
బ్యాంక్‌ను ముట్టడించిన మహిళలు
రుణాల కోసం నిరసన
మేనేజర్ పక్షపాత వైఖరిపై మండిపాటు
మంత్రాలయం : రుణాలు ఇవ్వాలంటూ స్థానిక స్టేట్ బ్యాంక్‌ను బుధవారం మహిళలు ముట్టడించారు. మొత్తం 53 పొదుపు సంఘాల మహిళలు నిరసనలో పాల్గొన్నారు. చెట్నెహళ్లి, చిలకలడోణ, మంత్రాలయానికి చెందిన గ్రూపు మహిళలు 11.30 గంటల సమయంలో బ్యాంకు వద్దకు చేరుకుని నినాదాలు చేస్తూ బైఠాయించారు. మూడు గంటల పాటు బ్యాంకు గేట్లు మూసేసి ఆందోళన చేపట్టినా బ్యాంకు మేనేజర్ సురేష్ అత్రేయ స్పందించలేదు. దీంతో మహిళలు మూకుమ్మడిగా బ్యాంకులోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఏఎస్‌ఐ బీఎస్ మూర్తి నేతృత్వంలో పోలీసులు వారిని నిలవరించారు. కొందరు గ్రూపు లీడర్లను బ్యాంకులో ప్రవేశానికి అనుమతించారు.
మిగతా గ్రూపు రుణాలు వసూలు చేసేంత వరకు తానేమీ చేయలేనని మేనేజర్ చెప్పడంతో మహిళలు అక్కడే బైఠాయిస్తామని భీష్మించారు. ఈ సందర్భంగా పొదుపు మహిళ సంఘాల లీడర్లు మాట్లాడుతూ.. రుణమాఫీతో సంబంధం లేకుండా 38 గ్రూపులు రుణాలు చెల్లించాయన్నారు. ఏడాదిగా రుణాల కోసం తిరుగుతున్నా చలించడం లేదన్నారు. అలాగే కొత్తగా 15 పొదుపు గ్రూపులు పొదుపు చేస్తున్నా బ్యాంకు లింకేజీ రుణం ఇవ్వడం లేదన్నారు. రుణాల మంజూరులో పక్షపాతం చూపుతూ తమను సతాయిస్తున్నారని వాపోయారు. ఇటీవల శ్రీఖర్ గ్రూపునకు రుణం మంజూరు చేశారన్నారు. ఆందోళనలో పొదుపు సంఘాల లీడర్లు పద్మావతి, జానమ్మ, ఆదిలక్ష్మి, పుష్పావతి, నాగరత్న, లక్ష్మి, సిద్దమ్మతోపాటు 200 మంది మహిళలు పాల్గొన్నారు.