వ్యవసాయ రంగంలో నూతన అధ్యాయం | A new chapter in the field of agriculture | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రంగంలో నూతన అధ్యాయం

Published Tue, Jun 9 2020 4:26 AM | Last Updated on Tue, Jun 9 2020 4:26 AM

A new chapter in the field of agriculture - Sakshi

ప్యాలకుర్తి ఆర్‌బీకేలో రైతులతో మాట్లాడుతున్న ప్రసాద్‌బాబు

కర్నూలు (అగ్రికల్చర్‌): ‘వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రైతు భరోసా కేంద్రాలు దేశానికే రోల్‌ మోడల్‌గా మారనున్నాయి. గ్రామ స్థాయిలో వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఏర్పాటు కావటం.. ఇందులోనే వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు, అన్నిరకాల సేవలు అందుతుండటం విశేషం. ఏ అవసరమొచ్చినా రైతులు పట్టణాలకు పరుగులు తీయాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్య లేద’ని కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, సీనియర్‌ వ్యవసాయ శాస్త్రవేత్త జి.ప్రసాద్‌బాబు స్పష్టం చేశారు. ఆర్‌బీకేల వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సోమవారం ఆయన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి, వర్కూరు గ్రామాల్లోని నాలుగు రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. అనంతరం తాను పరిశీలించిన అంశాలను ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు.

అంతలోనే.. ఇంత మార్పా!
► నేను వెళ్లే సమయానికి మండల వ్యవసాయాధికారి అక్బర్‌బాషా, గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులు అక్కడే ఉండి రైతులకు సేవలందించటాన్ని గమనించాను. 
► అక్కడ రైతులు కూర్చోడానికి కుర్చీలున్నాయి. ర్యాక్‌లు వచ్చాయి. వ్యవసాయ పరిజ్ఞానాన్ని పెంచే పుస్తకాలు కూడా కనిపించాయి.
► నేను వెళ్లిన ఆర్‌బీకేల్లో డిజిటల్‌ కియోస్క్‌లు, ఎల్‌ఈడీ టీవీలు, ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన కషాయాల తయారీ స్టవ్, కుక్కర్లను చూశా. 
► వ్యవసాయ శాఖలో ఇంత మార్పును చూసి ఆశ్చర్యపోయా. రైతు గ్రామం విడిచి బయటకు రావాల్సిన అవసరం లేకుండానే ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందనే నమ్మకం కలిగింది. 
► ఇక్కడే ఈ–కర్షక్‌ యాప్‌లో పంటలను నమోదు చేసి.. ఉచిత పంటల బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నారు. 
► రైతులు తమకు కావాల్సిన వాటిని డిజిటల్‌ కియోస్క్‌ ద్వారా ఎంపిక చేసుకోవడం చూసి ఆశ్చర్యం వేసింది. 
► ప్యాలకుర్తి, వర్కూరు గ్రామాల్లో ఎరువుల కోసం కియోస్క్‌ ద్వారా అక్కడి రైతులు ఆర్డర్‌ పెట్టడాన్ని గమనించాను. వారి ఆర్డర్‌ విజయవంతమైనట్లు వెంటనే వారి సెల్‌కు మెసేజ్‌ వచ్చింది.
► ఏ కంపెనీ ఎరువు లేదా పురుగు మందు కావాలన్నా ఎంపిక చేసుకునే సదుపాయం ఉంది. 

భూసార పరీక్షలూ ఇక్కడే..
► గతంలో భూసార పరీక్షలు ప్రహసనంలా ఉండేవి. మట్టి నమూనాలు ఇస్తే.. వాటిని ఎప్పుడు పరీక్ష చేస్తారో తెలిసేది కాదు. పంటలు పూర్తయ్యే తరుణంలో ఫలితాలు ఇచ్చేవారు. 
► ఆర్‌బీకేల వల్ల ఈ సమస్య తీరిపోయింది. దాదాపు రూ.80 వేల విలువైన మట్టి పరీక్షల ప్రత్యేక కిట్‌లను ప్రభుత్వం ఆర్‌బీకేలకు సమకూర్చింది. 
► దీనివల్ల రైతులు ఎటువంటి జాప్యం లేకుండా పరీక్షలు చేయించుకుని వెంటనే ఫలితాలను పొందే అవకాశం కలిగింది. 
► రైతు భరోసా కేంద్రాల్లో బీటీ పత్తి రకాలతో పాటు కొర్ర, కందులు, వేరుశనగ, కూరగాయ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయి. 
► వాటి నాణ్యతను కూడా పరిశీలించాను. మంచి కంపెనీలకు చెందిన బ్రాండెడ్‌ విత్తనాలే ఉన్నాయి.

కియోస్క్‌ ద్వారా ఎరువులు బుక్‌ చేశా
గతంలో ప్రతి చిన్న అవసరానికీ కోడుమూరు లేదా కర్నూలుకు పోవాల్సి వచ్చేది. ఈ సారి వేరుశనగ విత్తనాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్‌బీకేలోనే పొందా. డిజిటల్‌ కియోస్క్‌ ద్వారా యూరియా, ఇతర ఎరువులను బుక్‌ చేశా. రైతులకు వ్యయ ప్రయాసలు లేవు. సమయం ఆదా అవుతోంది.
– సీతారాముడు, ప్యాలకుర్తి, కోడుమూరు మండలం

అవగాహన పెంచుకుంటున్నాం
రైతు భరోసా కేంద్రాల్లో పంటల గురించి ముందుగానే టీవీల్లో నిపుణులు ప్రాక్టికల్‌గా ఇచ్చే సూచనల వల్ల అవగాహన పెంచుకుంటున్నాం. మిరప సాగు పద్ధతులు, విత్తనాల ఎంపిక వంటి విషయాలను టీవీ ద్వారా తెలుసుకున్నాను. గ్రామంలోనే సబ్సిడీ వేరుశనగ విత్తనాలు పొందా. ఎరువులు, పురుగు మందుల కోసం ఆర్డర్‌ ఇచ్చి డబ్బు చెల్లిస్తే మరుసటి రోజునే సరఫరా చేస్తున్నారు.
– చిన్నరాముడు, ప్యాలకుర్తి, కోడుమూరు మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement