలువైన మట్టి పరీక్షల ప్రత్యేక కిట్లను ప్రభుత్వం ఆర్బీకేలకు సమకూర్చింది. ► దీనివల్ల రైతులు ఎటువంటి జాప్యం లేకుండా పరీక్షలు చేయించుకుని వెంటనే ఫలితాలను పొందే అవకాశం కలిగింది. ► రైతు భరోసా కేంద్రాల్లో బీటీ పత్తి రకాలతో పాటు కొర్ర, కందులు, వేరుశనగ, కూరగాయ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. ► వాటి నాణ్యతను కూడా పరిశీలించాను. మంచి కంపెనీలకు చెందిన బ్రాండెడ్ విత్తనాలే ఉన్నాయి. కియోస్క్ ద్వారా ఎరువులు బుక్ చేశా గతంలో ప్రతి చిన్న అవసరానికీ కోడుమూరు లేదా కర్నూలుకు పోవాల్సి వచ్చేది. ఈ సారి వేరుశనగ విత్తనాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్బీకేలోనే పొందా. డిజిటల్ కియోస్క్ ద్వారా యూరియా, ఇతర ఎరువులను బుక్ చేశా. రైతులకు వ్యయ ప్రయాసలు లేవు. సమయం ఆదా అవుతోంది. – సీతారాముడు, ప్యాలకుర్తి, కోడుమూరు మండలం అవగాహన పెంచుకుంటున్నాం రైతు భరోసా కేంద్రాల్లో పంటల గురించి ముందుగానే టీవీల్లో నిపుణులు ప్రాక్టికల్‌గా ఇచ్చే సూచనల వల్ల అవగాహన పెంచుకుంటున్నాం. మిరప సాగు పద్ధతులు, విత్తనాల ఎంపిక వంటి విషయాలను టీవీ ద్వారా తెలుసుకున్నాను. గ్రామంలోనే సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పొందా. ఎరువులు, పురుగు మందుల కోసం ఆర్డర్ ఇచ్చి డబ్బు చెల్లిస్తే మరుసటి రోజునే సరఫరా చేస్తున్నారు. – చిన్నరాముడు, ప్యాలకుర్తి, కోడుమూరు మండలం -
సుగవాసికి మళ్లీ నిరాశే
వైఎస్ఆర్ జిల్లా, రాయచోటి : రాయచోటి అసెంబ్లీ టిక్కెట్‌పై సుగవాసి ప్రసాద్‌బాబుకు తమ పార్టీ అధినేత నుంచి సానుకూలత లభించలేదు. టీటీడీ బోర్డు సభ్యుని పదవి వద్దు.. అసెంబ్లీ టిక్కెట్ కావాలంటూ మంగళవారం ప్రసాద్‌బాబు తన తండ్రి రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఎస్.పాలకొండ్రాయుడును వెంటబెట్టుకుని ముఖ్యమంత్రిని కలిశారు. ముందుగా టీటీడీ పదవిని తీసుకుని దేవుని ఆశీస్సులు పొందాలని చంద్రబాబు సలహా ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో సీనియర్ నాయకునిగా.. ముఖ్యమంత్రితో సమకాలికుడిగా పేరున్న సుగువాసి ప్రయత్నం ఫలితాన్ని రాబట్టలేకపోయింది. రాయచోటి అసెంబ్లీ టీడీపీ టిక్కెట్‌ను లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు తనయుడు ప్రసాద్‌బాబు ఆశిస్తున్నారు. ఇదే విషయంపై పాలకొండ్రాయుడు పలుమార్లు సీఎంను కలిశారు కూడా. అయితే అనూహ్యంగా ప్రసాద్‌బాబును టీటీడీ బోర్డు మెంబరుగా ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అసెంబ్లీ టిక్కెట్టు కాకుండా రెండు, మూడు నెలల్లో ముగిసే బోర్డు మెంబరుగా ఎంపిక చేయడం సుగవాసి అనుయాయులు, అభిమానుల్లో ఆగ్రహాన్ని తెచ్చి పెట్టింది. అభిమానుల ఆగ్రహాలను పసిగట్టిన ప్రసాద్‌బాబు తనకు టీటీడీ పదవి వద్దని ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. మంగళవారం తండ్రితో కలిసి విజయవాడలోని ముఖ్యమంత్రికి విషయాన్ని తెలియపరిచారు. తన కుమారునికి టిక్కెట్టును కేటాయిస్తే తప్పక గెలపించుకుని వస్తానని చెప్పినట్లు సమాచారం. వీరి మాటలపై స్పందించిన సీఎం టీటీడీ పదవిని ఎవ్వరో చెబితే ఇవ్వలేదన్నారు. ప్రసాద్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే బోర్డు మెంబరుగా ఎంపిక చేశానన్నారు. రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక రాజంపేట పార్లమెంటు అభ్యర్థి ఎంపికతో ముడిపడి ఉందని సూచించినట్లు తెలిసింది. ఈనెల చివరిలో మీతో సంప్రదించిన తర్వాతనే రాయచోటి అభ్యర్థిని ప్రకటిస్తానని చెప్పి పంపినట్లు సుగువాసి వర్గీయుల సమాచారం. -
వాడుకో.. వదిలేయ్!
