వైఎస్‌ఆర్ జిల్లా, రాయచోటి : రాయచోటి అసెంబ్లీ టిక్కెట్‌పై సుగవాసి ప్రసాద్‌బాబుకు తమ పార్టీ అధినేత నుంచి సానుకూలత లభించలేదు. టీటీడీ బోర్డు సభ్యుని పదవి వద్దు.. అసెంబ్లీ టిక్కెట్ కావాలంటూ మంగళవారం ప్రసాద్‌బాబు తన తండ్రి రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఎస్.పాలకొండ్రాయుడును వెంటబెట్టుకుని ముఖ్యమంత్రిని కలిశారు. ముందుగా టీటీడీ పదవిని తీసుకుని దేవుని ఆశీస్సులు పొందాలని చంద్రబాబు సలహా ఇచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీలో సీనియర్ నాయకునిగా.. ముఖ్యమంత్రితో సమకాలికుడిగా పేరున్న సుగువాసి ప్రయత్నం ఫలితాన్ని రాబట్టలేకపోయింది. రాయచోటి అసెంబ్లీ టీడీపీ టిక్కెట్‌ను లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు తనయుడు ప్రసాద్‌బాబు ఆశిస్తున్నారు.
ఇదే విషయంపై పాలకొండ్రాయుడు పలుమార్లు సీఎంను కలిశారు కూడా. అయితే అనూహ్యంగా ప్రసాద్‌బాబును టీటీడీ బోర్డు మెంబరుగా ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అసెంబ్లీ టిక్కెట్టు కాకుండా రెండు, మూడు నెలల్లో ముగిసే బోర్డు మెంబరుగా ఎంపిక చేయడం సుగవాసి అనుయాయులు, అభిమానుల్లో ఆగ్రహాన్ని తెచ్చి పెట్టింది. అభిమానుల ఆగ్రహాలను పసిగట్టిన ప్రసాద్‌బాబు తనకు టీటీడీ పదవి వద్దని ప్రమాణస్వీకారానికి హాజరు కాలేదు. మంగళవారం తండ్రితో కలిసి విజయవాడలోని ముఖ్యమంత్రికి విషయాన్ని తెలియపరిచారు. తన కుమారునికి టిక్కెట్టును కేటాయిస్తే తప్పక గెలపించుకుని వస్తానని చెప్పినట్లు సమాచారం. వీరి మాటలపై స్పందించిన సీఎం టీటీడీ పదవిని ఎవ్వరో చెబితే ఇవ్వలేదన్నారు. ప్రసాద్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే బోర్డు మెంబరుగా ఎంపిక చేశానన్నారు. రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి ఎంపిక రాజంపేట పార్లమెంటు అభ్యర్థి ఎంపికతో ముడిపడి ఉందని సూచించినట్లు తెలిసింది. ఈనెల చివరిలో మీతో సంప్రదించిన తర్వాతనే రాయచోటి అభ్యర్థిని ప్రకటిస్తానని చెప్పి పంపినట్లు సుగువాసి వర్గీయుల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment