లోబ్యాటరీ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చన్న నిపుణులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం/పుట్టపర్తి అర్బన్, తాండూరు, న్యూస్‌లైన్: విద్యుత్ వైరింగ్‌లో నాసిరకమైన వస్తువులు వినియోగించడం వల్ల నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం జరిగిఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లోబ్యాటరీ సమస్య తలెత్తడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయిఉండవచ్చని ఏసీ కోచ్‌ల పర్యవేక్షక ఇంజనీర్ అనుమానం వ్యక్తం చేసినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. బోగీల నిర్వహణను రైల్వే శాఖ కాంట్రాక్టర్లకు అప్పగిస్తోంది. బ్యాటరీలను సమకూర్చడం, ఏసీ బోగీల్లో వైరింగ్ వంటి పనులను కాంట్రాక్టర్లే చేస్తున్నారు. వారు నాసిరకం బ్యాటరీ లను సరఫరా చేస్తున్నారనడానికి తరచూ బ్యాటరీల్లో సమస్యలు తలెత్తుతుండటమే తార్కాణం. ప్రమాదం చోటుచేసుకున్న తర్వాత బీ1 బోగీని తప్పించి.. తక్కిన బోగీల్లోని ప్రయాణికులను అదే రోజున నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో రైల్వే అధికారులు తరలించారు. రైలు గుంతకల్లు రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే.. ఏసీలు పనిచేయడం లేదని, పొగలు వస్తున్నాయని త్రీటైర్, టూటైర్, ఫస్ట్‌క్లాస్ బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. బ్యాటరీల్లో చార్జింగ్ అయిపోవడం వల్లే ఏసీలు పనిచేయడం లేదని, అందువల్లే విద్యుత్ షార్ట్ సర్క్యూటై ఏసీల్లో పొగలు వస్తున్నాయని గుర్తించిన ఇంజనీర్లు.. బ్యాటరీలను చార్జింగ్ చేసి రైలును పంపించారు. లోబ్యాటరీ సమస్య వల్లే ప్రమాదం జరిగిందనడానికి ఈ ఘటన బలం చేకూరుస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రమాదంపై మంగళవారం నుంచి బహిరంగ విచారణ చేపడుతున్నారు.
ఊపిరాడకే ఎక్కువ మంది మృతి: బోగీలో దట్టంగా కమ్ముకున్న పొగవల్ల ఊపిరాడక ఎక్కువమంది మరణించినట్లు ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్తున్నారు. బోగీని సోమవారం క్షుణ్ణంగా పరిశీ లించి, మృతుల వస్తువులు, శిథిలాలు, బూడిదను సేకరించి భద్రపరిచామని ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ డెరైక్టర్ శారదా అవధానం తెలి పారు. బోగీలో పురుగుమందుల అవశేషాలు లభ్యమయ్యాయని, వాటికి మండే గుణం ఉందో లేదో పరీక్షలో తేలుతుందన్నారు.
డీఎన్‌ఏ పరీక్షల తర్వాతే మృతుల ప్రకటన
లలిత - బెంగళూరు(61), పద్మిని -బెంగళూరు(61), ఈశ్వర్ నాగ్రే -ఔరంగాబాద్(70), కవితా నాగ్రే -ఔరంగాబాద్(61), శ్రీలత-అనంతపురం (26), డాక్టర్ అస్రా -రాయచూరు(32), మహమ్మద్ రఫీ -రాయచూరు(2), ఇబ్రహీం రహీ -రాయచూరు(31), బల్బీర్ కౌర్ -బెంగళూరు(52), అమన్ ప్రీత్ కౌర్ -బెంగళూరు(24), రాహుల్ -బెంగళూరు(25), శ్రీనివాస్ -అనంతపురం(28).. వీరంతా మృతి చెందారా, లేదా అనే విషయాన్ని డీఎన్‌ఏ పరీక్షల అనంతరం ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.
ఏసీ కోచ్‌లో షార్ట్ సర్క్యూట్
విజయవాడ రైల్వే స్టేషన్‌లో తృటిలో తప్పిన ప్రమాదం
విజయవాడ, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్ ఘటన మరువకముందే సోమవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లో నిలిచిఉన్న రైలు ఏసీ కోచ్‌లో పొగలు వచ్చాయి. విద్యార్థుల విహారయాత్రకు ఈనెల 24న ముంబైలో బయలుదేరిన రైలును సోమవారం విజయవాడలో మెయింటెనెన్స్ నిమిత్తం నిలిపివేశారు. ఆ రైలు ఏసీ కోచ్‌లో ఒక్కసారిగా పొగ, నిప్పురవ్వలు విరజిమ్మాయి. విద్యార్థులు అదనంగా విద్యుత్ వైర్లను ఏర్పాటు చేయడంతో అవి షార్ట్‌సర్క్యూటై పొగలు వ్యాపించినట్లు రైల్వే ఎలక్ట్రికల్ సిబ్బంది గుర్తించారు. ఆ రైలును రైల్వే యార్డులోకి తరలించి మరమ్మతులు చేపట్టారు.
బ్యాటరీ సమస్య వల్లే బోగీ బుగ్గి!
Published Tue, Dec 31 2013 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM
Advertisement
Advertisement