రైతన్నల బతుకుల్లో చీకట్లు | Bank loans to pay notices | Sakshi
Sakshi News home page

రైతన్నల బతుకుల్లో చీకట్లు

Published Tue, Jan 13 2015 2:38 AM | Last Updated on Fri, Jul 6 2018 3:37 PM

రైతన్నల బతుకుల్లో చీకట్లు - Sakshi

రైతన్నల బతుకుల్లో చీకట్లు

4,16,548 మంది రైతులకు మొండిచేయి  
రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్ల నోటీసులు
పూటకో షరతుతో రైతన్నలకు సాంత్వన చేకూర్చని రుణ మాఫీ
వడ్డీ.. అపరాధవడ్డీ తడిసిమోపెడవడంతోఆర్థిక సంక్షోభం
సంక్రాంతి సంబరాలకు ప్రభుత్వం రూ. రెండు కోట్ల వ్యయం

 
ప్రభుత్వం  సంక్రాంతి సంబరాల్లో ఆర్భాటంగా మునిగితేలుతుంటే.. రైతన్నలు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. రుణ మాఫీ అయిన మేరకు మినహా తక్కిన మొత్తాన్ని కట్టాలంటూ బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తున్నారు. నెలాఖరులోగా చెల్లించకుంటే బంగారు ఆభరణాలు వేలం వేస్తామంటూ  ఇస్తున్న నోటీసులు రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. వడ్డీ.. అపరాధవడ్డీ కలిసి అప్పు తడిసిమోపడవడంతో చెల్లించే దారి తెలియక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. జిల్లాలో ఇప్పటికే ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఇందుకు తార్కాణం.
 
 
తిరుపతి: రైతు రుణమాఫీని పట్టించుకోని చంద్రబాబు సర్కార్‌పై రైతులు మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రోజుకో తిరకాసు.. పూటకో షరతుతో రుణ మాఫీని నీరుగార్చారు. ఒక్కో కుటుంబానికి గరిష్టంగా రూ.1.50 లక్షల పంట రుణం మాఫీ చేస్తానని పేర్కొన్న చంద్రబాబు.. దాన్ని కూడా ఐదు విడతల్లో అందిస్తానని సెలవిచ్చారు. రూ.50 వేల లోపు రుణాలను ‘స్కేల్ ఆఫ్ ఫైనాన్స్’తో నిమిత్తం లేకుండా ఒకేసారి మాఫీ చేస్తామని ప్రకటించి.. ఆ నిబంధనకు నీళ్లొదిలారు. జిల్లాలో 8,70,321 మంది రైతులు డిసెంబర్ 31, 2013 నాటికి రూ.11,180.25 కోట్ల వ్యవసాయ రుణాల రూపంలో బ్యాంకర్లకు బకాయిపడ్డారు. ఇందులో 4,53,162 మంది రైతులకు బంగారు నగలు తాకట్టుపై రూ.3486.50 కోట్లను వ్యవసాయ రుణంగా పొందారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు 5.63 లక్షల మంది రైతులకు సంబంధించిన ఆధార్‌కార్డులు, రేషన్‌కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లు, భూమి రికార్డులను అనుసంధానం చేసి.. ఆ రైతులందరూ మాఫీకి అర్హులుగా తేల్చిన బ్యాంకర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. కానీ.. ప్రభుత్వం తొలి విడత 3,06,544 మంది రైతులకు మాఫీని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

రెండో విడత 1,42,229 మంది రైతులకు రుణమాఫీ వర్తింపజేసే అవకాశం ఉందని సమాచారం. అంటే.. 4,53,773 మంది రైతులకే మాఫీ వర్తింపజేసినట్లు స్పష్టమవుతోంది. 4,16,548 మంది రైతులకు మొండిచేయి చూపింది. ప్రభుత్వం విధించిన షరతులతో రుణాలపై వడ్డీ మేర కూడా మాఫీ కాకపోవడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. రూ.11,180.25 కోట్ల వ్యవసాయ రుణాలకుగానూ రూ.600 కోట్ల మేర మాత్రమే మాఫీ అయినట్లు బ్యాంకర్లు తేల్చారు. ఏడు నెలల్లో వ్యవసాయ రుణాలపై రూ.939 కోట్ల మేర అపరాధ వడ్డీ పడింది. వడ్డీ మేర కూడా మాఫీ కాకపోవడంతో ఆందోళన ఉన్న రైతులను బ్యాంకర్లు మరింత ఒత్తిడికి గురిచేస్తున్నారు. మాఫీ అయిన మొత్తం మినహా తక్కిన రుణాన్ని చెల్లించాలంటూ నోటీసుల మీద నోటీసులు జారీచేస్తుండడం.. బంగారు ఆభరణాలను వేలం వేస్తామంటూ ప్రకటనలు ఇస్తుండడం రైతన్నల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తోంది. ఇది ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. రైతుల బతుకుల్లో చీకట్లు నింపిన చంద్రబాబు ప్రభుత్వం.. రూ.రెండు కోట్లను వెచ్చించి మంగళవారం తిరుపతిలో సంక్రాంతి సంబరాలు చేసుకుంటుండడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement