సుగవాసి ప్రసాద్‌బాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు ‘వాడుకో.. వదిలేయ్’ సూత్రాన్ని మరోమారు అమలు పర్చారు. రాయచోటి టీడీపీ అభ్యర్థిత్వం ఆశిస్తున్న సుగవాసి ప్రసాద్‌బాబును బైపాస్ చేశారు. మూడునెలల హోదా టీటీడీ సభ్యుడి పదవి కట్టబెట్టి.. కరివేపాకు అస్త్రం సంధించారు. తన సమకాలికుడైన మాజీ ఎంపీ పాలకొండ్రాయుడు కుటుంబం పట్ల కంటితుడుపు చర్యలకు పాల్పడ్డారు. చాణక్యం ప్రదర్శించి మరో దగాకు తెరలేపారని రాయుడు అనుచరులు వాపోతున్నారు.
సాక్షి ప్రతినిధి కడప: ‘ఏరు దాటేంతవరకూ ఏటి మల్లన్న, ఏరుదాటాక బోడి మల్లన్న’ అన్నరీతిలో టీడీపీ వ్యవహరిస్తోంది. అందుకు అనేక ఉదాహరణలు ప్రస్ఫుటం అయ్యాయి. ఎన్నికల్లో వాడుకొని వదిలేయడంలో తనను మించిన దిట్ట మరొకరు లేరని అనేక పర్యాయాలు ఆచరణలో ఆ పార్టీ నిరూపించింది. బద్వేల్‌లో ఎన్‌డి.విజయజ్యోతి, రైల్వేకోడూరులో ఓబిలి సుబ్బరామయ్య, కడపలో దుర్గాప్రసాద్, రాజంపేటలో మాజీ మంత్రి బ్రహ్మయ్య ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది తెరపైకి రానున్నారు. ఎన్నికల్లో వాడుకోవడం వదిలేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును మించిన నాయకుడు లేరని విశ్లేషకులు సైతం వివరిస్తున్నారు.
రాయుడు కుటుంబానికి భంగపాటు..
రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు కుటుంబం మరోమారు భంగపాటుకు గురైంది. చంద్రబాబుకు రాజకీయ సమకాలికుడైన పాలకొండ్రాయుడుకు ఎంపీగా, ఎమ్మెల్యేగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఈమారు తన కుమారుడు ప్రసాద్‌బాబుకు రాయచోటి టికెట్ కట్టబెట్టాలని పలుమార్లు కోరారు. అదేవిషయాన్ని టీడీపీ అ«ధిష్టానానికి స్పష్టం చేశారు. కాగా టికెట్ రేసులో ఉన్న ప్రసాద్‌బాబును తప్పించేందుకు టీడీపీ బోర్డు మెంబర్ పదవి కట్టబెడుతూ ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రభుత్వం పట్టుమనిమూడు నెలలు గడువు మాత్రమే ఉంది. ఎన్నికల తర్వాత ‘రాజు ఎవరో.. రౌతు ఎవరో’ తెలియదు. మూడు నెలల పదవి అప్పగించి అభ్యర్థిత్వం రేసు నుంచి తప్పిస్తారనని రాయుడు వర్గీయులు మండిపడుతున్నారు. టీడీపీ కోసం నిబద్ధతతో ఉన్న మమ్ముల్ని కాదని, ఆర్‌ఆర్ సోదరులకు ప్రాధాన్యత ఇస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ప్రసాద్‌బాబు ఇమేజ్ అధికంగా ఉన్నా తప్పిస్తారనని సీఎం చర్యలపై మండిపడుతున్నారు. రాయచోటిలో రాయు డు కుటుంబం మద్దతు లేకుండా టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని, ఈ వాస్తవాన్ని గ్రహించిన అధిష్టానం రాయుడు కుటుంబాన్ని వ్యూహాత్మకంగా తప్పిస్తున్నారని వారు వివరిస్తున్నారు. మరోవైపు టీడీపీలో బలిజలకు ప్రాధాన్యత లేదని బ్రోకర్లు పెత్తనం అధికమైందనీ, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కడపలో చేసిన ఆరోపణలు టీడీపీ చర్యలకు బలం చేకూరుస్తున్నాయి.
వాడుకొని వదిలేయడంలో దిట్ట..
అవసరానికి వాడుకొని వదిలేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు దిట్టని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఆదినారాయణరెడ్డి, జయరాములుకు ఎర వేశారు. ఆమేరకు టీడీపీలో చేర్పించుకొని క్రియాశీలక రాజకీయాలల్లో ప్రధానంగా వాడుకున్నారు. ఎన్నికలు సమీపించే కొద్ది అభ్యర్థిత్వం వ్యవహారంలో మొండిచేయి ప్రదర్శిస్తున్నారు. మంత్రి ఆదికి టీడీపీ ఓడిపోయే ఎంపీ సీటు అయినా కట్టబెట్టనున్నారు. జయరాములకు ఎలాంటి భరోసా దక్కడం లేదని పలువురు వివరిస్తున్నారు. అవసరానికి ఎమ్మెల్యేలను వాడుకొని ఆపై విస్మరిస్తున్నారని, సీఎం ఎప్పుడు, ఎవర్నీ ఎలా వాడుకోవాలనే బాగా తెలిసిన వ్యక్తి అంటూ స్వయంగా ఆయా నేతలే అనుచరుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. వైఎస్సార్‌సీపీ కంటిని అదే చేతితో పొడిచేందుకు పార్టీ ఫిరాయించిన మమ్మల్ని వాడుకొని ఎన్నికలు సమీపించే కొద్ది ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని వాపోతున్నట్లు తెలుస్తోంది. కాగా సీఎం చంద్రబాబు తన చాణక్యాన్ని తాజాగా సుగవాసీ ప్రసాద్‌బాబుపై ప్రదర్శించారని విశ్లేషకులు వివరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment