కూసుమంచి, న్యూస్‌లైన్: ఖాతాదారుల సొమ్మును దిగమింగిన బ్యాంకు సిబ్బంది చివరికి కటకటాలపాలయ్యారు. కూసుమంచి మండలం నాయకన్‌గూడెం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో సొమ్ము స్వాహాకు గురైన విషయం విదితమే. అక్షరాల రూ.53,85,100 ఖాతాదారుల సొమ్మును అప్పనంగా బొక్కేసిన నలుగురు బ్యాంకు సిబ్బంది గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టుచేయగా....అక్రమార్కులను గురువారం కూసుమంచి పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. కూసుమంచి సీఐ నరేష్‌రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు...
నాయకన్‌గూడెం ఎస్‌బీఐలో గతనెల 22న బ్యాంకు బ్యాలెన్స్ షీట్‌లో రూ.6.60 లక్షలు తేడా వచ్చినట్లు బ్యాంకు మేనేజర్ శిరీష గుర్తించారు. ప్రధాన క్యాషియర్ సుధీర్‌సింగ్, సహాయ క్యాషియర్ రవికుమార్‌లపై అనుమానం వ్యక్తం చేస్తూ వెంటనే వారిని పోలీసులకు అప్పగించారు. అనంతరం రంగంలోకి దిగిన బ్యాంకు విజిలెన్స్ అధికారులు పదిరోజుల పాటు విచారణ చేశారు. ఈ విచారణలో బ్యాంకు ఖాతాదారులకు చెందిన రూ.53,83,100 సొమ్ము గల్లంతైనట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. బ్యాంకు అకౌంటెంట్ మార్పు కాంతారావు, క్యాషియర్ బానోతు సుధీర్‌సింగ్, అసిస్టెంట్ క్యాషియర్ ఈసాల రవికుమార్‌లు ఈ స్వాహా పర్వానికి పాల్పడినట్టు అధికారికంగా ధ్రువీకరించారు. ఈ వ్యవహారంలో బ్యాంకు కాంట్రాక్టు ఉద్యోగి షేక్ గఫార్ కూడా సహకరించినట్లు నిర్ధారణ కావటంతో బ్యాంకు ఉన్నతాదికారుల ఫిర్యాదుతో నలుగురు సిబ్బందిని గురువారం కూసుమంచి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో సుధీర్‌సింగ్ నుంచి రూ. 1.70 లక్షలు,ద్విచక్ర వాహనం.., రవి నుంచి రూ. 3 లక్షలు నగదును రికవరీ చేశామని సీఐ తెలిపారు.
ఏడాదిగా సాగుతున్న స్వాహా పర్వం..
నాయకన్‌గూడెం ఎస్‌బీఐలో గత ఏడాదిగా ఖాతాదారుల సొమ్మును నిందితులు స్వాహా చేస్తున్నట్లు సీఐ వివరించారు. అకౌంటెంట్ కాంతారావు సుమారు రూ.15.85 లక్షలు, క్యాషియర్ సుధీర్‌సింగ్ రూ. 25లక్షలు, క్యాషియర్ రవికుమార్ రూ.13 లక్షలు స్వాహాకు పాల్పడ్డట్టు తెలిపారు. వీరు అట్టి సొమ్మును స్వాహా చేసేందుకు చాకచక్యంగా వ్యవహరించేవారని, ఖాతాదారులకు అనుమానం రాకుండా ప్రణాళికాబద్దంగా వ్యవహరించేవారని తెలిపారు. తమ గుట్టు ఎవరికీ తెలువకుండా ఉండేందుకు బ్యాంకు అకౌంటెంట్ కాంతారావు ఇటీవల బ్యాంకులోని సీసీ కెమెరాలను కూడా తగులబెట్టినట్లు విచారణలో తేలిందన్నారు. కాగా వీరు బ్యాంకు కాంట్రాక్టు ఉద్యోగి గఫార్‌తో ఓచర్లపై ఫోర్జరీ సంతకాలు చేయించి డబ్బులు డ్రా చేసేవారని తెలిపారు. ఇట్టి డబ్బుతో వారు జల్సాలకు పాల్పడేవారని తెలిపారు. వీరిలో సుధీర్‌సింగ్ కారు, బంగారు ఆభరణాలు కొనుగోలు చేశాడని సీఐ తెలిపారు. నిందితులు స్వాహా చేసిన మొత్తానికిగానూ వారి ఆస్తులను ఎటాచ్ చేయనున్నట్లు సీఐ తెలిపారు.
ఆ నలుగురికి అరదండాలు...
Published Fri, Nov 8 2013 3:13 AM | Last Updated on Tue, Aug 28 2018 8:05 PM
Advertisement
Advertisement