ప్రసాద్‌కు ‘అశోకచక్ర’
సాక్షి, న్యూఢిల్లీ: నక్సల్స్‌ను ఎదుర్కోవడంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించడమేగాక.. సహచరులను కాపాడడం కోసం తన ప్రాణాలను బలిదానం చేసిన రాష్ట్రానికి చెందిన గ్రేహౌండ్స్ రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ కేఎల్‌వీఎస్‌హెచ్‌ఎన్‌వీ ప్రసాద్‌బాబును భారత అత్యున్నత అవార్డు అశోక్‌చక్ర వరించింది. ప్రసాద్‌బాబు విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందినవారు. 2013, ఏప్రిల్ 16న ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని సుకుమా జిల్లాలోని కంచర్ల అటవీ ప్రాంతంలో మావోయిస్టులతో వీరోచితంగా పోరాడి తొమ్మిది మందిని హతమార్చారు. ఈ సందర్భంగా సహచరులను కాపాడేక్రమంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ప్రభుత్వం 2013 సంవత్సరానికిగాను ఆయన్ను.. యుద్ధరంగంలో కాకుండా ఇతర ప్రదేశాల్లో ధైర్యసాహసాలు ప్రదర్శించే భదత్రా సిబ్బందికి ఇచ్చే భారత అత్యున్నత అవార్డు అశోక్‌చక్రకు ఎంపిక చేసింది. ఆదివారం 65వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ అవార్డును ప్రసాద్‌బాబు తండ్రి వెంకటరమణకు అందజేశారు. ప్రసాద్‌బాబు తన విధినిర్వహణలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని, సహచరులను కాపాడడం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేశారని ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ప్రభుత్వం కొనియాడింది.
వీరోచిత పోరు: గతేడాది ఏప్రిల్ 16న ప్రసాద్‌బాబు సారథ్యంలోని గ్రేహౌండ్స్ సిబ్బందిపై ఆంధ్రా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతంలో సుమారు 70 మంది మావోయిస్టులు విరుచుకుపడి విచక్షణారహితంగా కాల్పులకు దిగారు. దీంతో నిరుత్తరులైన గ్రేహౌండ్స్ సిబ్బందిని ప్రసాద్‌బాబు ఉత్తేజపరిచారు. తాను ముందుండి మావోయిస్టులతో పోరు సాగించారు. ఎదురుకాల్పుల్లో తొమ్మిదిమంది నక్సల్స్‌ను మట్టుబెట్టారు. అయితే ఆ మరుసటిరోజు కమాండోలను హెలికాప్టర్‌లో తరలించే క్రమంలో తొలి విడతలో 14మంది కమాండోలు ఎక్కివెళ్లిపోగా.. ప్రసాద్‌బాబుతో పాటు మరో నలుగురు కమాండోలు మిగిలి పోయారు. హెలికాప్టర్ వెళ్లిపోగానే మావోయిస్టులు వీరిని చుట్టుముట్టారు. దీంతో మిగతా నలుగురు కమాండోలను అక్కడినుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోమని ప్రసాద్‌బాబు సూచించి.. తానొక్కడే ఒంటిచేత్తో దాదాపు 200 మంది మావోయిస్టులను నిలువరించారు. సహచరుల ప్రాణాలు కాపాడేక్రమంలో తన ప్రాణాలను బలిదానం చేశారు.
అలాంటి కొడుకును కన్నందుకు గర్వంగా ఉంది
‘మా అబ్బాయి అందరిలా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయి ఏసీ రూముల్లో పనిచేసుకోవాలనుకోలేదు. అంతా ఏసీ రూముల్లో కూర్చొని పనిచేస్తే.. అడవిలో ఎవరు పనిచేయాలంటూ పోలీసు ఉద్యోగంలోకి వెళ్లాడు. విధినిర్వహణలో అంకితభావంతో పనిచేసేవాడు. తాను చనిపోయే ముందు ఎంతోమందిని కాపాడాడు. నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. దేశం పట్ల ప్రేమ, విధుల పట్ల అంకితభావం ఎలా ఉండాలో చేసిచూపాడు. ప్రసాద్ మా కుమారుడని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాం’
- ప్రసాద్ తల్లిదండ్రులు వెంకటరమణ, సత్యవతి