ముఖ్యమంత్రి చంద్రబాబు ‘వాడుకో.. వదిలేయ్’ సూత్రాన్ని మరోమారు అమలు పర్చారు. రాయచోటి టీడీపీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న సుగవాసి ప్రసాద్‌బాబును బైపాస్ చేశారు. మూడునెలల హోదా టీటీడీ సభ్యుడి పదవి కట్టబెట్టి.. కరివేపాకు అస్త్రం సంధించారు. తన సమకాలికుడైన మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు కుటుంబం పట్ల కంటితుడుపు చర్యలకు పాల్పడ్డారు. చాణక్యం ప్రదర్శించి మరో దగాకు తెరలేపారని రాయుడు అనుచరులు వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి కడప: ‘ఏరు దాటేంతవరకూ ఏటి మల్లన్న, ఏరుదాటాక బోడి మల్లన్న’ అన్నరీతిలో టీడీపీ వ్యవహరిస్తోంది. అందుకు అనేక ఉదాహరణలు ప్రస్ఫుటం అయ్యాయి. ఎన్నికల్లో వాడుకొని వదిలేయడంలో తనను మించిన దిట్ట మరొకరు లేరని అనేక పర్యాయాలు ఆచరణలో ఆ పార్టీ నిరూపించింది. బద్వేల్లో ఎన్డి.విజయజ్యోతి, రైల్వేకోడూరులో ఓబిలి సుబ్బరామయ్య, కడపలో దుర్గాప్రసాద్, రాజంపేటలో మాజీ మంత్రి బ్రహ్మయ్య ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది తెరపైకి రానున్నారు. ఎన్నికల్లో వాడుకోవడం వదిలేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును మించిన నాయకుడు లేరని విశ్లేషకులు సైతం వివరిస్తున్నారు. రాయుడు కుటుంబానికి భంగపాటు.. రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుటుంబం మరోమారు భంగపాటుకు గురైంది. చంద్రబాబుకు రాజకీయ సమకాలికుడైన పాలకొండ్రాయుడుకు ఎంపీగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఈమారు తన కుమారుడు ప్రసాద్‌బాబుకు రాయచోటి టికెట్ కట్టబెట్టాలని పలుమార్లు కోరారు. అదేవిషయాన్ని టీడీపీ అ«ధిష్టానానికి స్పష్టం చేశారు. కాగా టికెట్ రేసులో ఉన్న ప్రసాద్‌బాబును తప్పించేందుకు టీడీపీ బోర్డు మెంబర్ పదవి కట్టబెడుతూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం పట్టుమనిమూడు నెలలు గడువు మాత్రమే ఉంది. ఎన్నికల తర్వాత ‘రాజు ఎవరో.. రౌతు ఎవరో’ తెలియదు. మూడు నెలల పదవి అప్పగించి అభ్యర్థిత్వం రేసు నుంచి తప్పిస్తారనని రాయుడు వర్గీయులు మండిపడుతున్నారు. టీడీపీ కోసం నిబద్ధతతో ఉన్న మమ్ముల్ని కాదని, ఆర్ఆర్ సోదరులకు ప్రాధాన్యత ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ప్రసాద్‌బాబు ఇమేజ్ అధికంగా ఉన్నా తప్పిస్తారనని సీఎం చర్యలపై మండిపడుతున్నారు. రాయచోటిలో రాయు డు కుటుంబం మద్దతు లేకుండా టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని, ఈ వాస్తవాన్ని గ్రహించిన అధిష్టానం రాయుడు కుటుంబాన్ని వ్యూహాత్మకంగా తప్పిస్తున్నారని వారు వివరిస్తున్నారు. మరోవైపు టీడీపీలో బలిజలకు ప్రాధాన్యత లేదని బ్రోకర్లు పెత్తనం అధికమైందనీ, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కడపలో చేసిన ఆరోపణలు టీడీపీ చర్యలకు బలం చేకూరుస్తున్నాయి. వాడుకొని వదిలేయడంలో దిట్ట.. అవసరానికి వాడుకొని వదిలేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్టని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి, జయరాములుకు ఎర వేశారు. ఆమేరకు టీడీపీలో చేర్పించుకొని క్రియాశీలక రాజకీయాలల్లో ప్రధానంగా వాడుకున్నారు. ఎన్నికలు సమీపించే కొద్ది అభ్యర్థిత్వం వ్యవహారంలో మొండిచేయి ప్రదర్శిస్తున్నారు. మంత్రి ఆదికి టీడీపీ ఓడిపోయే ఎంపీ సీటు అయినా కట్టబెట్టనున్నారు. జయరాములకు ఎలాంటి భరోసా దక్కడం లేదని పలువురు వివరిస్తున్నారు. అవసరానికి ఎమ్మెల్యేలను వాడుకొని ఆపై విస్మరిస్తున్నారని, సీఎం ఎప్పుడు, ఎవర్నీ ఎలా వాడుకోవాలనే బాగా తెలిసిన వ్యక్తి అంటూ స్వయంగా ఆయా నేతలే అనుచరుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్సీపీ కంటిని అదే చేతితో పొడిచేందుకు పార్టీ ఫిరాయించిన మమ్మల్ని వాడుకొని ఎన్నికలు సమీపించే కొద్ది ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని వాపోతున్నట్లు తెలుస్తోంది. కాగా సీఎం చంద్రబాబు తన చాణక్యాన్ని తాజాగా సుగవాసీ ప్రసాద్‌బాబుపై ప్రదర్శించారని విశ్లేషకులు వివరిస్తున్నారు. -
ఏసీబీ చేతికి చిక్కిన సీటీవో
గుడివాడ: మరో అవినీతి చేప ఏసీబీ చేతికి చిక్కింది. లంచం తీసుకుంటుండగా ఓ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ ఏసీబీ అధికారులకు దొరికిన ఘటన గురువారం చోటు చేసుకుంది. గుడివాడ సీటీవో వీవీయస్ఎల్ ప్రసాదబాబు రూ. 25 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. గుడ్లవల్లెరు మండలం గౌతవరం గ్రామానికి చెందిన నక్క రవికుమార్కి చెందిన మిల్లు సరిగా నడవకపోవడంతో లైసెన్స్ రద్దు చేయాలని రెండు నెలల క్రితం ప్రసాదబాబును సంప్రదించాడు. అందుకు ప్రసాదబాబు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేనని రూ. 25 వేలు తీసుకొవాలని రవికుమార్ కోరాడు. అనంతరం ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం వల పన్నిన ఏసీబీ అధికారులు గురువారం రవికుమార్ నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా సీటీవో ప్రసాద బాబును పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వకపోతే జీతాలు కట్
జిల్లా ఖజానా అధికారి కేడీవీఎం ప్రసాద్‌బాబు విజయవాడ : బ్యాంక్ ఖాతాల వివరాలను అందించని ఉద్యోగుల జీతభత్యాలను ఆగస్టు ఒకటో తేదీ నుంచి నిలిపివేస్తామని జిల్లా ఖజానా అధికారి కేడీవీఎం ప్రసాద్‌బాబు తెలిపారు. ‘ఆన్లైన్ ఇ-పేమెంట్ విధానం’పై విజయవాడ పశ్చిమ డివిజనల్ ట్రెజరీకి చెందిన అధికారులు, సిబ్బందితో ఆయన శుక్రవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్‌బాబు మాట్లాడుతూ ఆగస్టు ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు ఖజానా కార్యాలయం ద్వారా చెల్లించే అన్నింటినీ ఆన్లైన్లో ఇ-పేమెంట్ ద్వారానే చేపట్టాలని సూచించారు. ఈ విధానాన్ని మొదటిసారిగా కృష్ణాజిల్లాలో విజయవాడ, నూజివీడు డివిజన్ల పరిధిలో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఖజానా కార్యాలయం ద్వారా జీతభత్యాలు చెల్లించే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలను సేకరించాలని ఆదేశించారు. జిల్లా ఖజానా సంచాలకులు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన డ్రాయింగ్ అధికారులుap.treasury.gov.inలో లాగిన్ అయ్యి తమ బిల్లులు సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. జూలై నెల జీతాల బిల్లులను ప్రభుత్వ అధికారులు సమర్పించే సమయంలోనే ప్రతి ఉద్యోగి తమ బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ కాపీ, బ్యాంక్ పేరు, ఎకౌంట్ నంబర్, ఉద్యోగి పేరు, బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలుంటే జిల్లా ఖజానాధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ సమావేశంలో ఉప ఖజానాధికారులు బి.మోహన్‌రావు, బి.రాణి, డి.ఉమామహేశ్వరి, బి.వసంత, సిబ్బంది బి.ఆనంద్, నరసింహారావు, కె.మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రసాద్‌కు ‘అశోకచక్ర’
సాక్షి, న్యూఢిల్లీ: నక్సల్స్‌ను ఎదుర్కోవడంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించడమేగాక.. సహచరులను కాపాడడం కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన రాష్ట్రానికి చెందిన గ్రేహౌండ్స్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ కేఎల్వీఎస్హెచ్ఎన్వీ ప్రసాద్‌బాబును భారత అత్యున్నత అవార్డు అశోక్చక్ర వరించింది. ప్రసాద్‌బాబు విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందినవారు. 2013, ఏప్రిల్ 16న ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని సుకుమా జిల్లాలోని కంచర్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టులతో వీరోచితంగా పోరాడి తొమ్మిది మందిని హతమార్చారు. ఈ సందర్భంగా సహచరులను కాపాడేక్రమంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ప్రభుత్వం 2013 సంవత్సరానికిగాను ఆయన్ను.. యుద్ధరంగంలో కాకుండా ఇతర ప్రదేశాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించే భదత్రా సిబ్బందికి ఇచ్చే భారత అత్యున్నత అవార్డు అశోక్చక్రకు ఎంపిక చేసింది. ఆదివారం 65వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును ప్రసాద్‌బాబు తండ్రి వెంకటరమణకు అందజేశారు. ప్రసాద్‌బాబు తన విధినిర్వహణలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని, సహచరులను కాపాడడం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం కొనియాడింది. వీరోచిత పోరు: గతేడాది ఏప్రిల్ 16న ప్రసాద్‌బాబు సారథ్యంలోని గ్రేహౌండ్స్ సిబ్బందిపై ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో సుమారు 70 మంది మావోయిస్టులు విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. దీంతో నిరుత్తరులైన గ్రేహౌండ్స్ సిబ్బందిని ప్రసాద్‌బాబు ఉత్తేజపరిచారు. తాను ముందుండి మావోయిస్టులతో పోరు సాగించారు. ఎదురుకాల్పుల్లో తొమ్మిదిమంది నక్సల్స్‌ను మట్టుబెట్టారు. అయితే ఆ మరుసటిరోజు కమాండోలను హెలికాప్టర్లో తరలించే క్రమంలో తొలి విడతలో 14మంది కమాండోలు ఎక్కివెళ్లిపోగా.. ప్రసాద్‌బాబుతో పాటు మరో నలుగురు కమాండోలు మిగిలి పోయారు. హెలికాప్టర్ వెళ్లిపోగానే మావోయిస్టులు వీరిని చుట్టుముట్టారు. దీంతో మిగతా నలుగురు కమాండోలను అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోమని ప్రసాద్‌బాబు సూచించి.. తానొక్కడే ఒంటిచేత్తో దాదాపు 200 మంది మావోయిస్టులను నిలువరించారు. సహచరుల ప్రాణాలు కాపాడేక్రమంలో తన ప్రాణాలను బలిదానం చేశారు. అలాంటి కొడుకును కన్నందుకు గర్వంగా ఉంది ‘మా అబ్బాయి అందరిలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి ఏసీ రూముల్లో పనిచేసుకోవాలనుకోలేదు. అంతా ఏసీ రూముల్లో కూర్చొని పనిచేస్తే.. అడవిలో ఎవరు పనిచేయాలంటూ పోలీసు ఉద్యోగంలోకి వెళ్లాడు. విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసేవాడు. తాను చనిపోయే ముందు ఎంతోమందిని కాపాడాడు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. దేశం పట్ల ప్రేమ, విధుల పట్ల అంకితభావం ఎలా ఉండాలో చేసిచూపాడు. ప్రసాద్ మా కుమారుడని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాం’ - ప్రసాద్ తల్లిదండ్రులు వెంకటరమణ, సత్యవతి