కూసుమంచి, న్యూస్‌లైన్: బ్యాంకులో దాచుకున్న డబ్బుకు కూడా రెక్కలొస్తాయని ఎవరూ ఊహించరు...కానీ, వచ్చాయి. నమ్మకంగా పనిచేయాల్సిన బ్యాంకు సిబ్బందే ఖాతాదారులు దాచుకున్న సొమ్మును దోచేశారు. ఆసొమ్ముతో విలాసాలు, జల్సాలు చేశారు. చివరకు కటకటాలపాలయ్యారు. నాయకన్‌గూడెం ఎస్‌బీఐలో బ్యాంకు అకౌంటెంట్ మార్పు కాంతారావు, క్యాషియర్లు బాణోత్ సుథీర్‌సింగ్ , ఈసాల రవికుమార్ సంవత్సర కాలంగా బ్యాంకులో మేనేజర్ లేని సమయంలో అక్రమాలకు తెరలేపారు. అదే బ్యాంకులో పనిచేస్తున్న సబార్డినేట్ గఫార్‌ను కూడా వారి అక్రమాల్లో కి లాగారు. అతనికి అంతోఇంతో ఇచ్చేవారు. ఈ బ్యాంకు పరిధిలో లో కూసుమంచి మండలంలోని ఐదు గ్రామాలు ఉండగా సమీప నల్గొండ జిల్లా మోతె మండలానికి చెందిన పలు గ్రామాల వారు ఇక్కడ లావాదేవీలు సాగిస్తున్నారు.
జనం సొమ్ముచూసి దుర్బుద్ధి....
విచారణలో వెలుగులోకి వచ్చిన పలు అంశాలు పరిశీలిస్తే బ్యాంకు సిబ్బంది చేసిన అక్రమం ఆశ్చర్యపరుస్తోంది. వారు బ్యాంకుకు దీటుగా సొంత బ్యాంకును నడిపించారు. ఖాతాదారులు నగదును సేవింగ్స్, కరెంటు ఖాతాల్లో జమ చేసేందుకు బ్యాంకుకు రాగా వారిలో కొందరి నగదును బ్యాంకులో జమ చేయకుండానే వారికి టీడీఆర్ రసీదును ఇచ్చేవారు. తమ నగదు ఖాతాల్లో జమ అయిందని ఖాతాదారులు భావించేవారు. ఏ ఖాతాదారుల నగదునైతే జమ చేయకుండా వాడుకున్నారో వారి పేర్లను ఒక నోట్‌బుక్‌లో రాసుకునేవారు. ఒక వేళ అట్టి ఖాతాదారులు ఎప్పుడైనా నగదు కోసం బ్యాంకుకు వస్తే వారిని గుర్తించి ఆ రోజు జరిగే లావాదేవీల్లో డబ్బును తీసి వారికి చెల్లించేవారు. లావాదేవీల్లో ఖాతాదారులకు చెల్లిచేంత డబ్బు రాకపోతే బ్యాంకులో ఉన్న వేరే వ్యక్తుల ఖాతాల నుంచి ఫోర్జరీ సంతకాల ద్వారా నగదును వారే డ్రాచే సి చెల్లించేవారు. వీరు తాము స్వాహా చేసే సొమ్ము కు సంబంధించిన జమ, చెల్లింపుల వివరాలను బ్యాం కు లెడ్జర్లలో రాయకపోవడంతో బ్యాలెన్స్ షీట్‌లో తేడా కనిపించేది కాదు. దీంతో బ్యాంకు మేనేజర్‌కు, ఆడిట్ బృందానికి వీరు దొరకలేదు.
గుట్టురట్టు అయిందిలా...
పాపం పండితే దాగదు అన్నట్లుగా.... సెప్టెంబర్ 2న బ్యాంకు ఖాతాదారుడు పోటు వీరబాబు బ్యాంకులో రూ.4 లక్షలు డిపాజిట్ చేయగా అతనికి క్యాషియర్ సుధీర్ సింగ్ టీడీఆర్ రసీదును ఇవ్వకుండా తర్వాత తీసుకోమన్నారు. 10రోజుల తర్వాత బ్యాంకుకు వచ్చిన సదరు ఖాతాదారుడు మేనేజర్ వద్దకు వెళ్లి తనకు రసీదు ఇవ్వని విషయంపై ఫిర్యాదు చేశాడు. దీంతో మేనేజర్ క్యాషియర్‌ను పిలిచి అడగటంతో ఖాతాలో రూ.4 లక్షలు వేసినట్లు రసీదు ఇచ్చాడు. అయితే ఇచ్చిన రసీదులో ఆరోజు తేదీ వేసి ఇవ్వడంతో ఖాతాదారుడు తనకు 10 రోజుల వడ్డీ ఎవరిస్తారని నిలదీశాడు. దీంతో పాటు అదే నెల 17న మరోమారు రూ.77వేలు బ్యాలెన్స్‌షీట్‌లో తేడారాగా మేనేజర్ శిరీష క్యాషియర్ సుధీర్‌సింగ్‌పై అనుమానంతో ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేశారు. విచారణలో పలు అనుమాలు రావటంతో సదరు క్యాషియర్‌ను వేరే బ్యాంకుకు బదిలీ చేశారు. కానీ అతను రిలీవ్ కాలేదు. ఇదే క్రమంలో మేనేజర్ అక్టోబర్ 3 నుంచి 20 వరకు విదేశాలకు వెళ్లి రావటం అనంతరం అక్టోబర్ 22వరకు శిక్షణ నిమిత్తం వెళ్లటంతో సుధీర్‌సింగ్‌తోపాటు కాంతారావు, రవికుమార్ తమ గుట్టు రట్టుకాకుండా ఉండేందుకు మేనేజర్ వచ్చేలోగా ఇబ్బందులు లేకుండా చూడాలని భావించారు.
గత నెల 17 తేదీ నుంచి తాము స్వాహా చేసిన ఖాతాల్లో నగదు జమలు, చెల్లింపులు అయినట్లుగా చూపిస్తూ వస్తున్నారు. అలాగే ఎక్కువ మొత్తంలో డబ్బులు నిల్వ చేసిన అమాయక ఖాతాదారులను పిలిచి వారితో ఇన్‌కంటాక్స్ పడుతుం దని భయపెట్టి వారి ఖాతాల్లో సొమ్మును తీసి కొత్త ఖాతా ల్లో వేస్తున్నామని నమ్మించి వారి సొమ్మును తాము స్వాహాచేసిన వారి ఖాతాల్లోకి బదిలీచేశారు. ఈ క్రమంలో గత నెల 22న రూ.6.60 లక్షలు వారు సర్దుబాటు చేయలేకపోవటంతో బ్యాలెన్స్ షీట్‌లో తేడా వచ్చింది. కాగా తెల్లారే సుధీర్‌సింగ్ రిలీవ్ కావల్సి ఉంది. దీంతో అకౌం టెంట్ తనమీదకు వస్తుందని కంగారుపడి లెక్కతేడా వచ్చినట్లు శిక్షణకు వెళ్లిన మేనేజర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వెంటనే ఆమె బ్యాంకుకు చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. వారి విచారణలో ఏడాదిగా సాగుతున్న అక్రమాల తంతు బయటపడింది.
దాచేవారే... దోచేశారు!
Published Fri, Nov 8 2013 3:20 AM | Last Updated on Tue, Aug 28 2018 8:05 PM
Advertisement
Advertisement