జవహర్, చిట్టిమాము నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు, మద్యం సీసాలు...(ఇన్‌సెట్) ఓ మహిళతో జవహర్ బాలకృష్ణన్ చేసిన చాటింగ్
సాక్షి, విశాఖపట్నం: ఒంటరి, వితంతు మహిళలే టార్గెట్... సోషల్ మీడియా వేదికగా వారికి వల వేసి నమ్మించడం... అనంతరం పెళ్లి చేసుకుని దొరికిన కాడికి దోచుకుని పరారవడం... ఇదీ జవహర్ బాలకృష్ణన్ అలియాస్ బాలాకుమార్ బాగోతం. ఒకరు కాదు... ఇద్దరు కాదు... సుమారు 30 మంది మహిళలను మోసగించిన ఈ కేటుగాడు జూన్ 6న చిట్టి మాము గ్యాంగ్‌తో కలిసి మాదకద్రవ్యాలు తరలిస్తూ టాస్క్‌ఫోర్సు పోలీసులకు చిక్కాడు. అప్పటి నుంచి విచారిస్తుంటే పోలీసులే విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్‌ఫోర్సు ఏసీపీ త్రినాథ్ వెల్లడించిన వివరాల ప్రకారం... కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ప్రాంతానికి చెందిన చిలకూరి జవహర్ బాలకృష్ణన్ సులువుగా డబ్బులు సంపాదించేందుకు మహిళలను లక్ష్యంగా చేసుకున్నాడు.
విడాకులు తీసుకుని, బాగా డబ్బులు ఉండి రెండో పెళ్లి కోసం ఎదురుచూసే మహిళలు... భర్త చనిపోయి మరో పెళ్లి కోసం ఎదురు చూసే డబ్బున్న మహిళలనే టార్గెట్ చేస్తూ మ్యాట్రిమోనీ, ఫేస్‌బుక్, వాట్సాప్‌ల సాయంతో పరిచయం పెంచుకునేవాడు. తన ఫొటోలు, ఇతర వివరాలు పంపించడంతో సదరు మహిళలు సులువుగా నమ్మేసేవారు. అనంతరం వారిని పెళ్లి చేసుకుని నమ్మకంగా ఉంటూ కొద్ది రోజుల తర్వాత డబ్బు, నగలుతో పరారయ్యేవాడు. మరికొందరితో చనువుగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు చూపించి డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఇలా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు 30 మంది మహిళను మోసం చేసినట్లు తెలిసింది. ఇలా మోసపోయిన వారిలో 17 మంది పోలీసులను ఆశ్రయించడంతో కేసులు నమోదు చేశారు. మరోవైపు పలువురు వ్యాపారవేత్తలకు ప్రాంచైజీలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకుని మోసం చేయడంతో పలు రాష్ట్రాల్లో 25 వరకు కేసులున్నాయి. విశాఖలోనూ మూడు కేసులు నమోదయ్యాయి.
చిట్టిమాముతో జట్టుకట్టి...
ఓ మోసం కేసులో జవహర్ బాలకృష్ణన్‌ను అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు ఆరిలోవలోని కేంద్ర కారాగారానికి కొన్ని నెలల కిందట తరలించారు. అక్కడే జైలులో రౌడీషీటర్ చిట్టిమాముతో బాలకృష్ణన్‌కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా స్నేహంగా మారింది. ఇంతలో కరోనా మహమ్మారి కారణంగా జైలు నుంచి రెండు నెలల కిందట కొంతమంది ఖైదీలను విడుదల చేశారు. ఆ సమయంలో జైలు నుంచి బయటకు వచ్చిన బాలకృష్ణన్ వెంటనే చిట్టిమాము గ్యాంగ్‌లో చేరాడు. అప్పటి నుంచి చిట్టిమాముతో కలిసి నగరంలో పలు సెటిల్‌మెంట్లు చేశాడు.
పట్టించిన పుట్టినరోజు వేడుక
జైలు నుంచి విడుదలయ్యాక రౌడీషీటర్ చిట్టిమాము పుట్టిన రోజు వేడుకను ఈ నెల 5న కూర్మనపాలెం ప్రాంతంలోని అక్షిత గ్రాండ్ హోటల్‌లో నిర్వహించారు. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్సు పోలీసులు ఒక్కసారిగా దాడి చేయగా 30 మంది చిక్కారు. వారందరిపైనా లాక్‌డౌన్ ఉల్లంఘన కేసులు నమోదు చేశారు. అయితే కీలకమైన చిట్టిమాముతోసహా ఐదుగురు పరారయ్యారు. వారికోసం గాలిస్తున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులకు మరుసటి రోజు జూన్ 6న తెల్లవారుజామున జాతీయ రహదారిపై 20 కిలోల గంజాయి, రూ.1.5లక్షల నగదు, 24 బీరు బాటిళ్లు, మూడు మద్యం సీసాలు కారులో తరలిస్తూ చిక్కారు. చిట్టిమాము, జవహర్, ఆనంద్, మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారిని ఏసీపీ త్రినాథ్ ఆధ్వర్యంలో విచారించగా జవహర్ బాలకృష్ణన్ అంతర్రాష్ట్ర మోసగాడని గుర్తించారు. మరింత లోతుగా విచారించడంతో మోసాలన్నీ వెలుగులోకి రావడంతో పోలీసులే విస్తుపోతున్నారు. మరిన్ని వివరాల కోసం ఇంకా లోతుగా దర్యాప్తు చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీపీ త్రినాథ్ పేర్కొన్నారు.
రౌడీషీటర్లపై నిఘా పెంచుతున్నాం
మాదకద్రవ్యాలు తరలిస్తున్నారన్న సమాచారంతో జూన్ 5న కూర్మన్నపాలెంలోని ఓ ఫంక్షన్ హాల్‌పై దాడి చేసి 30 మందిని అదుపులోకి తీసుకున్నాం. మమ్మల్ని చూసి పరారైన వారిపై అనుమానంతో గాలించగా మరుసటి రోజు చిట్టిమాము, జవహర్ బాలకృష్ణన్ చిక్కారు. విచారణలో బాలకృష్ణన్ బండారం బయటపడింది. ఈ నేపథ్యంలో నగరంలోని రౌడీïÙటర్‌లపై నిఘా పెంచుతున్నాం. తప్పు చేసి ఎవరూ తప్పించుకోలేరు. – త్రినాథ్, ఏసీపీ, టాస్‌్కఫోర్స్
Comments
Please login to add a commentAdd a comment